సర్పంచ్ రౌండ్ టేబుల్ లో టిడిపి, బిజెపిలతో సహా అన్ని ప్రతిపక్షాలు!

Wednesday, January 22, 2025

ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి దుర్మార్గపు పరిపాలనపై ప్రజలలో వ్యతిరేకత స్పష్టంగా కనిపించడం కోసం ప్రతిపక్షాలకు ఒక వేదికపైకి రాక తప్పడం లేదు. తాజాగా విజయవాడలో సర్పంచులు, గ్రామాల సమస్యలపై జరిపిన అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశంలో టిడిపి, బిజెపిలతో సహా వామపక్షాలు, జనసేన, కాంగ్రెస్, బీఎస్పీ తదితర పార్టీల నాయకులు కూడా ఒకే వేదికను పంచుకున్నారు.

ఒక వంక టిడిపి, జనసేనలతో ఎన్నికల పొత్తు విషయంలో ఎడమొఖం, పెడమొఖంగా ఉంటూ వస్తున్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు బహుశా ఈ మధ్య కాలంలో మొదటిసారిగా టిడిపి, వామపక్షాలతో కలిసి ఒకే వేదికపై కనిపించారు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు వైవిబి రాజేంద్రప్రసాద్, రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షురాలు శ్రీమతి వానపల్లి లక్ష్మీ ముత్యాలరావుల ఆఢ్యర్మలో జరిగిన ఈ కార్యక్రమంలో సర్పంచుల సంఘం చేపట్టే అన్ని ఉద్యమాలకు అన్ని పార్టీలు మద్దతు ప్రకటించాయి. 

స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు అయిన సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పిటిసిలు, ఎంపీపీలు,  జిల్లా పరిషత్ చైర్మన్లు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పైన వారి హక్కులను సాధించుకోవడానికి చేస్తున్నటువంటి పోరాటానికి అన్ని పార్టీలు సంఘీభావం తెలిపాయి.

కేంద్ర ప్రభుత్వం పంపిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్ళించడం పై సర్పంచుల సంఘం నాయకులు ఢిల్లీకి వస్తే, స్వయంగా కేంద్రానికి ఫిర్యాదు చేద్దామని సోము వీర్రాజు సూచించారు. రాష్ట్ర అధ్యక్షులు వై.వి.బి. రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో సర్పంచుల సంఘం చేపట్టే అన్ని ఉద్యమాలకు బిజెపి `గల్లీ నుంచి ఢిల్లీ వరకు’ మద్దతుగా నిలుస్తుందని హామీ ఇచ్చారు.

కేంద్రం పంపిన నిధులను దారి మళ్లించి తన సొంత అవసరాలకు వాడుకొని సర్పంచులకు నిధులు విధులు అధికారాలు లేకుండా చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వంపై పోరాడుతున్న సర్పంచులు సంఘానికి అందరూ పూర్తి మద్దతు తెలిపారు. తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య,  జనసేన పార్టీ నాయకులు బండ్రెడ్డి రాము, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

సర్పంచుల నిధులు ,విధులు, అధికారాల సాధన కోసం కేంద్ర ప్రభుత్వం 14,15వ ఆర్థిక సంఘం ద్వారా 12,918 గ్రామాల సర్పంచులకు పంపిన రూ,,8660 కోట్లను తిరిగి సర్పంచుల  ఖాతాల్లో జమ చెయ్యాలని వారు ప్రధానంగా డిమాండ్ చేశారు.
గ్రామ సచివాలయాలను సర్పంచుల అధ్వర్యంలోకి తీసుకురావాలని, సర్పంచులకు , ఎంపీటీసీ లకు రూ:15 వేలు – అలాగే ఎంపీపీ లకు, జడ్పిటిసి లకు రూ,,30,000 వేలు గౌరవ వేతనం ఇవ్వాలని కోరారు.

ఉపాధి హామీ నిధులు కూడా గతంలో మాదిరే సర్పంచులకు ఇవ్వాలని, పాత పద్ధతిలోనే పంచాయతీలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని, గత మూడున్నర సంవత్సరములుగా రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసిన గ్రామపంచాయతీల బకాయి నిధులను వెంటనే విడుదల చేయాలని కూడా వారు డిమాండ్ చేశారు. జగన్ ప్రభుత్వం  రాజ్యాంగబద్ధంగా ప్రజాక్షేత్రంలో గెలిచిన సర్పంచుల హక్కులు కాలరాస్తున్నదని వారంతా మండిపడ్డారు. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles