సిఐ అంజూపై ఎస్పీకి పవన్ కళ్యాణ్ ఫిర్యాదు

Wednesday, January 22, 2025

ఇటీవల శ్రీకాళహస్తిలో జనసేన నాయకుడు కొట్టే సాయిపై సీఐ అంజూయాదవ్‌ చేయిచేసుకున్న ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. ఇది ఒక వ్యక్తిపై జరిగిన దాడి కాదని, ప్రతి ఒక్కరి ప్రాధమిక హక్కులపై జరిగిన దాడి అని అభివర్ణించారు. ఈ ఘటనపై జనసైనికుల ఆగ్రవేశాలను పరిగణలోకి తీసుకొని తాను కూడా పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటానని సంఘీభావం తెలిపారు. 

పవన్‌ కూడా పార్టీ నేతకు అండగా సోమవారం తిరుపతి చేరుకుని జిల్లా ఎస్పీ  పరమేశ్వర్‌రెడ్డికి ఆయన ఫిర్యాదు చేశారు. సీఐపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు. పవన్ రాకతో జనసైనికులు భారీగా తరలివచ్చారు. సోమవారం ఉదయం రేణిగుంట ఎయిర్ పోర్ట్ లో దిగిన జనసేనానికి ఘన స్వాగతం లభించింది.

పార్టీ కార్యకర్తలు, అభిమానులతో 15 కిలోమీటర్లు భారీ ర్యాలీ నిర్వహించారు. తిరుపతి ఎస్పీ కార్యాలయం చేరుకున్న పవన్, సీఐ అంజూ యాదవ్ చేతిలో దెబ్బలు తిన్న కొట్టే సాయితో పాటు మరో ఆరుగురితో కలిసి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డిని కలుసుకుని ఫిర్యాదు అందజేశారు.

శ్రీకాళహస్తి సీఐ అంజూయాదవ్‌ తీరు మొదటి నుంచి వివాదాస్పదం అవుతోంది. గతంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కుమార్తె విషయంలో అంజూ యాదవ్ ప్రవర్తించిన తీరుపై వివాదం రేగింది. ఆ తర్వాత ఓ హోటల్ నిర్వాహకురాలిపై దౌర్జన్యం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆమెను బలవంతంగా తీసుకెళ్లి జీపులోకి తోసేయడంతో విమర్శలు వచ్చాయి. తాజాగా జనసేన పార్టీ నేత చెంపపై కొట్టడంతో సీఐ మరోసారి వార్తల్లోకి ఎక్కారు.

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో జనసేన పార్టీ నిర్వహించిన ఆందోళనలో సీఐ అంజూ యాదవ్ తీవ్రంగా స్పందించిన తీరు వివాదాస్పదం కావడం తెలిసిందే. నిరసనకారులను అదుపుచేసే క్రమంలో జనసేన నేత కొట్టె సాయిపై ఆమె చేయిచేసుకున్నారు. ఇతర కార్యకర్తలు, అభిమానులపైనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ఈ ఘటనపై స్పందించిన పోలీసు ఉన్నతాధికారులుసీఐ అంజూ యాదవ్ కు ఛార్జ్ మెమో జారీ చేశారు. మరోవైపు ఈ ఘటనపై జిల్లా ఎస్పీ ఇప్పటికే విచారణ నిర్వహించి డీజీపీకి నివేదిక కూడా పంపారు. అలాగే అంజూ యాదవ్‌కు సంబంధించి మరో వీడియో బయటపడింది. 

ఓ మహిళను లాక్కెళుతున్న దృశ్యం, జనసేన నేతలను చెంపలపై కొడుతున్న వీడియోలు బయటపడగా తాజాగా మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గతంలో తనపై కేసు పెట్టిన వారి హోటల్‌ ముందు నిల్చున్న సీఐ అంజూయాదవ్‌ ఒకవైపు మొబైల్‌లో వీడియో తీస్తూనే గట్టిగా వెకిలి నవ్వులు నవ్వుతూ తొడ కొడుతున్న వీడియో చర్చనీయాంశం అయ్యింది. సీఐ స్థాయి అధికారి బాధితులను బండి కాగితాలు అడుగుతూ బెదిరిస్తుండటంపై విమర్శలు వస్తున్నాయి.

పౌరుల ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘించేలా సిఐ వ్యవహరించారని పవన్ కళ్యాణ్‌ ఆరోపించారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్నపుడు కూడా పోలీస్ శాఖకు సహకరిస్తున్నామని చెబుతూ అయితే ఒక స్థాయి వరకే ఓపిక ఉంటుందని హెచ్చరించారు. మచిలీపట్నంలో లక్షల మంది కార్యక్రమం నిర్వహించినా ఎక్కడా క్రమశిక్షణ ఉల్లంఘించలేదని పవన్ గుర్తు చేశారు. పోలీసులకు ఇబ్బంది కలగకుండా తమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles