ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో డిప్యూటీ ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అరెస్టు అయ్యారు. ఆదివారం నాడు ఏకంగా ఎనిమిది గంటల పాటు సిసోడియాన్ విచారించిన సిబిఐ పొద్దుపోయిన తర్వాత అరెస్టు చేసింది. అయితే సిసోడియా అరెస్టు అనేది అనూహ్య పరిణామం ఏమీ కాదు. ఆయన విచారణను తొలగించి గమనిస్తున్న వారు ఊహిస్తూనే ఉన్నారు. ఇవాళ తనను అరెస్టు చేస్తారని సిసోడియాకు ముందే పరిస్థితి అర్థమైంది. దానికి తగ్గట్టుగానే సుదీర్ఘ విచారణ తర్వాత అరెస్టు జరిగింది. అయితే సిసోడియా అరెస్టు తర్వాత.. తెలుగురాష్ట్రాల్లో ప్రకంపనలు మొదలయ్యాయి. డిప్యూటీసీఎం నే అరెస్టు చేసిన నేపథ్యంలో.. ఈ కేసుతో లింకు ఉన్నట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలుగు రాష్ట్రాల రాజకీయ ప్రముఖులు ఇప్పుడు ఆందోళనకు గురవుతున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్టులు ఇవాళే మొదలు కాలేదు. ఇప్పటికే సీబీఐ, ఈడీ కలిసి మొత్తం 12 మందిని అరెస్టు చేశారు. అయితే, ఢిల్లీ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తిని అరెస్టు చేస్తారా? అనే అనుమానం కొంతమందిలో వ్యక్తం అయింది. ఆమ్ ఆద్మీ పార్టీ.. ఈ అరెస్టులన్నీ రాజకీయ కక్షతో జరుగుతున్నాయని ప్రచారం చేస్తున్న నేపథ్యంలో సీబీఐ ఎలా స్పందిస్తుంది? అనే మీమాంస నడిచింది. సిసోడియా అరెస్టు జరిగిన తర్వాత.. మిగిలిన రాజకీయ నాయకులందరిలోనూ గుబులు మొదలైంది.
సిసోడియా అరెస్టు అంత సులువుగా ఏమీ జరగలేదు. ఆయన ఇవాళ ఉదయం విచారణకు బయల్దేరిన సమయంలోనే తన పార్టీ కార్యకర్తలను పెద్దఎత్తున సమీకరించి ప్రదర్శనగా సీబీఐకు వెళ్లారు. ఆ ర్యాలీని ఉద్దేశించి.. తనను ఇవాళ అరెస్టు చేస్తారని ప్రకటించారు. గాంధీజీ సమాధి వద్దకు వెళ్లి అక్కడ కాసేపు దీక్ష చేశారు. చివరికి అనుకున్నట్టే జరిగింది.
శరత్ చంద్రారెడ్డి, మాగుంట రాఘవ, అభిషేక్, బుచ్చిబాబు తదితరులు అరెస్టు అయిన తెలుగు వారిలో ఉన్నారు. చార్జిషీట్లో ఉన్న వారు దాదాపుగా అరెస్టు అవుతున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ప్రధానంగా కల్వకుంట్ల కవిత పేరు కూడా వినిపించింది. ఆమెను సీబీఐ ఇదివరకే విచారించింది కూడా. కవిత అరెస్టు కూడా జరుగుతుందా? అనే ప్రశ్న ఇప్పుడు రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. ఏపీలో కూడా ఇంకా ఎవరెవరి లింకులు బయటకు వస్తాయోనని అందరూ చర్చించుకుంటున్నారు.