సీక్రెట్ చెప్పేసి నాలిక్కరచుకున్న వైసీపీ!

Wednesday, January 22, 2025

రాజకీయ నాయకుల, రాజకీయ పార్టీల సోషల్ మీడియా వేదికలను ఆ పార్టీకి అనుకూలంగా ఉద్యోగాలు చేస్తూ ఉండే బృందాలు నిర్వహిస్తూ ఉండడం సాధారణమైన విషయం. చిన్న చిన్న ఎమ్మెల్యేల స్థాయి వ్యక్తుల నుంచి, బిజెపి వంటి దేశాన్ని ఏలుతున్న పార్టీ వరకు అందరి విషయంలోనూ జరిగేది ఇదే. అలాంటి సోషల్ మీడియా హ్యాండిల్స్ ను నిర్వహిస్తున్న వారికి.. తమ పార్టీల బుద్ధులు, ఆలోచనలు, వారు చేస్తున్న కుట్రలు సమస్తం ముందుగానే తెలుస్తూ ఉంటాయి. కానీ వారి పార్టీకి సొంతడబ్బా కొట్టే విషయాలను మాత్రమే, ప్రత్యర్థులను తిట్టిపోసే సంగతులను మాత్రమే సోషల్ మీడియాలో పోస్టులుగా పెడుతుంటారు.

అదే పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్స్ అనేవి అపరిపక్వ కుర్రాళ్ల చేతిలో ఉంటే.. అపరిపక్వ పోస్టులు వచ్చేస్తూ ఉంటాయి. వివాదాస్పదమైన కొన్ని విషయాలను పోస్టులుగా పెట్టేయడం.. ఆ తర్వాత వాటిని డిలిట్ చేసి తప్పు దిద్దుకోవడం జరుగుతూ ఉంటుంది. ఒక్కోసారి ఈ సోషల్ మీడియా ద్వారా.. అసలు నిజాలు కూడా బయటకు వచ్చేస్తుంటాయి. తర్వాత వాటికి ముసుగు వేసి దాచిపెట్టడానికి వంకర ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాంటిదే ఇప్పుడు కూడా జరుగుతోంది.

విశాఖ పట్నంలో రుషికొండను సర్వనాశనం చేసేసి.. టూరిజం భవనాల పేరుతో సాగుతున్న నిర్మాణాల గురించి తొలినుంచి వివాదం నడుస్తూనే ఉంది. ఇవి సెక్రటేరియేట్ కోసం కడుతున్న భవనాలు అని ప్రతిపక్షాలు ఆరోపిస్తుండగా, ఈ వ్యవహారంపై కోర్టుల్లో కేసులు కూడా నమోదు అయ్యాయి. విచారణలు జరుగుతున్నాయి. విచారణకు పిలిచిన ప్రతిసారీ.. ప్రభుత్వం తరఫున.. ఇవి కేవలం టూరిజం శాఖ కోసం నిర్మిస్తున్న అతిథి భవనాలు మాత్రమే అని చెబుతూ ప్రభుత్వం మాయచేస్తూ వచ్చింది. అయితే తాజాగి అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ట్విటర్ ఖాతా అసలు సంగతిని బయటపెట్టింది.

ఆ వ్యవహారం చూస్తున్న కుర్రాడు ఎవరో గానీ.. పాపం.. తెలుగుదేశాన్ని తిట్టిపోసే ప్రయత్నంలో భాగంగా సీక్రెట్ బయటపెట్టేశారు. ‘‘ఉత్తరాంధ్రప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించి, రుషికొండపై సెక్రటేరియేట్ నిర్మాణం చేపడుతున్నారు వైఎస్ జగన్ గారు. దాని మీద మీ పార్టీ దుష్ప్రచారం చూస్తోంటే.. మీకు ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందడం ఇష్టం లేదనిపిస్తోంది’’ అంటే శనివారం పార్టీ అధికారిక ట్విటర్ ఖాతాలో ఒక పోస్టు పెట్టారు.

ఈ ఒక్క పోస్టు ద్వారా ఇన్నాళ్లు కోర్టుకు చెప్పిన అబద్ధాలన్నీ బయటపడిపోతాయనే భయంతో ఆదివారం దానిని డిలిట్ చేసేశారు. ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో.. మరో ట్వీట్ పెట్టి సమర్థించుకునే ప్రయత్నం చేశారు. ‘మా అధికారిక ట్విటర్ ఖాతాలో సెక్రటేరియేట్ నిర్మాణాలు జరుగుతున్నట్టుగా నిన్న పొరబాటుగా పేర్కొనడం జరిగింది. ఇవి కేవలం టూరిజం శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న నిర్మణాలుగా పరిగణించాలంటూ’ ఓ సవరణ ట్వీట్ ను పెట్టారు.

విశాఖ రుషికొండ సర్వనాశనం చేసి సెక్రటేరియేట్ కట్టే ప్రభుత్వ దుర్మార్గమైన ఆలోచన డిలిట్ చేసిన ట్వీట్ ద్వారా బయటపడిందని అంతా విమర్శిస్తున్నారు. తమ దుర్బుద్ధుల అసలు సీక్రెట్ ను బయటపెట్టేసి.. తర్వాత పార్టీ నాలిక్కరచుకున్నదని అందరూ నవ్వుకుంటున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles