సుఖేష్ ఎవ్వరో కవితకు తెలియదట…. చిన్నపిల్ల వాదన అంటున్న సుఖేష్

Wednesday, January 22, 2025

మనీలాండరింగ్ కేసులో తీహార్‌ జైల్లో ఉన్న ఆర్థిక నేరగాడు సుఖేశ్‌ చంద్రశేఖర్‌ తనతో జరిపినట్లుగా విడుదల చేసిన వాట్సప్ చాట్‌ స్క్రీన్‌షాట్లను `ఫేక్’ అంటూబిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కొట్టిపారవేసారు. అస్సలు సుఖేష్‌తో తనకు ఎలాంటి పరిచయం లేదని స్పష్టం చేశారు.

అయితే, కవిత ప్రతిస్పందన చిన్న పిల్లల ప్రకటనలా ఉందని ఆ చాట్ ను విడుదల చేసిన సుఖేష్ లాయర్  అనంత్ మాలిక్ ఎద్దేవా చేశారు. సుఖేష్ తన వాదనలకు మద్దతుగా అనేక డిజిటల్ సాక్ష్యాలను అందజేశారని గుర్తు చేశారు. ఈ విషయంలో న్యాయమైన విచారణను స్వాగతించే బదులు కవిత దర్యాప్తు నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోందని ఆయన ఆరోపించారు. 

కానీ, కెసిఆర్‌ని ఎదుర్కునే ధైర్యం లేఖ తన మీద దాడి చేస్తున్నారని,  ఫేక్ చాట్‌ విడుదల చేస్తూ తన మీద దుష్ప్రచారం చేస్తున్నారని, బిఆర్ఎస్ పార్టీ ఉద్దేశ పూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారని కవిత మండిపడ్డారు.

ఒక ఆర్థిక నేరగాడు, ఒక అనామకుడు రాసిన లేఖను విడుదల చేయడం. దాని వెంటనే బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయడం.. దాని తదనంతరమే ఎంపీ అరవింద్ బిజెపి టూల్ కిట్‌లో భాగంగా పనిగట్టుకుని సామాజిక మాధ్యమాల్లో బురదజల్లే కార్యక్రమాన్ని ఒక ప్రణాళిక ప్రకారం చేస్తున్నారని అంటూ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.

బిఆర్ఎస్ పార్టీకి లభిస్తున్న ప్రజాదరణను, జాతీయ స్థాయి కార్యాచరణను రాజకీయంగా ఎదుర్కునే ధైర్యం లేక తెలంగాణ వ్యతిరేకులు మీడియా సంస్థలను గుప్పిట్లో పెట్టుకొని పేపర్లు, టీవీ ఛానెళ్లు, యూ ట్యూబ్ మీడియాల ద్వారా పనిగట్టుకొని బిఆర్ఎస్ పార్టీ మీద ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నాయని ఆమె ఆరోపించారు.

“కవిత సమాధానం ఏజెన్సీల నుంచి దాగుడుమూతలాట ఆడినట్లు ఉంది. కవిత ఇచ్చిన సమాధానంలో తన వాక్పటిమ చూపారు. మీడియా, రాజకీయ పార్టీలపై బ్లేమ్ గేమ్‌లాగా కవిత స్పందన ఉంది. ప్రస్తుత విషయం ప్రత్యేక ఏజెన్సీల ప్రత్యేక పరిశోధనకు సంబంధించినది. సాధారణ ప్రజలలో ప్రజాదరణ పోటీకి సంబంధించిన విషయం కాదు. ఈ వారంలోనే నా క్లయింట్ ద్వారా దీనిపై వివరణాత్మక ప్రతిస్పందన అందించబడుతుంది.” అని కవితకు అనంత్ మాలిక్ తీవ్రంగా కౌంటర్ ఇచ్చారు.

అసలు సుఖేష్ చంద్రశేఖర్ అనే వ్యక్తితో తనకు పరిచయం కూడా లేదని, అతనెవరో కూడా తనకు తెలియదని ఎమ్మెల్సీ కవిత తేల్చి చెప్పారు. కానీ వాస్తవాలను పట్టించుకోకుండా, కొన్ని మీడియా సంస్థలు అత్యుత్సాహంతో.. పనిగట్టుకొని తప్పుడు వార్తలు ప్రచురించాయని ఆమె ధ్వజమెత్తారు.

“ఇదివరకు నా మొబైల్ ఫోన్ల విషయంలో కూడా ఇలాగే తొందరపడి వార్తలు రాసి తరువాత తోక ముడిచారు. మళ్లీ ఇప్పుడు క్రిమినల్ సుఖేష్ ను పావుగా వాడుకొని తెలంగాణ ప్రభుత్వాన్ని, టిఆర్ఎస్ పార్టీని, కెసిఆర్‌ని, వారి కుటుంబ సభ్యులను బద్నాం చేయాలని ప్రయత్నిస్తున్నారు” అంటూ కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

అదుగో పులి అంటే ఇదిగో తోక అన్నట్లు మీడియా సంస్థలు తయారయ్యని పేర్కొంటూ ఇది అత్యంత దురదృష్టకరమని ఆమె విచారం వ్యక్తం చేశారు. పాత్రికేయులు కనీస విలువలు పాటించకపోవడం అత్యంత బాధాకరం అని ఆమె తెలిపారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles