వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో సిబిఐ వేగంగా అడుగులు వేస్తూ, కీలక వ్యక్తుల పాత్రను నిర్ధారించే ప్రయత్నంలో ఉంటూ, త్వరలో కేసును ముగింపుకు తీసుకు వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్న సమయంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బృందంలో ఆందోళన పెరుగుతున్నట్లున్నది. దర్యాప్తు తాడేపల్లి ప్యాలెస్ వరకు రావడంతో దిక్కుతోచక సిబిఐ పైననే ఎదురుదాడికి దిగుతున్నట్లు స్పష్టం అవుతుంది.
ముఖ్యంగా, సీఎం జగన్ కు సన్నిహితుడు, వరుసకు సోదరుడైన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని రెండోసారి శుక్రవారం విచారణకు పిలిచిన సందర్భంగా సిబిఐ దర్యాప్తు జరుగుతున్న తీరుపై బహిరంగంగా విమర్శలు గుప్పించారు.
వివేకా హత్య కేసులో విచారణ నిష్పక్షపాతంగా జరగడం లేదని ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. వివేకా హత్య కేసులో స్క్రీన్ ప్లే, డైరెక్షన్ మొత్తం చంద్రబాబుదేనని అంటూ సీబీఐ వెనుక రాజకీయ ప్రమేయం కచ్చితంగా ఉందని తీవ్రమైన ఆరోపణ చేశారు. బీజేపీలో తన కోవర్టుల ద్వారా సీబీఐ విచారణను ప్రభావితం చేస్తున్నారని సజ్జల ఆరోపించారు.
మరోవంక, అవినాష్ రెడ్డి సిబీఐ ఎదుట రెండోసారి హాజరుకాగా సుమారు ఐదు గంటల పాటు అధికారులు ప్రశ్నించారు. గత నెల 28నఆరున్నరగంటల పాటు ప్రశ్నించడం తెలిసిందే. ఈ విచారణలో అధికారులు గ్యాప్ లేకుండా అడిగిన ప్రశ్నలకు అవినాష్ ఎలాంటి సమాధానం చెప్పలేకపోయారని తెలుస్తోంది. విచారణ వాస్తవాల ఆధారంగా జరగడం లేదని, ఏకపక్షంగా సీబీఐ విచారణ జరుగుతోందని అంటూ విచారణ అనంతరం మీడియా ముందు విమర్శించారు.
మీడియాలో వస్తున్న కథనాలతో సీబీఐ విచారణపై ప్రభావం పడుతుందని పేర్కొంటూ ఒక నిజాన్ని 100 నుంచి సున్నాకు తెచ్చే ప్రయత్నం జరుగుతోందని, ఒక అబద్ధాన్ని సున్నా నుంచి 100కు పెంచే ప్రయత్నం జరుగుతోందని అంటూ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు.
వివేకా హత్యకేసులో అవినాష్ పాత్ర కీలకంగా ఉందని సీబీఐ భావిస్తున్న సమయంలో అవినాష్ రెడ్డిని విచారించేందుకు ముందు సజ్జల, విచారణ పూర్తి తర్వాత అవినాష్ సీబీఐ విచారణ జరుగుతున్న తీరుపై విమర్శలు కురిపించడం చూస్తుంటే ఓ ఎత్తుగడ ప్రకారం జరుపుతున్న ఎదురుదాడిగా అర్ధం అవుతుంది.
అదీకాకుండా, వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్‌రెడ్డికి సంబంధం లేదని రామకృష్ణారెడ్డి సర్టిఫికెట్ జారీ చేయడం గమనిస్తే సిబిఐ అధికారులపై వత్తిడి తీసుకొచ్చే ప్రయత్నంగా కనిపిస్తుంది. ఇదివరలో సహితం దర్యాప్తు జరుపుతున్న సిబిఐ అధికారిపై కడపలో పోలీస్ కేసును నమోదు చేసి, దర్యాప్తు ముందుకు జరగకుండా అడ్డుకొనే ప్రయత్నం జరగడం గమనార్హం.
`చంద్రబాబు పకడ్బందీగా కథనం తయారు చేస్తారు. ఆ కథనాన్ని అనుకూల మీడియాలో ప్రచారం చేయిస్తారు. ఇదే అంశాన్ని టీడీపీ నాయకులు పదేపదే ప్రస్తావిస్తారు’ అని సజ్జల రామకృష్ణారెడ్డి సిబిఐ దర్యాప్తును టిడిపి దర్యాఫ్తుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు.