బిఆర్ఎస్ జాతీయ పార్టీగా అవతరించిన తర్వాత పలువురు ముఖ్యమంత్రులు, ప్రముఖ నాయకులతో గత వారం ఖమ్మంలో భారీ బహిరంగ సభ ద్వారా బలప్రదర్శనకు దిగిన సీఎం కేసీఆర్ వచ్చే నెల 17న జరుపనున్న నూతన సచివాలయం ప్రారంభ కార్యక్రమాన్ని సహితం రంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రంగా బిఆర్ఎస్ బలప్రదర్శనంగా మారే విధంగా పలు రాష్ట్రాలకు చెందిన అగ్రనాయకులను ఆహ్వానిస్తున్నారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఫిబ్రవరి 17న డా. బిఆర్. అంబేద్కర్ తెలంగాణ సెక్రెటరియేట్ బిల్డింగ్‌ను మధ్యాహ్నం 11.30 12.30 గంటల మధ్య ఆవిష్కరించనున్నారు. ఆవిష్కరణకు ముందు వేద పండితుతులతో వాస్తు పూజ, చండీ యాగం, సుదర్శన యాగం, ఇతర క్రతువులు చేపట్టనున్నారు.
తెలంగాణ సచివాలయ ఆవిష్కరణకు తమిళనాడు ముఖ్యమంత్రి , డిఎంకె అధ్యక్షుడు ఎంకె. స్టాలిన్, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, బీహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తరఫున జెడి(యు) జాతీయ అధ్యక్షుడు లలన్ సింగ్, డా. బిఆర్. అంబేద్కర్ మునిమనుమడు ప్రకాశ్ అంబేద్కర్ , తదితర ప్రముఖులు హాజరు కానున్నారు.
నూతన సచివాలయం ఆవిష్కరణానంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ సమావేశం జరుగునుందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు. ఈ సభకు సహితం భారీగా ప్రజలను సమీకరించే ప్రయత్నం చేస్తున్నారు.
ఏడంతస్తుల నూతన సెక్రెటరియేట్ భవనం హుస్సేన్ సాగర్ సరస్సు వద్ద ఉంది. దాదాపు పూర్తి కావొస్తున్న దశకు చేరింది. 7 లక్షల చదరపు అడుగుల స్థలంలో ఈ సెక్రెటరియేట్‌ను నిర్మించారు. అన్ని ఆధునిక వసతులతో దీనిని నిర్మించారు. దీనికి రూ. 600 కోట్లు ఖర్చయింది. భవన నిర్మాణం పనులు 2020 డిసెంబర్‌లో ఆరంభమై రెండేళ్లలో పూర్తయింది.
కొత్త సచివాలయానికి ఇప్పటికే డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరు పెట్టారు. నూతన సచివాలయాన్ని సందర్శించి, సచివాలయ నిర్మాణ పురోగతిని పరిశీలిస్తున్నారు. వచ్చేనెలలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. మంగళవారం భవనం లోపల కలియతిరిగిన సీఎం పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు.