తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన పలు బిల్లులకు నెలల తరబడి ఆమోదం తెలపకుండా కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లోకి నెట్టేందుకు ప్రయత్నం చేస్తున్న గవర్నర్ డా. తమిళసై సౌందరరాజన్ ఇప్పుడు సుప్రీంకోర్టు స్కానింగ్ కిందకు వచ్చాయి. ఆమె బిల్లులు ఆమోదించాక పోవడంపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ సోమవారం సుప్రీంకోర్టు ముందుకు విచారణకు వచ్చింది.
రాష్ట్ర ప్రభుత్వం పంపిన పలు బిల్లులను గవర్నర్ తమిళి సై సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో పెట్టారని సవాల్‌చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాజ్‌భవన్ తీరును వ్యతిరేకిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సుప్రీంకోర్టులో సివిల్ పిటిషన్ దాఖలు చేశారు. రాజ్యాంగంలోని 32వ అధికరణం ఆధారంగా ఈ పిటిషన్ వేశారు. పిటిషన్‌లో గవర్నర్ కార్యదర్శి, కేంద్ర న్యాయశాఖ కార్యదర్శిని ప్రతివాదులుగా చేశారు.
శాసనసభ, శాసనమండలి బిల్లులను ఆమోదించిన తర్వాత గవర్నర్‌కు పంపితే మొత్తం పది బిల్లులకు రాజ్‌భవన్ ఆమోదం తెలుపలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. రాజ్‌భవన్ తీరువల్ల ప్రజా ప్రభుత్వం చట్టసభల ద్వారా తీసుకొన్న నిర్ణయాలు అమలుకు నోచుకోవడం లేదని, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కుంటుపడ్డాయని 194 పేజీల పిటిషన్‌లో తెలిపారు.
ప్రభుత్వం పంపిన బిల్లులను గవర్నర్ వెంటనే ఆమోదించేలా ఆదేశాలు ఇవ్వాలని తెలంగాణ సర్కారు పిటిషన్‌లో తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఇందుకు సంబంధించి గవర్నర్‌కు నోటీసులు జారీ చేసేందుకు సీజేఐ చంద్రచూడ్ ధర్మాసనం తొలుత సిద్ధపడింది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం స్పందనను కూడా తెలుసుకోవాలని భావించింది.
అయితే గవర్నర్‌కు నోటీసులు ఇవ్వవద్దని హడావుడిగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా విజ్ఞప్తి చేయడంతో కోర్ట్ వెనక్కి తగ్గింది. గవర్నర్, కేంద్రానికి నోటీసులు ఇస్తే అది తప్పుడు సంప్రదాయానికి దారి తీస్తుందని తుషార్ మెహతా వారించే ప్రయత్నం చేశారు. గవర్నర్ పదవి రాజ్యాంగబద్ధమైనదని, అటువంటి వారికి నోటీసులు ఇవ్వడం సరికాదని ఆయన సూచించారు.
తెలంగాణ ప్రభుత్వం చెబుతున్న బిల్లులలో కొన్నింటిని కొద్ది రోజుల క్రితమే పంపారని, అసలు విషయం ఏమిటో తెలుసుకొని కోర్టుకు నివేదిస్తానని చెబుతాని తెలిపారు. దీంతో సోమవారం (మార్చ్ 27) కల్లా కోర్టుకు వివరాలు చెప్పాలని సీజేఐ చంద్రచూడ్ సూచించారు. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేశారు.
విచారణ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపిస్తూ రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లులను గవర్నర్ ఆమోదించడం లేదని, సెప్టెంబర్-2022లో ఆమోదించిన కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ బిల్లుతో సహా పలు కీలక బిల్లులు గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 ప్రకారం గవర్నర్‌కు శాసనసభ ఆమోదించిన బిల్లులకు ఆమోదం తెలుపడం, తిరస్కరించడం, లేదంటే రాష్ట్రపతి పరిశీలన కోసం పంపే అధికారం ఉందని, అయితే ఈ అధికారాన్ని సాధ్యమైనంత త్వరగా ఉపయోగించాలని తెలంగాణ ప్రభుత్వం తరఫున దుష్యంత్ దవే వాదనలు వినిపించారు.
ఆమెకు నోటీసులు ఇచ్చిన్నట్లయితే ఒక గవర్నర్ కు నోటీసులు ఇచ్చిన సంచలన సంఘటనగా ఉండెడిది. ఇటీవలనే, పంజాబ్ గవర్నర్ బడ్జెట్ సమావేశాలకు పిలవకుండా న్యాయ సలహా కోరడంతో సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. అదే విధంగా, మహారాష్ట్ర మాజీ గవర్నర్ ఎకనాథ్ షిండే ప్రభుత్వం ఏర్పాటు సందర్భంగా వ్యవహరించిన తీరుపట్ల కూడా సంచలన వాఖ్యలు చేసింది.