సంజయ్ యాత్రకు తెలంగాణ పోలీసుల షాక్!

Saturday, January 18, 2025

బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ సోమవారం నుండి చేపట్టదలచిన ప్రజా సంగ్రామ యాత్ర ఐదవ విడత పాదయాత్రకు చివరి సమయంలో రాష్ట్ర పోలీసులు అనుమతి రద్దు చేస్తున్నామని అంటూ మోకాలడ్డారు. దానితో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులపై, కేసీఆర్ ప్రభుత్వంపై రాష్ట్ర బిజెపి నేతలు మండిపడుతున్నారు.

పాదయాత్ర కోసం ఆదివారం సాయంత్రం నిర్మల్ జిల్లా భైంసాకు బయల్దేరిన సంజయ్ ను వెంటాడి, కాపు కాసి, అరెస్ట్ చేసి, కరీంనగర్ కు తీసుకు వచ్చి వదిలిపెట్టారు. ఈ సందర్భంగా నిరసనలు వ్యక్తం చేసిన బిజెపి కార్యకర్తలపై పలుచోట్ల పోలీసులు విరుచుకుపడ్డారు. లాఠీలను ప్రయోగించారు.

పాదయాత్రకు ముందు అనుమతి ఇచ్చి, తర్వాత పోలీసులు తనను అడ్డుకోవడంపై సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. షెడ్యూల్ ప్రకారమే ప్రజా సంగ్రామ యాత్ర చేసి తీరుతానని స్పష్టం చేశారు. మరోవైపు సంజయ్ అరెస్టుతో జగిత్యాల, కోరుట్ల, మెట్​పల్లి పట్టణాల్లో బీజేపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసనలకు దిగారు. దీంతో కరీంనగర్ నుంచి కోరుట్ల వరకు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 

అయితే, బీజేపీ అడిగిన రూట్ మ్యాప్‌కు అనుమతి ఇవ్వడం కష్టం అని నిర్మల్ జిల్లా పోలీసులు చెప్పగా, ప్రత్యామ్నాయ మార్గం ఇవ్వాలని బీజేపీ కోరింది. అయితే.. అంతకుముందు సంజయ్ చేసిన నాలుగో విడత పాదయాత్రలో భాగంగా వరంగల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పాదయాత్రకు అనుమతిఇవ్వటం కుదరదని పోలీసులు తేల్చి చెప్పారు.

నిర్మల్‌లోని భైంసా ఏరియాలో మత ఘర్షణలు జరిగే అవకాశం ఉందని చెప్తున్న పోలీసులు సంజయ్ పాదయాత్రకు అనుమతి ఇవ్వటం సాధ్యం కాదని తేల్చి చెబుతున్నారు. యాత్రకు పోలీసులు పర్మిషన్ ఇవ్వక పోవటంతో బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.

నిర్మల్‌లోని ఎస్పీ ఆఫీస్ ఎదుట బీజేపీ శ్రేణులు ధర్నాకు దిగారు. ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో బీజేపీ శ్రేణులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో.. అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్ని అడ్డంకులు సృష్టించినా పాదయాత్ర కొనసాగుతుందని బీజేపీ శ్రేణులు స్పష్టం చేశాయి.

సంజయ్ ఆగ్రహం

ముందు అనుమతిచ్చి ఇప్పుడు హఠాత్తుగా రద్దు చేయడం ఏంటని పోలీసులను ప్రశ్నించారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ హాజరవుతున్న ప్రారంభ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయన, రూట్ మ్యాప్ కూడా ప్రకటించాక అనుమతి నిరాకరించడం దారుణమని ఆయన మండిపడ్డారు.

భైంసా ఏమైనా నిషేధిత ప్రాంతమ? అక్కడికి ఎందుకు వెళ్లొద్దని ప్రశ్నించారు. భైంసానే కాపాడలేని ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని ఏం కాపాడుతారని విమర్శించారు. సీఎంకు చేతకాకపోతే ఇంట్లో కూర్చోవాలని మండిపడ్డారు. సోమవారం మధ్యాహ్నం  వరకు తమకు సమయం ఉందని, అప్పటివరకు వేచి చూస్తామని చెప్పారు. గొడవలు జరగకుండా సజావుగా యాత్ర జరిగేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

భైంసా వేరే దేశంలో ఉందా? భైంసా వెళ్లాలంటే వీసా తీసుకోవాలా? అని  సంజయ్‌ ప్రశ్నించారు. భైంసాను ప్రత్యేక దేశం చేసి ఓవైసీ కుటుంబానికి అప్పజెబుతున్నారా అని ఎద్దేవా చేశారు. భైంసా సున్నితమైన ప్రాంతమని పోలీసు అధికారులు ఇప్పుడు హఠాత్తుగా చెబుతున్నారని, తాము అనుమతి కోరినప్పుడు సున్నితమైన ప్రాంతమనేది గుర్తుకురాలేదా? అని నిలదీశారు.  భైంసాలో 3 రోజుల నుంచి బహిరంగ సభ వేదిక ఏర్పాట్లను పోలీసు అధికారులు పర్యవేక్షిస్తున్నప్పడు ఈ ముఖ్యమంత్రికి గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు.


హైకోర్టును ఆశ్రయించిన బిజెపి

కాగా,  పోలీసులు అనుమతి నిరాకరించడంపై బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ఈ పాదయాత్రకు అనుమతివ్వాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తొలుత హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయాలని భావించినా అది కుదరకపోవడంతో బీజేపీ తరఫు న్యాయవాది ఫస్ట్ కాల్ లిస్ట్ లో మెన్షన్ చేశారు.

కోర్టు ఉత్తర్వుల మేరకు బండి ఐదో విడత పాదయాత్ర కొనసాగింపునపై స్పష్టత వచ్చే అవకాశముంది. మరోవైపు కరీంనగర్ లోని  సంజయ్ నివాసం వద్ద పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. ఆయన బయటకు వస్తే అరెస్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు సభ, పాదయాత్ర నిర్వాహణపై సంజయ్ కరీంనగర్లోని తన నివాసంలో  లీగల్ టీంతోచర్చలు జరుపుతున్నారు.

సంజయ్ పాదయాత్రకు పోలీసులు అనుమతిని రద్దు చేయడం పిరికిపంద చర్యే అని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ధ్వజమెత్తారు.  ఓటమి భయంతోనే కేసీఆర్​ ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆమె మండిపడ్డారు.  తెలంగాణలో బీజేపీ బలపడుతుండటాన్ని కేసీఆర్​ జీర్ణించుకోలేకపోతున్నారని ఆమె చెప్పారు. పోలీసులు ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles