సుదీర్ఘకాలం కాంగ్రెస్ లో ఎమ్యెల్యేగా, మంత్రిగా ఉంటూ బీజేపీలో రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేసి, ఇక అక్కడ పదవులేవీ వచ్చే అవకాశం లేదని టిడిపిలో చేరిన కన్నా లక్ష్మీనారాయణ వచ్చే ఎన్నికల్లో సత్తెనపల్లి నుండి పోటీచేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అక్కడ స్థానిక ఎమ్యెల్యే, రాష్ట్ర మంత్రి అంబటి రాంబాబు తీవ్ర ప్రజావ్యతిరేకతను ఎదుర్కొంటూ సునాయనంగా గెలుపొందవచ్చని అంచనా వేసుకున్నారు.
గతంలో గెలుపొందిన పెదకూరపాడు, గుంటూరు తూర్పు నుండి పోటీచేసేందుకు మాత్రం వెనుకాడుతున్నారు. అయితే, అనూహ్యంగా మాజీ ఎమ్యెల్యే యెర్రం వెంకటేశ్వరరెడ్డి వైసిపిలో చేరడంతో కన్నా గట్టి పోటీ ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో 2004, 2009లలో అక్కడి నుండి వరుసగా గెలుపొందారు. అయితే, 2019లో మాత్రం జనసేన అభ్యర్థిగా పోటీచేసే డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయారు.
అప్పటి నుండి రాజకీయంగా మౌనంగా అంటున్నప్పటికీ ఎన్నికల సంవత్సరంలో ఇప్పుడు అధికార పార్టీలో చేరారు. తాను ఎన్నికల్లో ఇక పోటీచేయనని, వైసిపి అభ్యర్థి ఎవరైనా గెలిపిస్తానని చెప్పినప్పటికీ సీట్ కోసమే చేరినట్లు సర్వత్రా భావిస్తున్నారు. స్వయంగా అంబటి రాంబాబు, ఎంపీ లావు కృష్ణదేవరాయలు దగ్గరుండి సీఎం జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసిపిలో చేర్పించడం గమనార్హం.
తన కుమారుడితో కలిసి యర్రం వెంకటేశ్వర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకోవడంతో సత్తెనపల్లి నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా వెంకటేశ్వర రెడ్డి లేదా నితిన్ రెడ్డి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతుంది. వెంకటేశ్వరరెడ్డికి వివాదరహితుడిగా నియోజకవర్గంలో మంచి పేరుంది. అంబటి రాంబాబు సహితం మళ్ళి సత్తెనపల్లి నుండి గెలుపొందడం కష్టమని గ్రహించి వేరే నియోజకవర్గం కోసం చూస్తున్నట్లు చెబుతున్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి కృష్ణాజిల్లాలోని అవనిగడ్డపై ఆయన దృష్టి ఉన్నట్లు తెలుస్తోంది.
సత్తెనపల్లిలో కన్నానపై బలమైన అభ్యర్థిని నిలబెట్టడం కోసమే సీఎం జగన్ వ్యూహాత్మకంగా వెంకటేశ్వరరెడ్డిని రంగంలోకి తీసుకొచ్చారని చెబుతున్నారు. సత్తెనపల్లి నియోజకవర్గం కేటాయిస్తారనే హామీతోనే కన్నా టిడిపిలో చేరుతున్నారని అంటున్నప్పటి నుండి వెంకటేశ్వరెడ్డి పేరు తెరపైకి వస్తున్నాయి.
వెంకటేశ్వరరెడ్డితో పాటు గతంలో కన్నా మంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు కుడిభుజంగా వ్యవహరించి, అన్ని వ్యవహారాలు నడిపించిన జిల్లా కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు సూరిబాబు కూడా వైసిపిలో చేరడం కన్నాకు కొంత ఇబ్బంది కలిగించే పరిణామంగా మారే అవకాశం ఉంది.