సంజయ్ మార్క్ చెరిపేస్తున్న కిషన్ రెడ్డి

Saturday, January 18, 2025

మూడేళ్లకు పైగా రాష్ట్ర బిజెపి అధ్యక్షునిగా కొనసాగిన బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డితో సహా సీనియర్ నేతలు అందరిని పక్కన పెట్టి తన మార్క్  పార్టీపై ఏర్పాటు చేసుకున్నారు. ఇతర పార్టీల నుండి చేరిన వారిలో ఎంపిక చేసిన కొందరిని తన చుట్టూ తిప్పుకొంటూ, ప్రజలలో ఎటువంటి ప్రభావం చూపలేని పార్టీ నేతలను వెంట వేసుకొంటూ పార్టీ మొత్తం తన కబంధ హస్తాలలో ఉండేటట్లు చేసుకున్నారు.

ఆ క్రమంలోనే కేంద్ర నాయకులను సహితం తాను చెప్పేటట్లు వినేవిధంగా చేసుకున్నారు. సంజయ్ అధ్యక్ష పదవి కోల్పోవడానికి ప్రధాన కారణాలలో ఒకటి ఎంతగా ప్రయత్నం చేసినా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీజేపీలో కాకుండా కాంగ్రెస్ లో చేరడం. దానితో ఈటెల రాజేందర్ వంటి వారు విజృభించి సంజయ్ నాయకత్వం ఉన్నంతవరకు బీజేపీలో ఎవ్వరు చేరారని ఢిల్లీలో స్పష్టం చేశారు.

దానితో ప్రతిష్టగా తీసుకొని పొంగులేటి రాహుల్ గాంధీతో ఖమ్మంలో భారీ బహిరంగ సభ ఏర్పాటుకు ముందుగానే అమిత్ షాతో అక్కడ సభ ఏర్పాటు చేసే ప్రయత్నం చేశారు. అయితే వివిధ కారణాలతో గతనెలలో వాయిదా పడిన ఆ సభ ఈ నెల 29న జరిపేందుకు రంగం సిద్ధమైంది. అయితే ఇంతలో రాష్ట్ర అధ్యక్ష పదవి చేపట్టిన కిషన్ రెడ్డి రాష్ట్ర పార్టీపై తన మార్క్ ఉంచుకునేందుకు అమిత్ షా ఖమ్మం పర్యటనను మార్చివేసి, ఆ రోజు హైదరాబాద్ లో పలు కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు.

ఈ మార్పు ఒక విధంగా బండి సంజయ్ ప్రస్తానం  ఇక రాష్ట్ర పార్టీలో ముగిసిందని సంకేతం ఇచ్చేందుకే అని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఆ రోజున అమిత్ షా తో తెలంగాణ మేధావులతో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.  పార్టీ రాష్ట్ర శాఖ పదాధికారులు, తెలంగాణలోని అసెంబ్లీ నియోజకవర్గాల కన్వీనర్లు, జిల్లాల అధ్యక్షులు, ఇతర ముఖ్యనేతలతో.. అమిత్ షా భేటీలు ఏర్పాటు చేస్తున్నారు. 

తెలంగాణ మేధావులు, ఉద్యమకారులు, కవులు, కళాకారులు, పారిశ్రామికవేత్తలు, సామాజికవేత్తలు, విద్యావేత్తలు, వివిధ కులసంఘాలు, సామాజిక సంఘాల, నాయకులతో అమిత్ షా సమావేశమయ్యేలా కార్యక్రమానికి రూపకల్పన చేస్తున్నారు.  మరోవంక, బండి సంజయ్ హయాంలో బీజేపీ రాష్ట్ర కార్యాలయం వైపు చూసేందుకు విముఖంగా ఉంటూ వస్తున్న నేతలకు కీలక బాధ్యతలు అప్పచెప్పుతున్నారు.

ఇప్పటికే ఈటెల రాజేందర్ ను ఎన్నికల యాజమాన్య కమిటీ కన్వీనర్ గా కేంద్ర పార్టీ నియమించింది. బండి సంజయ్ పై బహిరంగ విమర్శలు చేసిన నిజామాబాదు ఎంపీ డి అరవింద్ కు కీలకమైన సోషల్ మీడియా విభాగం అప్పచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అదే విధంగా చాలాకాలంగా సంజయ్ పొడగిట్టకుండా ఉంటున్న ఎమ్యెల్యే రఘునందన్ రావు సహితం ఇప్పుడు క్రియాశీలకంగా తిరుగుతున్నారు.

మరోవంక, సంజయ్ సన్నిహితునిగా వ్యవహరించి, రాష్ట్ర అధ్యక్షుని మార్పు పట్ల బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేసిన జిట్టా బాలకృష్ణారెడ్డిని ఏకంగా పార్టీ నుండి సస్పెండ్ చేశారు. మరో అసంతృప్తి నేత విజయశాంతిని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. ఆమె కూడా మొండిగా వ్యవహరిస్తే బైటకు పంపేందుకు వెనకాడమనే సంకేతం ఇస్తున్నారు.

రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని రాష్త్ర పార్టీలో 27 కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కమిటీల ఏర్పాటు అంతా కిషన్ రెడ్డి కనుసన్నలలో జరుగనుంది. బండి సంజయ్ ప్రాబల్యాన్ని తుడిచివేసే అవకాశం ఉంది. గత మూడున్నరేళ్లుగా పార్టీలో ప్రభావం కోల్పోయిన పలువురు నేతలను తిరిగి తెరపైకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles