సంజయ్ యాత్ర నుండి దృష్టి మళ్లించడం కోసమే షర్మిల అరెస్ట్!

Wednesday, December 18, 2024

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వై ఎస్ షర్మిల సంవత్సరంకు పైగా తెలంగాణాలో ప్రజాప్రస్థానం పాదయాత్ర జరుపుతూ ఉన్నప్పటికీ పట్టించుకొనే కేసీఆర్ ప్రభుత్వం అకస్మాత్తుగా సోమవారం అరెస్ట్ చేయడం రాజకీయ వర్గాలలో విస్మయం కలిగిస్తోంది. మరే ప్రతిపక్ష నేత చేయనంత పదునుగా కేసీఆర్ నుండి స్థానిక ఎమ్మెల్యే వరకు టీఆర్ఎస్ నేతలపై ఆమె దారుణంగా విమర్శలు కురిపిస్తున్న ఎవ్వరూ పెద్దగా పట్టించుకోవడం లేదు.

ఆమె యాత్ర చేస్తున్న చోట స్థానిక టిఆర్ఎస్ నేతలు, అరుదుగా కొద్దిమంది మంత్రులు ఆమె విమర్శలను తిప్పి కొట్టడం మినహా ఆమె యాత్రపై దాడికి పూనుకోవడం, దాడి హింసాత్మకంగా మారడం గమనిస్తే ఇదంతా అనుకోకుండా జరిగింది కాదని, రాజకీయ ఎత్తుగడ తోనే జరిగి ఉండవచ్చని పలువురు భావిస్తున్నారు.

పైగా, తనను అరెస్ట్ చేయడం కోసం కేసీఆర్ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నదని, అందుకోసమే తన యాత్రపై దాడి జరిగినదని షర్మిల స్వయంగా సోమవారం ఉదయమే ఆరోపించడం, సాయంత్రంకల్లా ఆమె అరెస్ట్ కావడం గమనార్హం. సోమవారం నుండి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ తన ప్రజాసంగ్రామ యాత్ర ఐదవ దశను నిర్మల్ జిల్లా నుండి ప్రారంభించడానికి సన్నాహాలు చేసుకొన్నారు.

ప్రస్తుతం బిజెపి ఉత్తర తెలంగాణలోనే బలంగా ఉంది. నలుగురు ఎంపీలలో ముగ్గురు ఆ ప్రాంతం నుండే గెలుపొందారు. అక్కడ సంజయ్ పాదయాత్ర చేస్తుండడం, అది కూడా మతపరంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న భైంసా నుండి ప్రారంభిస్తుండడంతో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం అర్ధాంతరంగా ఆదివారం సాయంత్రం అనుమతిని రద్దు చేయడం, యాత్రకు బయలు దేరిన సంజయ్ ను దారిలో అరెస్ట్ చేసి, కరీంనగర్ కు పంపి వేయడం జరిగింది.

ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు ఆందోళనలకు దిగవచ్చనే ఉద్దేశ్యంతో, ప్రజల దృష్టిని అటువైపు నుండి మళ్లించడం కోసమే షర్మిలను అరెస్ట్ చేస్తిన్నట్లు కనిపిస్తోంది. అయితే సంజయ్ నియోజకవర్గ పరిసరాలలో – కరీంనగర్, నిర్మల్ లలో తప్ప మిగిలిన చోట్ల ఎక్కడ బిజెపి శ్రేణులు కదిలి, రోడ్లపైకి వచ్చిన దాఖలాలు లేవు.

పాదయాత్రలో భాగంగా నర్సంపేట నియోజకవర్గంలో పర్యటిస్తున్న షర్మిల అధికార పార్టీకి చెందిన స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిపై చేసిన వివాదాస్పద వాఖ్యాలను ఆసరాగా చేసుకొని, ఘర్షణలు జరిగే విధంగా చేయడం ద్వారా ఉద్రిక్త పరిస్థితులు సృష్టించారని అనుమానాలు కలుగుతున్నాయి.  ఎమ్మెల్యేపై షర్మిల వ్యాఖ్యలతో టీఆర్ఎస్ శ్రేణులు ఒక్కసారిగా భగ్గుమన్నాయి.

సుదర్శన్ రెడ్డికి క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే.. కొంతమంది టీఆర్ఎస్ కార్యకర్తలు షర్మిల ప్రచార రథానికి నిప్పు పెట్టారు. పాదయాత్ర వాహనాలపై రాళ్లు రువ్వారు. ఫ్లెక్సీలు తగలబెట్టి షర్మిల గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.

ఊహించిన విధంగానే, టీఆర్ఎస్ శ్రేణుల నిరసనలపై షర్మిల కూడా తీవ్రస్థాయిలో స్పందించారు. తన కాన్వాయ్‌పై దాడి చేయటాన్ని పిరికిపంద చర్యగా ఆమె అభివర్ణించారు. తెలంగాణలో తన పాదయాత్రకు ప్రజల నుంచి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక దాడులకు పాల్పడుతున్నారని షర్మిల ఆరోపించారు. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుట్రపూరితంగా, ఇలా దాడులు చేయించారని ఆమె ఆరోపించారు.

దానితో మరింత రెచ్చిపోయిన టీఆర్ఎస్ శ్రేణులు పెద్ది సుదర్శన్ రెడ్డికి క్షమాపణలు చెప్పేవరకూ తగ్గేది లేదంటూ దాడులకు సిద్ధపడిన నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్య అంటూ  వైఎస్ షర్మిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles