సుప్రీంకోర్టుకు చేరిన అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్!

Wednesday, January 22, 2025

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక నిందితుడిగా భావిస్తున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గత 31న తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడంతో ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఇప్పుడు ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. 

గతంలో కూడా ముందస్తు బెయిల్ విషయంలో, సీబీఐ విచారణ విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేస్తూ, ఇలా ఇచ్చారేమిటని అంటూ ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. వివేకానందరెడ్డి కుమార్తె డా. సునీతా తెలంగాణ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సీబీఐ మోపిన అభియోగాలను హైకోర్టు పరిగణలోకి తీసుకోలేదని పేర్కొంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలని ఆమె కోరారు. అవినాశ్‌పై మోపిన అభియోగాలన్నీ తీవ్రమైనవేనని పిటిషన్‌లో ఆమె చెబుతూ హైకోర్టు తీర్పులో కొన్ని లోపాలున్నాయని కూడా పిటిషన్‌లో సునీత పేర్కొన్నారు.  బుధవారం సుప్రీం వెకేషన్ బెంచ్ ముందుకు ఈ పిటిషన్ వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. సుప్రీం కోర్టులో సీబీఐ కూడా వాదనలు వినిపించే అవకాశం ఉంది.

డా. సునీత తన పిటీషన్ లో ప్రధానంగా సిబిఐ విచారణకు అవినాష్ రెడ్డి సహకరించడం లేదని, ఏదో ఒక సాకుతో విచారణకు తరచూ హాజరు కావడం లేదని, ఈ విషయాన్ని సిబిఐ సహితం తమ అఫిడవిట్ లో పేర్కొని బెయిల్ ఇవ్వద్దని కోరిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు.

గతంలో కూడా హైకోర్టు ఇచ్చిన తీర్పును సిబిఐ కాకుండా డా. సునీత సుప్రీంకోర్టులో సవాల్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు కూడా హైకోర్టు తీర్పుపై ఆమెనే సుప్రీంకోర్టును ఆశ్రయించడం గమనార్హం. ఈ విషయంలో సిబిఐ వత్తిడులను ఎదుర్కొంటుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

ఇప్పటి వరకు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు మిమ్ములను ఎవ్వరు అడ్డుకున్నారంటూ నేరుగా హైకోర్టు న్యాయమూర్తి సిబిఐని ప్రశ్నించడం గమనార్హం. రాజకీయ జోక్యం కారణంగానే సిబిఐ దర్యాప్తులో తీవ్ర జాప్యం జరుగుతున్నట్లు విమర్శలు చెలరేగుతున్నాయి.

పైగా, కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో పనిచేసే సిబిఐని ఏపీలోని ప్రతిపక్షాలు మానేజ్ చేస్తున్నారన్నట్లు అధికార పక్షం నేతలు బహిరంగంగా విమర్శలు చేస్తున్నా సీబీఐ మౌనం వహించడం, కనీసం హైకోర్టు దృష్టికి కూడా తీసుకు రాకపోవడం విస్మయం కలిగిస్తోంది.

మరోవంక, వైఎస్ వివేకా హత్య కేసులో అరెస్టైన అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి బెయిల్ పిటీషన్ పై మంగళవారం సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. తన ఆరోగ్యం దృష్యా బెయిల్ ఇవ్వాలని భాస్కర్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు. ఈ పిటీషన్ ను పరిగణలోకి తీసుకున్న కోర్టు అటు భాస్కర్ రెడ్డి లాయర్ ఇటు సీబీఐ వాదనలను వింది.

అలాగే ఇంప్లీడ్ గా ఉన్న డా. సునీత  కూడా వాదనలు వినిపించారు. భాస్కర్ రెడ్డి ఆరోగ్య దృష్యా బెయిల్ ఇవ్వాలని ఉమామహేశ్వర్ రావు కోరగా..బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ వాదనలు వినిపించింది. అయితే వాదనలను రాతపూర్వకంగా ఇవ్వాలని కోర్టు సూచించింది. తదుపరి విచారణను ఈనెల 9కి వాయిదా వేసింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles