వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంత్రివర్గంలో సుదీర్ఘకాలం మంత్రి పదవిలో ఉన్న ఒకరిద్దరిలో బొత్స సత్యనారాయణ ఒకరు. పైగా, పిసిసి అధ్యక్షుడిగా చేసిన అనుభవం ఉంది. కాంగ్రెస్ హయాంలో ముఖ్యమంత్రి పదవి కోసం కూడా ప్రయత్నం చేశారు. అయితే వైసీపీలో చేరడం ద్వారా తన రాజకీయ ప్రాపకాన్ని కాపాడుకుంటూ వస్తున్నప్పటికీ ప్రభుత్వంలో, పార్టీలో ప్రాధాన్యత నానాటికి తగ్గిపోతూ వస్తుండడంతో అసహనానికి గురవుతున్నట్లు స్పష్టం అవుతుంది.
వాస్తవానికి ఆయనకు `కూల్ మంత్రి’గా పేరుంది. ఎవరితోనైనా ప్రశాంతంగా, ఉద్రేక పడకుండా మాట్లాడే స్వభావం. రాజకీయ ప్రత్యర్థులతో సహితం వ్యక్తిగతంగా మంచి సంబంధాలు కొనసాగిస్తుంటారు. కాంగ్రెస్ లో ఉన్నంతకాలం ఉమ్మడి విజయనగరం జిల్లాల్లో ఆయనకు ఎదురు ఉండెడిది కాదు. ఆయన మంత్రిగా, భార్య ఎంపీగా, తప్పుడు, మరో బంధువు ఎమ్యెల్యేలుగా ఉన్న సందర్భంగా కూడా ఉంది.
అయితే, ఉత్తరాంధ్రపై మొన్నటివరకు విజయసాయిరెడ్డి, ఆ తర్వాత వైవీ సుబ్బారెడ్డి పెత్తనం చేస్తుండడంతో బొత్స దాదాపు ఉత్సవ విగ్రహంగా మారారు. కేవలం టిడిపిని తిట్టడం కోసమే, ప్రభుత్వం చేస్తున్న అక్రమపు పనులను సమర్ధించడం కోసమే బొత్సాను ఉపయోగించుకుంటున్నారు. ప్రభుత్వం ఎంత అడ్డదిడ్డంగా పనులు చేసినా వాటిని కూల్ గా కప్పిపుచ్చి చెప్పడంలో నేర్పరిగా పేరుంది.
అయితే మంత్రి పదవిని కాపాడుకున్నప్పటికీ తన సీనియారిటీకి తగిన మంత్రిత్వ శాఖను ఇవ్వలేదనే అసంతృప్తి మొదటి నుండి ఆయనలో ఉంది. పైగా, ఇచ్చిన మంత్రిత్వ శాఖలో సహితం సీఎంఓ లోని అధికారుల పెత్తనమే కానీ మంత్రిగా స్వతంత్రంగా వ్యవహరించే అవకాశం ఇవ్వడం లేదు. ఇటీవల ఎమ్యెల్సీ ఎన్నికలలో ఉత్తరాంధ్రలో వైసిపి ఓటమి అనంతరం విశాఖపట్నంను రాజధానిగా ప్రకటించినా పార్టీ భవిష్యత్తు పట్ల ఆయనలో ఆందోళన మొదలైంది.
అందుకని, తన అసహనాన్ని ఈ మధ్య పార్టీ కార్యకర్తలపై చూపుతున్నట్లు చెబుతున్నారు. ఆయనలో గతంలో ఎన్నడూ కనిపించని ఇటువంటి అసహనం ఆయన మద్దతుదారులకు సహితం విస్మయం కలిగిస్తోంది. తాజాగా సమస్యలు చెప్పుకొచ్చేందుకు వచ్చిన పార్టీ కార్యకర్తలపై ఒక్కసారిగా బరస్ట్ కావడంతో పాటు, ఆగ్రహంతో ఊగిపోవడం చూసిన వారికి దిమ్మతిరిగిన్నట్లయింది.
విజయనగరంలో బొత్స పర్యటించి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని కార్యకర్తలతో కలిసి మాట్లాడారు. ఆ సమయంలో ఎస్‌కోట టౌన్ అధ్యక్షుడు రెహమాన్ ఆయన్ను కలిసి స్థానిక పరిస్థితులు చెప్పే ప్రయత్నం చేశారు. దాంతో మంత్రి బొత్స సత్యనారాయణ ఒక్కసారిగా ఉగ్రరూపం చూపారు.
“ఏందయ్యా మీ బాధ.. మీకేనా బాధలు మాకు లేవా?” అంటూ కన్నెర్ర జేశారు. “కార్యకర్తలంటే ఇలానే ఉంటారా..? బాధలు అదరికీ ఉంటాయి, సమయం సందర్భం ఉండక్కర్లేదా.. యూజ్‌లెస్ ఫెలో” అంటూ “పార్టీలో ఉంటే ఉండండి, పోతే పోండి” అంటూ తీవ్ర స్వరంతో మందలించారు. దాంతో తమ బాధలు చెప్పుకోవడానికి వచ్చిన పార్టీ కార్యకర్తల ముఖం మాడిపోయింది.
బొత్స కామెంట్స్ తో ఆవాక్కయ్యారు కార్యకర్తలు. మంత్రి చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి. సమస్యలు చెప్పుకోవడానికి వస్తే ఇలాగేనా మాట్లాడేదంటూ బొత్స పై ఒంటి కాలిపై లేగుస్తున్నారు. గతంలో ఆయన ఎప్పుడూ కార్యకర్తలతో ఈ విధంగా వ్యవహరింపలేదని చెబుతున్నారు.