`సిఫార్సులు’ లెక్కచేయటం లేదని `రాజగురు’లో అసహనం!

Sunday, December 22, 2024

సింహాద్రి అప్పన్న చందనోత్సవం సందర్భంగా భక్తుల రద్దీ కారణంగా కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడితే ఏపీ రాజకీయాలలో `రాజగురు’గా భావిస్తున్న విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద తీవ్ర అసహనానికి గురై, ఎన్నడూ ఎరుగనంత ఆగ్రహం వ్యక్తం చేయడం చాలా మందికి విస్మయం కలిగించింది.

ఏపీలో ఇప్పటివరకు మరే పీఠాధిపతికి దక్కని విధంగా ఆయనకు ప్రభుత్వం `ప్రోటోకాల్’ సదుపాయం కల్పిస్తున్నది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నుండి మంత్రులు, సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఆయన దర్శనం కోసం వస్తుంటారు. సీఎం పేషీలో ఆయన సిఫార్సులకు ఎంతో  విలువ ఉంటుంది. పలువురు ఉన్నతాధికారులు తమ ప్రమోషన్లు, మంచి పోస్టింగులు కోసం ఆయనను కలుస్తుంటారని ప్రతీది.

అటువంటి ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా సింహాచలం చరిత్రలో దుర్మార్గమైన రోజని అంటూ  తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. భక్తులను చూస్తే కన్నీళ్లు వస్తున్నాయని శారదా పీఠాధిపతి ఆవేదన వ్యక్తం చేశారు. అప్పన్న దర్శనానికి తాను ఎందుకు వచ్చానా అనిపించిందని అసహనం వ్యక్తం చేశారు. ఈ విధంగా బహిరంగంగా, ప్రభుత్వంపై ఎందుకు విరుచుకు పడ్డారో ఎవ్వరికీ అంతుబట్టలేదు.

అయితే, ఆయన మాటలలోనే ఆయన ఆగ్రహానికి మూల కారణం వెల్లడైంది. గతంలో చందనోత్సవ నిర్వహణపై తన సలహాలు అడిగేవారని, ఈ సంవత్సరం అధికారులెవరూ తనను సంప్రదించలేదని… అంతా అధికారులు, పోలీసుల ఇష్టారాజ్యంగా మారిపోయిందని అంటూ తన `పెద్దరికం’ను గుర్తింపలేదనే ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యంగా, ఇటీవల జరిగిన ఐఏఎస్ అధికారుల బదిలీల్లో విశాఖ జిల్లా కలెక్టర్‌గా వెళ్లిన మల్లిఖార్జున విధుల్లో చేరిన తర్వాత శారదా పీఠాధిపతిని సంప్రదించకపోవడం ఆయనకు ఆగ్రహం కలిగించినట్లు ప్రచారం జరుగుతోంది.

2017-18 నుంచి ఏటా విశాఖ శారదా పీఠం వార్షికోత్సవ కార్యక్రమాలకు జగన్మోహన్ రెడ్డి వీలైనప్పుడల్లా హాజరవుతున్నారు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పటి నుంచి తరచూ స్వామి వారి దర్శనం చేసుకుంటున్నారు. అయితే, విశాఖ శారదా పీఠం వార్షికోత్సవానికి ముఖ్యమంత్రి హాజరవుతారని కొద్ది నెలల క్రితం విస్తృత ప్రచారం జరిగినా చివరి నిముషంలో హాజరు కాలేదు. ఈ మధ్య సీఎం పేషీలో స్వామిజీ సిఫార్సులను పట్టించుకోవడం లేదని తెలుస్తోంది.

మరోవైపు విశాఖ శారదా పీఠానికి ప్రాధాన్యత ఇవ్వడం మిగిలిన హిందూ ధార్మిక సంస్థల్లో అసంతృప్తి నెలకొంది. పైగా, ఈ మధ్య వరకు వైసిపి ఉత్తరాంధ్ర ఇన్ ఛార్జ్ గా విశాఖపట్నం కేంద్రంగా రాజకీయాలు నడిపిన విజయసాయిరెడ్డితో స్వరూపానందకు మంచి సంబంధాలు ఉండేవి. ఇద్దరూ కలసి ఈ ప్రాంతంలో పలు భూ లావాదేవీలలో తలదూర్చారనే ఆరోపణలున్నాయి.

అయితే, ఇప్పుడు విజయసాయి రెడ్డి ఇక్కడ లేకపోవడంతో అధికారులు శారదా పీఠంకు సహితం గతంలో ఇచ్చిన  ప్రాధాన్యత ఇవ్వడం లేదు. వీటన్నింటి కారణంగా ఆయనలో పేరుకుపోయిన అసహనం, ఆగ్రహం చందనోత్సవం రోజున బైటపడిన్నట్లు పలువురు భావిస్తున్నారు.

అయితే సీఎం జగన్ ప్యాలస్ నుండి తన వాఖ్యలపై ఆగ్రవేశాలు వ్యక్తం కావడంతో, ముఖ్యమంత్రి ఆగ్రహంగా ఉన్నారని తెలియడంతో చందనోత్సవం ఏర్పాట్లపై బహిరంగంగా ఆగ్రహం వ్యక్తం చేసిన శారదా పీఠాధిపతి ఆ తర్వాత మరో వీడియోలో వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ప్రభుత్వానికి చెడ్డపేరు రాకూడదని, తప్పంతా అధికారులదే అని అందులో వారిపై నెపం నెట్టేశారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles