సిద్దరామయ్య ప్రమాణస్వీకారంలో కనిపించని `తెలుగు’ పార్టీలు!

Wednesday, January 22, 2025

కర్ణాటకలో బీజేపీని ఓడించి కాంగ్రెస్ పూర్తి బలంతో అధికారంలోకి రావడాన్ని కేవలం ఆ పార్టీ శ్రేణులే కాకుండా దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక పక్షాలు సంబరాలుగా చేసుకొంటున్నారు. ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య ప్రమాణస్వీకారంకు హాజరవడం ద్వారా ఒక విధంగా బీజేపీ వ్యతిరేక వేదికగా ఆ కార్యక్రమం మారింది.

ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు శరద్ పవర్ వంటి ఉద్దండ నాయకులతో పాటు అనేక పార్టీల అధినేతలు పాల్గొన్నారు. అయితే రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన నేతలెవ్వరూ హాజరుకాలేదు. కనీసం ఎన్నికలలో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సిద్ధరామయ్యకు ప్రధాన రాజకీయ ప్రత్యర్థి అయినా ప్రధాని నరేంద్ర మోదీ సహితం శుభాకాంక్షలు తెలిపారు. కానీ తెలుగు నేతలు ఎవ్వరు నోరు మెదపలేదు.

రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు – కె చంద్రశేఖరరావు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలతో పాటు ప్రధాన ప్రతిపక్షం, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, కనీసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొత్త ప్రభుత్వానికి అభినందనలు తెలిపిన దాఖలాలు లేవు.

పవన్ కళ్యాణ్ మినహాయించి, ఈ నేతలు తమ తమ రాష్ట్రాలలో బిజెపితో కూడా పోరాడుతున్న వారే. వీరికి వ్యతిరేకంగా బిజెపి నేతలు నిశితంగా విమర్శలు గుప్పిస్తున్నారు. రాజకీయాలలో సాధారణంగా `శత్రువు శత్రువు మిత్రుడు’ అనే నానుడిని అనుసరిస్తారు. ఆ విధంగా అయినా, వీరు మాటవరసకైనా సిద్ధరామయ్యకు శుభాకాంక్షలు చెప్పే ప్రయత్నం చేయలేదు.

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థి కావడంతో కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలిపేందుకు కొన్ని ఇబ్బందులు ఉండవచ్చు. ఏపీలో అటువంటి పరిస్థితి లేదు. పైగా. కాంగ్రెస్ కుటుంభం నుండే సీఎం వైఎస్ జగన్ వచ్చారు. పొరుగు రాష్ట్రంగా కర్ణాటక రెండు తెలుగు రాష్ట్రాలకు అనేక ద్వైపాక్షిక అంశాలను ఉన్నాయి. వాటి విషయంలో ఒక అవగాహనకు రావలసిన అవసరం ఉంది.

తమ తమ రాష్ట్రాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోనైనా లేదా రాజకీయ మర్యాదల కోసమైనా  సిద్ధరామయ్యకు తెలుగు నేతలు శుభాకాంక్షలు తెలిపితే సముచితంగా ఉండెడిది. అయితే, ఈ ముగ్గురు ప్రాంతీయ పార్టీల అధినేతలు ప్రత్యక్షంగానో లేదా పరోక్షంగానో బిజెపి ప్రాపకం కోసం ప్రాకులాడుతున్నారనే ఆరోపణలున్నాయి. అందుకనే బిజెపికి కష్టం కలిగించే చర్యలకు వీరెవ్వరు సిద్దపడటం లేదు.

ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కు దూరంగా ఉంటోంది. బీజేపీకి అవసరమైన సమయంలో మద్దతు ఇస్తుంది. బీజేపీతో జనసేన మిత్రపక్షంగా ఉంది. టీడీపీ, జనసేన రెండు పార్టీలో వచ్చే ఎన్నికల్లో ఏపీలో బీజేపీతో కలిసి పోరాటం చేయాలని భావిస్తున్నాయి. బీజేపీ నిర్ణయం తేలాల్సి ఉంది. 2019లో కాంగ్రెస్ తో చేతులు కలిపి చంద్రబాబునాయుడు ఘోరమైన తప్పటడుగు వేశారు. అందుకనే ఏపీలో ఎవ్వరూ ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూడడానికి కూడా సాహసించడం లేదు.

కర్ణాటక తరహా పాలసీని అమలు చేసి అక్కడా పట్టు నిరూపించుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. తెలంగాణలో నూ ఎన్నికలు జరగనున్నాయి. అందుకనే బిఆర్ఎస్ సహితం జాతీయ స్థాయిలో కాంగ్రెస్ తో వేదికలు పంచుకునేందుకు సిద్ధంగా లేదు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles