సిట్ విచారణపై చంద్రబాబుకు సుప్రీంకోర్టులో చుక్కెదురు!

Sunday, December 22, 2024

తన ప్రభుత్వ సమయంలో తీసుకున్న నిర్ణయాలపై దర్యాప్తుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్  విషయంలో టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. సిట్ దర్యాప్తును టిడిపి నేతలు ఏపీ హైకోర్టులో సవాల్ చేసి, స్టే పొందడంతో ఇప్పటివరకు జగన్ ప్రభుత్వం ఈ విషయంలో ముందుకు వెళ్లలేకపోయింది.

అయితే, హైకోర్టు స్టే ఉత్తరువు ఇవ్వడాన్ని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేయగా, ఇప్పుడు సిట్ ఏర్పాటుపై అభ్యంతరాలను త్రోసిపుచ్చింది. దానితో రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వంలో జరిగాయని ఆరోపిస్తున్న ఆక్రమణలపై నిరాటంకంగా దర్యాప్తు చేసుకొనే సౌలభ్యం కలుగుతుంది.

ఈ కేసును మెరిట్ ప్రాతిపదికన విచారించి తుది నిర్ణయాన్ని వెలువరించాలని హైకోర్టుకు ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది.  జస్టిస్ ఎం.ఆర్. షా, జస్టిస్ సిటి రవికుమార్‌ల ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది.

చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసుకున్న పలు విధాన పరమైన నిర్ణయాలతో పాటు భారీ ప్రాజెక్టుల్లో అక్రమాలపై  ముందుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంత్రివర్గ ఉపసంఘంను ఏర్పాటు చేశారు. ఆ ఉపసంఘం చంద్రబాబు హయాంలో పలు అక్రమాలు చోటుచేసుకున్నాయని నిర్ధారిస్తూ నివేదిక ఇవ్వడంతో, వాటిపై విచారణకు సిట్ ను ఏర్పాటు చేశారు.

అయితే, సిట్ ఏర్పాటును ఏపీ హైకోర్టులో టీడీపీ నేతలు వర్ల రామయ్య, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తదితరులు సవాల్ చేశారు. అమరావతి భూకుంభకోణంతో పాటు ఇతర చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాలపై వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మంత్రివర్గ ఉపసంఘం కూడా దర్యాప్తు నిర్వహించింది. దీని సిఫార్సుల ఆధారంగా సిట్ ఏర్పాటు చేసింది.

ఈ విషయంపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఇవాళ తీర్పు ప్రకటించింది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విచారణ చేపట్టిన అంశాలలో  అమరావతి, పోలవరంలతో పాటు పలు కీలక ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. వీటిలో అక్రమాలు జరిగాయని భావిస్తున్న వైసీపీ సర్కార్ వీటిపై సిట్ దర్యాప్తు జరిగితేనే నిజానిజాలు వెలుగులోకి వస్తాయని వాదించింది. అలాగే వీటిపై సీబీఐతోనూ విచారణ జరిపించాలని నిర్ణయించింది.

దీనిపై సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా కూడా పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. సుప్రీంకోర్టు కూడా ప్రాథమిక దశలోనే సిట్ విచారణపై స్టే విధిస్తూ హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని కూడా తప్పుబట్టింది. అంత వేగంగా స్టే ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందని గతంలోనే ప్రశ్నించింది. ఇవాళ దానికి అనుగుణంగానే తీర్పు కూడా ప్రకటించింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles