తెలంగాణ ముఖ్యమంత్రికి ముఖ్య సలహాదారుగా నియమితులైన మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేసీఆర్ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించనున్నట్లు కనిపిస్తున్నది. సచివాలయంకు తరచూ వచ్చే అలవాటు కేసీఆర్ కు లేకపోవడం, పైగా మంత్రులకు, ఉన్నతాధికారులకు సహితం అందుబాటులో లేకపోతూ ఉండడంతో సోమేశ్ కుమార్ వాస్తవానికి తానే కేసీఆర్ అయిన్నట్లు మొత్తం పాలనాయంత్రాంగంపై పెత్తనం చేయబోతున్నట్లు స్పష్టం అవుతుంది.
కొత్త సచివాలయంలోని ఆరో అంతస్తులోనే ఆయనకు కూడా ఛాంబర్ కెత్తాయించనున్నట్లు వెల్లడి కావడంతో ఈ అంశం స్పష్టం అవుతుంది. ముఖ్యమంత్రి, ఆయన కార్యాలయ కార్యదర్శులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు తదితరులకు మాత్రమే ఆరో అంతస్తులో చాంబర్లు ఉన్నాయి.
ఇప్పుడు ముఖ్యమంత్రికి చీఫ్ అడ్వయిజర్‌గా నియమితులైన సోమేశ్ కుమార్‌కు కూడా అక్కడే ఒక ఛాంబర్ అలాట్ అయింది. గత నెల 30న సెక్రటేరియట్‌కు ప్రారంభోత్సవం జరిగినప్పుడే ఆరో అంతస్తులో ఒక ఛాంబర్‌ను ఎవరికీ కేటాయించకుండా రిజర్వులో ఉంచడం ఐఏఎస్ అధికారుల్లో చర్చకు దారితీసింది. దీన్ని ఎవరి కోసం ఉంచారనే గుసగుసలు వినిపించాయి. ఇప్పుడా విషయమై స్పష్టత వచ్చినట్లయింది.
సోమేశ్ కుమార్‌కు త్వరలో కొత్త బాధ్యతలు అప్పజెప్పనున్నట్లు ముఖ్యమంత్రి డిసైడ్ అయినందునే ఆయన కోసం ఒక ఛాంబర్‌ను హోల్డ్‌లో పెట్టారనే అనుమానానికి తాజా నియామక ఉత్తర్వులతో బలం చేకూరినట్లయింది. దానితో మొత్తం పాలనాయంత్రాంగంకు అధిపతిగా భావించే ప్రస్తుత ప్రధాన కార్యదర్శి `ఉత్సవ విగ్రహం’ మాదిరిగా మిగిలిపోయే అవకాశం ఉందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.
ముఖ్యమంత్రి కేసీఆర్ సచివాలయానికి వచ్చినా రాకున్నా ప్రగతి భవన్ నుంచి అందే ఆదేశాల మేరకు సోమేశ్ కుమార్ సచివాలయం నుంచి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేస్తారన్న ప్రచారం జరుగుతుంది. అన్ని శాఖల మీద సోమేశ్ ముద్ర కనిపిస్తుందని, రోజువారీ వ్యవహారాల్లోనూ ఆయన జోక్యం ఉండొచ్చన్న అనుమానాన్ని ఐఏఎస్ అధికారులు వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యమంత్రి లేనప్పుడు సోమేశ్ కుమార్ అన్నీ తానై వ్యవహరిస్తారని, అందువల్లనే ఆరో అంతస్తులో ఆయన కోసం ఛాంబర్‌ను ముందుచూపుతోనే రిజర్వు చేసి ఉంచడాన్ని ఉదహరిస్తున్నారు. ఇక వివిధ శాఖాధిపతులు కీలక ఆదేశాలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శివైపు కాకుండా సోమేశ్ కుమార్ వైపు చూడవలసిన పరిస్థితి ఏర్పడనుంది.
గతంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు సహితం తానే ముఖ్యమంత్రి అన్నవిధంగా అధికారులపై ఆయన ఆధిపత్యం వహిస్తుండేవారని ప్రతీతి. ఎందుకంటె ముఖ్యమంత్రిని కలవడం ఉన్నతాధికారులకు సహితం సాధ్యం కానందున తనకు సంబంధంలేని అంశాలలో సహితం ఆయనే `ఆదేశాలు’ జారీ చేస్తుండేవారని చెబుతుండేవారు.
ఉన్నతాధికారులకు కాకూండా మంత్రులకు సహితం నేరుగా సూచనలు చేసే అవకాశం ఉంది. ఒక విధంగా `సూపర్ సీఎం’గా వ్యవహరింపనున్నట్లు స్పష్టం అవుతుంది. రాజీవ్ శర్మ వంటి ప్రధాన కార్యదర్శులను పదవీ విరమణ తర్వాత సలహాదారులుగా నియమించినా రోజువారీ పాలనలో జోక్యం కలుగచేసుకొనేవారు కాదని చెబుతారు.