భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరుతో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఆదివారం అట్టహాసంగా ప్రారంభించిన తెలంగాణ సచివాలయ భవన ప్రారంభోత్సవంలో ప్రోటోకాల్ రగడ ఏర్పడింది. ఈ కార్యక్రమం ఒక విధంగా అధికార బిఆర్ఎస్ కార్యక్రమంగా జరిగింది. ప్రతిపక్షాలకు చెందిన ప్రజాప్రతినిధులు కూడా పాల్గొనక పోవడం, ఆంధ్రజ్యోతి వంటి మీడియా సంస్థలకు అనుమతి నిరాకరించడంతో సంబరాలు ప్రశ్నార్థకంగా మారాయి.
రాష్ట్ర ప్రధమ పౌరురాలినే గవర్నర్ డా. తమిళసై సౌందరరాజన్ కు మర్యాదపూర్వకంగా కూడా ఆహ్వానం ఎప్పటి మాదిరిగా పంపలేదు. అందుకనే ఆమె ఈ సమయంలో ప్రధాని మోదీ మన్ కి బాద్ కార్యక్రమం 100వ ఎడిషన్ ను సంబరంగా జరుపుకొంటూ నిమగ్నమయ్యారు. ప్రారంభోత్సవంకు సంబంధించి దినపత్రికల్లో ఇచ్చిన నిలువెత్తు ప్రకటనలలో కూడా ప్రోటోకాల్ పాటించలేదు.
ప్రభుత్వం జారీచేసే అధికారిక ప్రకటనలలో ముఖ్యమంత్రి ఫోటోతో పాటు, సంబంధిత శాఖ మంత్రి ఫోటో కూడా కొంచెం చిన్నదిగా ప్రచురించడం ఆనవాయితీగా వస్తుంది. అయితే, ఏప్రిల్ 14న అంబెడ్కర్ విగ్రహావిష్కరణ సందర్భంగా, ఇప్పుడు సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా జారీచేసిన ప్రకటనలలో కేవలం నిలువెత్తు ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోటో మాత్రమే ఉంది. కనీసం సంబంధిత మంత్రిత్వ శాఖ పేరు కూడా లేదు.
ఇక, కొత్త సచివాలయ ప్రారంభోత్సవం ఆహ్వానాలను అందించే విషయంలో ఎంపీ, ఎమ్మెల్యేలను తెలంగాణ ప్రభుత్వం అగౌరవ పరిచిందనే విమర్శలు చెలరేగుతున్నాయి. ప్రోటోకాల్ ప్రకారం ఎంపీ, ఎమ్మెల్యేలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేదా సీఎంవో నుంచి ఆహ్వానాలు పంపాలి. కానీ ప్రభుత్వం మాత్రం ఇవన్నీ పట్టించుకోకుండా జేసీలతో ఫోన్ ద్వారా విపక్ష నేతలకు సమాచారం పంపి చేతలు దులుపుకుంది.
దీంతో తమకు కనీస మర్యాద కూడా పాటించలేదని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. అందుకే ప్రారంభోత్సవానికి విపక్ష ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరుకాలేదు. ప్రజల సొమ్ముతో కట్టిన సెక్రటేరియేట్‌లో ప్రారంభోత్సవాన్ని కేసీఆర్ తన సొంత కార్యక్రమంలా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పంజాబ్, ఢిల్లీ, ఒడిసా, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, ఈశాన్య రాష్ట్రాలకు చెందిన 70 మందికి పైగా జర్నలిస్టులకు ప్రత్యేకంగా ఆహ్వానాలను పంపారు. వారికి రానుపోను విమాన చార్జీలనూ భరిస్తోంది. వారి బస కోసం ఓ స్టార్ హోటల్‌లో ఆతిథ్యాన్ని ఏర్పాటు చేసింది. మీడియాకు ఇచ్చిన గౌరవం కూడా విపక్ష ప్రజా ప్రతినిధులకు ఇవ్వలేదని సదరు నేతలు వాపోతున్నారు.
మరోవంక, ప్రభుత్వం ఇతర రాష్ట్రాల ప్రజాప్రతినిధులు, విలేకరులకూ ఆహ్వానాలు పంపింది. కానీ స్థానికంగా ఉండే ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’, ‘ఆంధ్రజ్యోతి’కి ఆహ్వానాన్ని నిరాకరించింది. ఆంధ్రజ్యోతి, కొత్త సచివాలయంలోకి అడుగు పెడితే, మరిన్ని వాస్తవాలు బయటకు వస్తాయనే భయపడుతున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ప్రజల సొమ్ముతో నిర్మించిన ప్రభుత్వ సౌధంలోకి మీడియాపై ఆంక్షలు విధించడం బహుశా దేశంలో మరెక్కడా జరిగి ఉండదు.