సీరియల్ ఫెయిల్యూర్స్‌పై సీరియస్ అయిన హైకోర్ట్!

Wednesday, May 1, 2024

నాడు నేడు పేరుతో పాఠశాలలను అత్యద్భుతంగా తీర్చిదిద్దుస్తున్నాం అని ప్రభుత్వం డప్పు కొట్టుకుంటుంది. నిజానికి కేంద్రం ఇచ్చే నిధులకు కొంత జతచేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారనే సంగతి దాచి పెడుతుంది. ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ పట్టిస్తున్నాం అని చెబుతూనే.. పాఠశాలల స్థలాలను, ప్రాంగణాలను కబ్జా చేసి గ్రామసచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలు, ఆరోగ్యకేంద్రాలు నిర్మించేస్తుంది. ఇది పూర్తిగా అక్రమం, అరాచకం అయినప్పటికీ.. అయినవారికి కాంట్రాక్టుల రూపంలో దోచిపెట్టడం ఒక్కటే లక్ష్యం అన్నట్టుగా.. ఇలా పాఠశాలలకు చెందిన స్థలాలను ఆక్రమించుకుని ఇతర ప్రభుత్వ ఆఫీసులను కట్టడం అనేది రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో.. ఈ వైఖరిపై కోర్టు సీరియస్ కావడంతో.. రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి స్వయంగా కోర్టుకు హాజరు కావాల్సి వచ్చింది. సీఎస్ ఎదురుగా ఉండడంతో.. న్యాయమూర్తులు.. ప్రభుత్వ పరంగా అనేక రకాల వైఫల్యాల గురించి ఏకబిగిన ప్రశ్నలు సంధించారు. ప్రభుత్వ లోపాల్ని ఎత్తి చూపారు. హైకోర్టు నిలదీతకు సీఎస్ ఉక్కిరిబిక్కిరి కావాల్సి వచ్చింది. 

ప్రభుత్వ పాఠశాలలను ఉద్దరించేస్తాం అని చెబుతున్న జగన్ సర్కారు.. ఆ పాఠశాలల స్థలాలను కబ్జా చేసేసి సచివాలయాలు, రైతు, ఆరోగ్య కేంద్రాలు నిర్మించడమే పెద్ద అరాచకం. ఇలా స్కూళ్ల వద్ద ఇతర నిర్మాణాలు చేయడానికి వీల్లేదని 2020 జూన్ లోనే హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే ఆ నిర్మాణాలు కొనసాగుతున్నట్టుగా.. ఆ తర్వాతి సంవత్సరంలో కూడా అనేక కేసులు కోర్టు ఎదుటకు వచ్చాయి. వీటిపై ఆగ్రహించిన న్యాయస్థానం కోర్టును ధిక్కరించి నిర్మించినందున అవన్నీ అక్రమ నిర్మాణాలు అవుతాయని, వాటికి బిల్లుల చెల్లింపు కూడా అక్రమం అవుతుందని పేర్కొంది. సీఎస్ జవహర్ రెడ్డి ఇతర ముఖ్య అధికారులు కోర్టుకు హాజరుకావాల్సి వచ్చింది. 

అయితే కోర్టుకు సీఎస్ ఇచ్చిన వివరణ కూడా మొక్కుబడిగానే ఉంది. పాఠశాలల్లో విద్యావాతావరణం కాపాడేందుకు.. ఇతర శాఖలకు సంబంధించి నిర్మించిన భవనాలను ఆయా పాఠశాలలకే అప్పగించామని, పాఠశాల అవసరాలకే వాడుకుంటున్నారని ఆయన వివరణ ఇచ్చారు. మరి ఆ స్థలాల రూపేణా స్కూలు పిల్లలు స్వేచ్ఛగా ఆడుకోవడానికి ఉన్న స్థలాలను తిరిగి ఎలా ఇవ్వగలరు? అనేది తెలీదు. అలాగే.. ఏదో ఇతర శాఖల అవసరాలకు నిర్మించిన భవనాలను, స్కూలుకు ఇచ్చినంత మాత్రాన వారికి ఉపయోగపడుతాయనే గ్యారంటీ లేదు. స్కూలుకు నిర్దిష్టంగా ఏం కావాలో అవి లేకుండా.. సచివాలయాలు, ఆరోగ్యకేంద్రాల కోసం కట్టిన వాటిని స్కూలుకు వాడుకోమంటే ఏం చేసుకుంటారో తెలీదు. 

అదే సమయంలో.. కోర్టుకు వచ్చిన సీఎస్ కు న్యాయమూర్తులు ఒక రకంగా తలంటుపోసేశారు. ఉపాధి హామీ నిధుల్ని సచివాలయ నిర్మాణాలకు మళ్లించడం, అక్రమం అని ప్రకటించిన తర్వాత కూడా బిల్లులు చెల్లించడం, ఇతర పనుల విషయంలో వైసీపీ ప్రభుత్వం హయాంలో చేసిన పనులకు కూడా ఇప్పటిదాకా బిల్లులు రాకపోవడం, ఇంకా నిర్మాణంలోనే అనేక భవనాలు ఉండడం వంటి అనేక విషయాలను శరపరంపరగా సంధించారు. ప్రభుత్వ పాఠశాలల్ని చులకనగా చూస్తున్నారని వ్యాఖ్యానించారు. అదే క్రమంలో..ప్రభుత్వోద్యోగులు జీతాల కోసం వేచిచూడాల్సిన పరిస్థితి ఏనాడైనా ఉన్నదా అంటూ నిలదీశారు. జీతాల కోసం బెగ్గింగ్ తప్పడం లేదని వ్యాఖ్యానించారు. కాంట్రాక్టరుకు 5 లక్షలు చెల్లించకపోవడం వల్ల కూడా కేసులు వస్తున్నాయని, ఆ మొత్తం చెల్లించలేని స్థితిలో ప్రభుత్వం ఉన్నదా అని కోర్టు ప్రశ్నించడం విశేషం. ఒక కేసులో విచారణకు కోర్టుకు హాజరైతే.. అనేకానేక ప్రభుత్వ వైఫల్యాలన్నీ ప్రస్తావనకు రావడంతో.. న్యాయమూర్తుల ఎదుట సీఎస్ ఉక్కిరి బిక్కిరి అయిపోవాల్సి వచ్చింది. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles