సీనియర్లను వదిలించుకొనే యత్నంలో చంద్రబాబు!

Monday, December 23, 2024

ఏపీలో ఎన్నికల వేడి తీవ్రరూపం దాల్చుతోంది. ప్రధాన రాజకీయ పక్షాలు ఎన్నికల సంసిద్ధతపై, అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారిస్తున్నాయి. అయితే ఈ విషయంలో ప్రధాన ప్రత్యర్థులైన ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తమ పార్టీల నాయకులపై కాకుండా తమకు క్షేత్రస్థాయి పరిస్థితుల గురించి ఎప్పటికప్పుడు సర్వేలు జరిపి నివేదికలు ఇస్తున్న ఎన్నికల వ్యూహకర్తలపై ఎక్కువగా ఆధారపడుతున్నట్లు స్పష్టం అవుతున్నది.

  అధికార వైఎస్సార్సీపీకి రాజకీయ సలహాదారుగా ఐప్యాక్‌ పనిచేస్తుండగా, చంద్రబాబుకు రాబిన్‌ శర్మబృందం పనిచేతున్నది. నారా లోకేష్‌ పాదయాత్ర కూడా రాబిన్‌ శర్మ సూచనల మేరకే జరుగుతోందని చెబుతున్నారు. విశేష ప్రజాస్పందనతో రాష్ట్రంలో టిడిపి అనుకూల వాతావరణం సృష్టించిన బాదుడే బాదుడు, ఇదేంఖర్మసహితం ఈ బృందం సూచనలమేరకు చేపట్టినవే కావడం గమనార్హం.

తాజాగా, సుదీర్ఘకాలం పార్టీలో పదవులను అనుభవిస్తున్న సీనియర్ నాయకులను చాలావరకు వదిలించుకోవాలని ఈ బృందం చంద్రబాబుకు సూచించినట్లు తెలుస్తున్నది. వారు పార్టీ శ్రేణులకు దూరమయ్యారని, ఎన్నికలపై ఇదివరకటి వలే ప్రభావం చూపే పరిస్థితులలో లేరని స్పష్టం చేసినట్లు చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీలోని సీనియర్‌ నాయకులపై ప్రత్యేకంగా ఓ సర్వే నిర్వహించి ఈ బృందం నివేదికను చంద్రబాబుకు అందజేసింది.

ఈ నివేదిక ఆధారంగానే ఇప్పటికే పలువురు సీనియర్లకు ఈ సారి సీట్ ఇచ్చే ప్రసక్తి లేదని చంద్రబాబు నిర్మోహమాటంగా చెబుతున్నారని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే, కుటుంభం సభ్యులలో యువకులు ఎవరైనా ఆసక్తిగా ఉంటే పరిశీలిస్తామని మాత్రం హామీ ఇస్తున్నారు. మరోవంక, ఈ సారి ఎన్నికలలో 40 శాతం సీట్లు యువకులకు, అంటే మొత్తం కొత్తవారికి ఇవ్వబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.

వాస్తవానికి 2019 ఎన్నికల సమయంలోనే అటువంటి ప్రయత్నం చేశారు. జేసీ దివాకరరెడ్డి, ప్రభాకర్ రెడ్డి వంటి వారి వారసులకు సీట్లు ఇచ్చి ప్రయోగం చేశారు. ముఖ్యంగా లోకేష్ కొంతకాలంగా యువ నాయకులనే దాదాపు ప్రతి జిల్లాలో ప్రోత్సహిస్తున్నారు. ఆయన జరుపుతున్న పాదయాత్ర నిర్వాహకులతో ఎక్కువగా యువనాయకులు ప్రాతినిధ్యం ఇస్తున్నారు.

వైసీపీ పాలనలో టీడీపీ కార్యకర్తలను తీవ్రంగా వేధిస్తుండగా సీనియర్ నాయకులు చాలావరకు మీడియా ప్రకటనలకే పరిమితం కావడం, క్షేత్రస్థాయిలో పోరాటాలకు సంసిద్ధం కాకపోవడం ఈ సందర్భంగా పరిగణలోకి తీసుకొంటున్నారు. యనమల రామకృష్ణుడు వంటి నేతలకు సహితం ఆయనకు గాని, ఆయన సోదరుడికి గాని సీటు ఇచ్చే అవకాశం లేదని చంద్రబాబు సంకేతం ఇచ్చారని చెబుతున్నారు.

ఈ పరిణామంను ముందుగానే పసిగట్టిన పలువురు సీనియర్ నేతలు తమ వారసులకు సీట్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. పలు నియోజకవర్గాలలో తమ బదులు వారసులను ఇన్ ఛార్జ్ లుగా నియమింపచేశారు. దానితో 2024 ఎన్నికల అనంతరం టిడిపి నాయకత్వంలో పూర్తిస్థాయి మార్పు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. టిడిపి తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే మూడొంతులమంది ఎమ్యెల్యేలు, మంత్రులు కూడా యువకులు, కొత్తవారు ఉండే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles