సీతక్క సీఎం అభ్యర్థి…. రేవంత్ మాస్టర్ స్ట్రోక్!

Friday, November 15, 2024

త్వరలో జరుగనున్న తెలంగాణ ఎన్నికల్లో అధికారం కోసం ఒక వంక మూడు ప్రధాన రాజకీయ పార్టీలు (బిఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ) తమవైన ఎత్తుగడలు వేసుకొంటుండగా, మరోవంక అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం కోసం సీనియర్ కాంగ్రెస్ నాయకులు  ఒకరికి మించి మరొకరు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అందుకు అడ్డువచ్చే నాయకులను అసలు అసెంబ్లీకి రాకుండా అడ్డుకొనే ప్రయత్నం కూడా చేస్తున్నారు.

టిపిసిసి అధ్యక్షునిగా సహజంగా ముఖ్యమంత్రి పదవికి మొదటి పోటీదారునిగా భావిస్తున్న రేవంత్ రెడ్డికి ఆ అవకాశం రాకుండా అడ్డుకొనేందుకు కాంగ్రెస్ నేతలే కాకూండా, ఇతర పార్టీల అగ్రనేతలు సహితం కొందరు కాంగ్రెస్ నేతలతో చేతులు కలిపి పధకాలు రచిస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్సి అభ్యర్థిగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను రంగంలోకి తెస్తున్నారు.

వీరందరి ఎత్తుగడలను చిత్తు చేయడంతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ కు సహితం `చెంపదెబ్బ’ మాదిరిగా అనూహ్యంగా కాంగ్రెస్ ఎల్యేల్యే సీతక్క పేరును తెరపైకి తీసుకు వచ్చారు. ప్రస్తుతం అమెరికాలో జరుగుతున్న ప్రసవంధ్రుల తానా సభలో వారిద్దరూ ఉన్నారు. అక్కడ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి విషయమై ప్రశ్నలకు స్పందిస్తూ ఎవ్వరూ ఊహించని విధంగా ఆమె పేరును చెప్పారు.

దళితులు, ఆదివాసీలు తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదా? అని ప్రశ్నించడంతో సీతక్క కూడా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలో దళితులు, గిరిజనులకు పెద్దపీట వేస్తామని హామీ ఇచ్చారు. ముందుగా ముఖ్యమంత్రి అభ్యర్థిని కాంగ్రెస్ ప్రకటించడాన్ని, ఈ విషయంలో పార్టీ అధిష్టానమే నిర్ణయం తీసుకొంటుందని చెబుతూనే అవసరమైతే ములుగు ఎమ్మెల్యే సీతక్కను సీఎంగా చేస్తామని తెలిపారు.

తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారాన్ని చేపడితే దళితులు, గిరిజనులకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని కొంతమంది ఎన్నారైలు రేవంత్‌ను కోరగా ఆయన ముఖ్యమంత్రి పదవే వచ్చే అవకాశం ఉండనే సంకేతం ఇచ్చి సంచలనం కలిగించారు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దళితుడిని తొలి ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించిన కేసీఆర్ అధికారం రాగానే తానే ముఖ్యమంత్రి పదవి చేపట్టారని ఆయనను ప్రతిపక్షాలు నిత్యం ప్రశ్నిస్తున్నాయి.

పైగా, మొదట్లో దళితులను ఉపముఖ్యమంత్రిగా చేసినా గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఎవ్వరినీ  చేయలేదు. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలోని ఎస్సి, ఎస్టీల మద్దతును దృష్టిలో పెట్టుకొని రేవంత్ ఈ వాఖ్య చేసిన్నట్లు స్పష్టం అవుతుంది. కాంగ్రెస్ పార్టీలో ఈ సీట్ కోసం కన్నేసిన సీనియర్లను కట్టడి చేయడం కూడా ఆయన లక్ష్యంగా కనిపిస్తుంది.

రానున్న ఎన్నికల్లో గెలుపు కోసం నేతలందరం కలిసి పనిచేస్తామని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనే ధీమా కూడా వ్యక్తం చేశారు. అదే సమయంలో తెలంగాణలోని సీమాంధ్రుల దృష్టిని ఆకట్టుకొనే ప్రయత్నం కూడా చేశారు. తానా సభలో వారే ఎక్కువగా పాల్గొనడంతో దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడంతో పాటు అమరావతిని రాజధానిగా తీర్చిదిద్దుతామని కూడా రేవంత్ ప్రకటించారు.

రెండు దశాబ్దాల పాటు నక్సలైట్ ఉద్యమంలో తుపాకి ధరించి క్రియాశీలకంగా పాల్గొన్న ఆమె టిడిపి ద్వారా రాజకీయ ప్రవేశం చేసి, రెండు సార్లు ఎమ్యెల్యేగా ఎన్నికయ్యారు. రేవంత్ రెడ్డితో కలిసి టీడీపీ నుండి కాంగ్రెస్ లో చేరారు. అయినా ఆమెను అన్ని పార్టీల వారు గౌరవిస్తారు. అట్టడుగు ప్రజల సేవలో ఆమె నిత్యం తలమునకలై ఉంటారు. సుమారు పదిహేనేళ్లుగా రాజకీయాలలో ఉన్నప్పటికీ అవినీతి మరకలు ఆమెను అంటలేదు.

అంతేకాకుండా రేవంత్ రెడ్డితో సీతక్కకు మంచి అనుబంధం ఉంది. తనకు సీతక్క సొంత చెల్లి లాంటిదని రేవంత్ పలుమార్లు వ్యాఖ్యానించగా.. రేవంత్‌ను తాను సొంత అన్నలా భావిస్తానని అనేకసార్లు సీతక్క చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీతక్కకు కీలక పదవి ఇస్తామని రేవంత్ గతంలో బాహటంగానే వెల్లడించారు. 

ఇటీవల భారత్ జోడి యాత్రలో రాహుల్ గాంధీతో కలిసి కొన్ని రోజులు పాల్గొని ఆయన దృష్టిని కూడా ఆకర్షించారు. ఇలాంటి తరుణంలో సీతక్కను సీఎం అభ్యర్థిగా రేవంత్ ఫోకస్ చేయడం మాస్టర్ స్ట్రోక్ వంటి వ్యూహంగా స్పష్టం అవుతుంది. సీతక్కకు ప్రజల్లో ఉన్న క్రేజ్‌ను ఉపయోగించు కోవడంతో పాటు సొంత పార్టీలో, ఇతర పార్టీలలో తన రాజకీయ ప్రత్యర్థులను కట్టడి చేసేందుకు వేసిన ఎత్తుగడగా వెల్లడవుతుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles