సత్తెనపల్లిలో కన్నాకు సొంత పార్టీ నుండే సవాళ్లు!

Sunday, December 22, 2024

డాక్టర్‌ కోడెల శివ ప్రసాదరావు మృతి తర్వాత పార్టీలో కుమ్ములాటల కారణంగా ఇప్పటి వరకు పార్టీ ఇన్ ఛార్జ్ ను నియమించకుండా కాలయాపన చేస్తున్న టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు చివరకు మూడు నెలల క్రితం పార్టీలో చేరిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణను నియమించారు.

కన్నా నియామకాన్ని పార్టీ రాష్త్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు  ప్రకటించడం ద్వారా  వచ్చే ఎన్నికలలో పార్టీ అభ్యర్థిగా ఆయనే పోటీ చేయబోతున్నారనే సంకేతం ఇచ్చినట్లయింది. అయితే, సహజంగానే ఈ ప్రకటన ఆ సీట్ ఆశిస్తున్న టిడిపి నేతలకు ఆశాభంగం కలిగించింది.

ముఖ్యంగా తండ్రి ఉన్నప్పటి నుండి సత్తెనపల్లిలో టిడిపి వ్యవహారాలను సొంతంగా పర్యవేక్షిస్తున్న ఆయన కుమారుడు కోడెల శివరాంకు ఈ పరిణామం మింగుడు పడటం లేదు. తండ్రి మరణం నుండి సత్తెనపల్లి విషయం చర్చించేందుకు కలిసే ప్రయత్నం చేస్తుంటే కనీసం అవకాశం ఇవ్వని చంద్రబాబు నాయుడు ఇప్పుడు తన జీవితం అంతా టిడిపికి వ్యతిరేకంగా గడిపిన కన్నాకు ప్రాధాన్యత ఇస్తారా? అంటూ ఆగ్రవేశాలు వ్యక్తం చేస్తున్నారు.

జీవితంలో చివరి నిమిషం వరకు పార్టీ కోసం పోరాటం చేసిన కోడెల కుటుంబానికి ఇచ్చే మర్యాద ఇదా? అని ప్రశ్నించారు. అయితే, కోడెల జీవించి ఉన్నప్పుడే కొడుకు శివరాం వ్యవహారశైలి కారణంగా నియోజకవర్గంలో అల్లరిపాలై, 2019 ఎన్నికలలో ఓటమి చెందారని టిడిపి వర్గాలే ఆరోపణలు చేస్తున్నాయి. కొడుకును నియంత్రించుకోమని స్వయంగా చంద్రబాబు సూచించినా ప్రయోజనం లేకపోలేదని చెబుతున్నారు.

ప్రస్తుతం మంత్రిగా ఉన్న స్థానిక ఎమ్యెల్యే అంబటి రాంబాబు గత నాలుగేళ్లలో నియోజకవర్గంలో ప్రాబల్యం కోల్పోయినా తాజాగా మాజీ ఎమ్యెల్యే వెంకటేశ్వర రెడ్డి, ఒకప్పుడు కన్నాకు కుడిభుజంగా వ్యవహరించిన సూరిబాబు వంటివారి వైసిపిలో చేరడంతో కొంతమేరకు బలం సమకూర్చుకున్నారనే ప్రచారం ఉంది.

 అయితే, సీఎం జగన్ మోహన్ రెడ్డి చివరి క్షణంలో రాంబాబుకు సీట్ ఇవ్వకపోవచ్చని, వెంకటేశ్వరరెడ్డి లేదా ఆయన కుమారుడికి సీట్ ఇవ్వొచ్చని ప్రచారం కూడా జరుగుతోంది.  ఏదేమైనా కన్నా గతంలో పెదకూరపాడు, గుంటూరు పశ్చిమం నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహించినప్పుడు ఆయనకు కొండంత అండగా ఉన్న పలువురు నాయకులు ఇప్పుడు ఆయన వెంటలేరు.

పైగా, సత్తెనపల్లిలో ఇప్పటికే టీడీపీ చెల్లాచెదురు కావడంతో అక్కడ ఏమాత్రం నెగ్గుకు వస్తారనే ప్రశ్న తలెత్తుతుంది.  గతంలో గెలిచిన నియోజకవర్గాలలో తన పట్ల బాగా వ్యతిరేకత నెలకొనడంతో తిరిగి గెలవడం కష్టం కాగలదని తన సామాజికవర్గం తగు సంఖ్యలో ఉన్న సత్తెనపల్లిని ఎంచుకున్నారని ప్రచారం జరుగుతుంది.

1983 నుండి టిడిపి కేవలం మూడు పర్యాయాలు మాత్రమే గెలుపొందింది. మరో రెండు సార్లు టిడిపి మద్దతుతో సిపిఎం అభ్యర్థులు గెలుపొందారు. కాంగ్రెస్ మూడు సార్లు గెలుపొందగా, గత పర్యాయం వైసీపీ గెలుపొందింది. అంటే టిడిపి, వైసిపి బలాలు దాదాపు సమానంగా ఉన్నాయని చెప్పవచ్చు. టిడిపి శ్రేణులు అంతా ఉమ్మడిగా కృషి చేస్తే మినహా కన్నా గెలుపొందడం కష్టం కాగలదని అభిప్రాయం ఉంది.

కోడెల కుటుంబంతో తనకు వ్యక్తిగత విభేదాలు లేవని, జిల్లాలో వ్యక్తిగతంగా తనకు ఎవరితోనూ తనకు వ్యక్తిగతంగా వైరం లేదని, కేవలం పార్టీ పరంగానే వైరం ఉండేదని అంటూ అందరం కలిసి ముందుకు సాగుతామని చెప్పడం ద్వారా కన్నా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నట్లు స్పష్టం అవుతుంది. మరోవంక, అచ్చెన్నాయుడు నియోజకవర్గంలోని నేతలకు ఫోన్ చేసి అంతా కలిసి కన్నా నాయకత్వంలో పనిచేయాలని చెబుతున్నారు.

మాజీ ఎమ్మెల్యే వైవీ ఆంజనేయులతో చంద్రబాబు స్వయంగా మాట్లాడారని, ఇన్‌చార్జి బాధ్యతలను కన్నాకు ఇస్తున్నామని ఆయనకు సహకరించాలని సూచించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. డాక్టర్‌ కోడెల శివరాంతో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు బుధవారం ఫోన్‌లో మాట్లాడి బుజ్జగించే ప్రయత్నం చేశారని ప్రచారం జరుగుతుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles