సుప్రీంకోర్టులో అవినాశ్ రెడ్డికి ద‌క్క‌ని ఊర‌ట‌

Sunday, November 17, 2024

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో విచారణకు హాజరు కావాలంని మరోసారి సిబిఐ నోటీసు రాగానే ఎప్పటి మాదిరిగానే నాలుగు రోజుల వ్యవధి కోరి, తన ముందస్తు బెయిల్ పిటీషన్ హైకోర్టు తేల్చేటట్లు ఆదేశాలు ఇవ్వమని కొరుతూ సుప్రీంకోర్టును కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆశ్రయించారు. అయితే అక్కడ ఊరట లభించలేదు.  

సీబీఐ విచారణకు ఎప్పుడు నోటీసులు పంపినా తనకు అత్యవసర కార్యక్రమాలు ఉన్నాయని, ఇప్పుడే రాలేనని, నాలుగు రోజుల తర్వాత వస్తానని వాయిదా కోరడం, తీరా సిబిఐ వాయిదా ఇవ్వగానే హైకోర్టును ఆశ్రయించి అరెస్ట్ కాకుండా చూడమనో, ముందస్తు బెయిల్ ఇవ్వాలనే … మరేదో చేయాలని అభ్యర్థించడం అవినాష్ రెడ్డికి పరిపాటి అయింది.

ఎప్పుడు సిబిఐ నోటీసు పంపినా తనను అరెస్ట్ చేయడం కోసమే అనే భయంతో ఈ విధంగా చేస్తున్నట్లు కనిపిస్తోంది. అదేవిధంగా మంగళవారం విచారణకు హాజరు కావాలని సీబీఐ సోమవారం నోటీసు పంపగానే మంగళవారం ఉదయం నాలుగు రోజుల వరకు హాజరు కాలేనని అంటూ ఈమెయిల్ ద్వారా సమాధానం పంపారు. 

ఏదేమైనా హాజరు కావాల్సిందే అని సిబిఐ స్పష్టం చేయడంతో హాజరు కావడానికి బయలుదేరుతున్న సమయంలో ఒక ముఖ్యమైన ఫోన్ రావడం, హాజరుకావద్దని సలహా ఇవ్వడంతో హాజరు కాకుండా పులివెందులకు బయలుదేరారు. అరెస్ట్ అంటూ జరిగితే పులివెందులలో జనం మధ్య జరిగితే మొత్తం కడప జిల్లాలో, దారిలో కర్నూలు జిల్లాలో పెద్ద ఎత్తున జనం తరలివస్తారని భావించినట్లున్నారు.

అయితే, అనుకోకుండా పులివెందులకు వెడుతున్న సమయంలో మార్గమధ్యలో సిబిఐ నుండి వాట్స్ అప్ సందేశం వచ్చింది. ఈ నెల 19న తప్పనిసరిగా హాజరు కావాలని అందులో తెలిపారు. అనుకున్నట్లుగానే, ఈ సారి హైకోర్టును కాకుండా నేరుగా సుప్రీంకోర్టుని ఆశ్రయించారు.

తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ తన బెయిల్ పిటిషన్ విచారణ చేపట్టేలా ఆదేశించాలని ఎంపీ అవినాశ్ రెడ్డి కోరగా సుప్రీంకోర్టు స్పందించలేదు. అత్యవసరమైతే రాతపూర్వక అభ్యర్థన ఇస్తే పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ సూచించారు. అత్య‌వ‌స‌రాన్ని బ‌ట్టి తాము నిర్ణ‌యం తీసుకుంటామని సుప్రీం కోర్టు తెలిపింది.

అవినాశ్ రెడ్డి పిటీష‌న్‌ పై విచార‌ణ వేస‌వి సెల‌వుల్లో వేకేష‌న్ బెంచ్ ముందు వేయాలా? వ‌ద్దా? అని సీజేఐ ధ‌ర్మాస‌నం తేల్చ‌నుంది. మెన్ష‌నింగ్ లిస్టును విన‌కుండానే బ్యాచ్‌ల వారీగా తేదీల‌ను కేటాయిస్తామని సీజేఐ పేర్కొంది. దాంతో చుక్కెదురైనట్లయింది.  దానితో 19న సిబిఐ విచారణకు హాజరు కావడం మినహా మరో మార్గం ఉండకపోవచ్చు.

ఏపీలో సంచలనం రేపుతున్న మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై సుప్రీంకోర్టు విధించిన జూన్ చివరి గడువులోగా ఒక నిర్ధారణకు రావలసి ఉండడంతో దర్యాప్తులో సిబిఐ వేగం పెంచిన్నట్లు ఉంది. ఇప్పటికే ఈ కేసులో ఏడుగురిని నిందితులుగా చేర్చిన సీబీఐ, వారిలో ఆరుగురిని అరెస్టు చేసింది. మరో నిందితుడు, కడప ఎంపీ అవినాష్ రెడ్డిని కూడా రేపో మాపో అరెస్టు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు స్పష్టం అవుతుంది.

మరోవైపు సిబిఐ మంగళవారం పలువుర్ని ప్రశ్నించింది. కడప జిల్లాకు చెందిన ఇద్దర్ని హైదరాబాద్‌లో విచారణ చేశారు. అవినాష్‌రెడ్డి కాల్‌డేటాలోని అంశాల ఆధారంగా పలు ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. అలాగే వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి, అల్లుడు రాజశేఖరరెడ్డినీ సీబీఐ అధికారులు ప్రశ్నించారు.

వీరిని కూడా మూడు గంటలకుపైగా ప్రశ్నించారని చెబుతున్నారు. ప్రధానంగా వివేకా మొబైల్, ఆయన రాసినట్లు చెబుతున్న లేఖకు సంబంధించి ప్రశ్నించినట్లు సమాచారం. వారి వాంగ్మూలాలు నమోదు చేసినట్లు తెలుస్తోంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles