సస్పెన్షన్ ఎత్తివేతపై పెదవి విరిచిన రాజాసింగ్

Wednesday, January 22, 2025

గోషామహల్ ఎమ్యెల్యే రాజాసింగ్ పై బిజెపి కేంద్ర నాయకత్వం విధించిన సస్పెన్షన్ ను త్వరలోనే ఎత్తివేస్తారని అంటూ తాజాగా కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ చేసిన ప్రకటనల పట్ల ఆయన పెదవి విరిచారు. గత నాలుగు నెలలుగా తనకు ఇటువంటి మాటలే చెబుతున్నారని అంటూ ఒక విధంగా అసహనం వ్యక్తం చేశారు.

సస్పెన్షన్ ఎత్తివేయక పోవడంతో ఆయనను స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేయమని మద్దతు దారులు వత్తిడి చేస్తున్నారన్తి కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. మరొక వంక, టిడిపి నేతలు ఆయనను కలసి తమ పార్టీలో చేరమని ఆహ్వానించినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఆయన చేరితే హైదరాబాద్ నగరంలో కనీసం నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలలో ఆయన ప్రభావం చూపుతారని అంచనా వేస్తున్నారు.

మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వీడియో రిలీజ్ చేసినందుకు గానూ పార్టీ అధిష్ఠానం ఆయనను సస్పెండ్ చేసింది. శాసనసభా పక్ష నేతగా ఉన్న రాజాసింగ్‌ను ఆ పదవి నుంచి తొలగించింది. అయితే ఇదంతా జరిగి ఇప్పటికీ తొమ్మిది నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఈ విషయమై పార్టీ నాయకత్వం ఎటువంటి సమీక్ష జరపకపోవడం, షోకాజ్ నోటీసుకు ఆయన ఇచ్చిన సమాధానంపై కనీసం స్పందించక పోవడం పట్ల రాజాసింగ్ అసహనం వ్యక్తం చేస్తున్నారు.

2019 ఎన్నికలలో మొత్తం తెలంగాణాలో గెలుపొందిన బిజెపి అభ్యర్థి ఆయన ఒక్కరే కావడం గమనార్హం. జి కిషన్ రెడ్డి, డా. కె లక్ష్మణ్ వంటి నాయకులు ఓటమి చెందినా ఆయన వ్యక్తిగత ఇమేజ్ కారణంగా గెలుపొందారనే ప్రచారం జరిగింది. అందుకనే, ఆయనపై ఈర్శసూయలతో ఉన్న కొందరు నాయకులు సస్పెన్షన్ ఎత్తివేయకుండా పార్టీ కేంద్ర నాయకత్వాన్ని ప్రభావితం చేస్తున్నారనే ప్రచారం జరుగుతుంది.

ఈ విషయమై తెలంగాణలోని బిజెపి శ్రేణులలో సహితం ఆగ్రవేశాలు వ్యక్తం అవుతున్నాయని గ్రహించిన బండి సంజయ్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై సస్పెన్షన్ ఎత్తివేయాలని అధిష్టానాన్ని కోరామని బుధవారం వెల్లడించారు.  త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకుంటారని విశ్వాసం ఉందని పేర్కొన్నారు.

గత ఆదివారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహితం త్వరలో పార్టీ నాయకత్వం ఈ విషయమై ఓ నిర్ణయం తీసుకొంటుందని చెప్పారు.  నిర్ణయం తీసుకొనే సమయంలో తనను కూడా సంప్రదిస్తుందని అంటూ సస్పెన్షన్ త్వరలో ఎత్తివేయవచ్చని తెలిపారు.

బీజేపీ కార్యకర్తగా పార్టీ సిద్దాంతాలకు కట్టుబడి ఉంటానంటూ సంజాయిషీ నోటీసుకు సమాధానంగా పార్టీ నాయకత్వానికి వ్రాసిన లేఖలో తాను  పార్టీ లైన్ దాటి తానెప్పుడూ ప్రవర్తించలేదని రాజాసింగ్ స్పష్టం చేశారు. ప్రజలకు, హిందువులకు సేవ చేసేందుకు తనకు అవకాశం ఇవ్వాలంటూ అధిష్ఠానానికి విజ్ఞప్తి చేశారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles