సీపీఎం కార్యాలయంలో షర్మిలకు పరాభవం!

Wednesday, January 22, 2025

తెలంగాణ రాజకీయాలలో తన ఉనికి కోసం శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్న వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రస్తుతం కేసీఆర్ కు వ్యతిరేకంగా `ఉమ్మడి కార్యాచరణ’ అంటూ ఓ అజెండాతో ప్రతిపక్షాలను ఒక చోటకు చేర్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఆమె స్వయంగా కాంగ్రెస్, బిజెపి రాష్త్ర అధ్యక్షులకు ఫోనులు చేసినా ప్రయోజనం లేకపోయింది. ఆ తర్వాత అన్ని పార్టీల నేతలకు లేఖలు వ్రాసినా ఆశించిన స్పందిన లభించలేదు.

మంగళవారం, ఇక ఒకొక్క పార్టీ కార్యాలయంలకు వెళ్లి నేతలను స్వయంగా కలిసే కార్యక్రమం ప్రారంభించారు. మొదటగా, నాంపల్లిలోని టీజేఎస్ పార్టీ కార్యాలయంలో టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాంను కలిశారు. అయన కూడా రాజకీయ అస్తిత్వం కోసం పోరాటం చేస్తున్నవారు కావడం, రాజకీయంగా ఏకాకిగా మిగలడంతో ఆమె పట్ల సానుకూలంగా స్పందించారు.

టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ తో నిరుద్యోగులకు ఎంతో అన్యాయం జరిగిందని, వారికీ న్యాయం జరిగే వరకు కలసి పోరాడాలని , దానికి సంబంధించి వీరిద్దరూ చర్చలు జరిపినట్లు సమాచారం. అయితే, ఆ తర్వాత సిపిఎం కార్యాలయంకు వెళ్లిన్నప్పుడు బహిరంగ సమావేశంలో మాట్లాడిన్నట్లు అనాలోచితంగా, అసందర్భంగా మాట్లాడటంతో పరాభవం ఎదుర్కోవలసి వచ్చింది.

ఈ క్రమంలో ఆమె చేసిన వ్యాఖ్యల పట్ల ఆ వెంటనే సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం తీవ్రమైన పదజాలంతో తిప్పికొట్టడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. సీపీఎం ఆఫీసులో మీడియాతో మాట్లాడిన షర్మిల తాను బీజేపీకి బీటీమ్ కాదని స్పష్టత ఇవ్వడం వరకూ బాగానే ఉంది.

కానీ, మునుగోడులో కమ్యూనిస్టులే బీఆర్ఎస్‌కు బీటీమ్‌గా పని చేశారని అంటూ రాజకీయ అవగాహన లేకుండా ఆమె చేసిన వాఖ్యలు ఆమెకు ముప్పు తెచ్చాయి.  ఆమె వ్యాఖ్యలకు సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం తీవ్రంగా స్పందించారు.

“ప్రభుత్వంపై పోరాటంలో తమతో కలిసి రావాలని వామపక్షాలు నన్ను ఎప్పుడైనా కోరాయా.. కనీసం ఫోన్ చేసైనా పిలిచారా.. బీజేపీకి బీ టీమ్‌‌ల మేము వ్యవహరించలేదు. వామపక్షాలే బీఆర్ఎస్‌కు బీ టీమ్‌లా వ్యవహరించాయి. కేసీఆర్ సర్కార్ వైఫల్యాలపై వామపక్షాలు పోరాటం చేయడం లేదు. రాజకీయాల పక్కపెట్టి నిరుద్యోగుల భవిష్యత్తు కోసం అన్ని పార్టీలు కలిసి రావాలి. అంటూ షర్మిల హాట్ కామెంట్స్ చేశారు.

రాజశేఖర్ రెడ్డి మీద ఉన్న మర్యాదతో షర్మిల కలుస్తామనగానే అంగీకరించామని వీరభద్రం చెప్పారు. అయితే ఇచ్చిన మర్యాదను షర్మిల నిలబెట్టుకోలేదని అంటూ ఆయన నిష్ఠూరమాడారు. మునుగోడు ఎన్నికల్లో తాము బాహాటంగానే బిఆర్ఎస్ కు మద్దతు ఇచ్చామని ఆయన గుర్తు చేశారు.

దేశ రాజకీయ అవసరాల దృష్ట్యా తమకు రాజకీయ వైఖరి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. షర్మిల మాట్లాడినట్టు తాము మాట్లాడలేటమని అంటూ తమకు విజ్ఞత, మర్యాద ఉంటుందని చెబుతూ పరోక్షంగా ఆమె `రాజకీయ అజ్ఞానం’ను ఎండగట్టారు. తమ ఆఫీసుకు వచ్చి తమను బీటీమ్ అని విమర్శించే సాహసం సరికాదని ఆయన షర్మిలకు హితవు చెప్పారు.

“నిరుద్యోగుల విషయమై మాట్లాడేందుకు కలుస్తామని అడగగ మర్యాద ఇచ్చి రామ్మని ఆహ్వానించామని ఆయన పేర్కొన్నారు. కానీ.. తాము ఇచ్చిన మర్యాదను ఆమె కాపాడుకోలేకపోయిందని తెలిపారు. తమను పక్కన పెట్టుకుని, తమ ఆఫీసులోనే విమర్శలు చేయటంపై అసహనం వ్యక్తం చేశారు.

మరోవైపు ఓ రాజకీయ పార్టీ అధ్యక్షురాలిగా మరో పార్టీ ఆఫీసుకు వెళ్లి షర్మిల ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం చాలా మందికి ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆమె రాజకీయ పరిజ్ఞానం పట్ల సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.  ఇక్కడ మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే వచ్చే ఎన్నికల్లో అన్నీ అనుకున్నట్టు జరిగితే షర్మిల, తమ్మినేని వీరభద్రం ఒకే నియోజకర్గంలో రాజకీయ ప్రత్యర్థులుగా మారే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది. ఖమ్మం  జిల్లాలోని పాలేరు నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేయబోతున్నట్లు షర్మిల ఇప్పటికే ప్రకటించారు.

ఇక బీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకుని ఈ సీటు నుంచి రంగంలోకి దిగాలని తమ్మినేని వీరభద్రం తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే భారీగా కసరత్తు చేస్తున్నారు. అయితే, ఎన్నికల రంగంలో రాజకీయ ప్రత్యర్థులుగా మారక ముందే వారిద్దరి మధ్య మాటల పోరు ప్రారంభం కావడం గమనార్హం.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles