సంజయ్ మద్దతుగానే జితేందర్ రెడ్డి `దున్నపోతు’ ట్వీట్

Saturday, January 18, 2025

దున్నపోతును వెనుక నుంచి కాలితో తంతూ వ్యాన్‌లోకి ఎక్కిస్తున్న ఒక వీడియోను ట్విట్టర్ లో పోస్టు చేయడం ద్వారా బీజేపీ మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి గురువారం తెలంగాణ బీజేపీలో కలకలం సృష్టించారు. ‘రాష్ట్ర బీజేపీ నాయకత్వానికి ఇలాంటి శాస్తే చేయాల్సి ఉన్నది’ అని పేర్కొన్నారు.

పైగా ఈ ట్వీట్‌కు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌, కార్యదర్శి సునిల్‌ బన్సల్‌, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, జాతీయ బీజేపీని ట్యాగ్‌ చేశారు. దానిని ట్వీట్ చేసిన కొద్దిసేపటికి డిలిట్ చేసి, మరి వెంటనే తిరిగి ఉంచారు. అంటే ఉద్దేశ్యపూర్వకంగానే తెలంగాణ బీజేపీలో జరుగుతున్న వ్యవహారాలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు స్పష్టం అవుతుంది. 

బిజెపి రాష్త్ర అధ్యక్షుడు బండి సంజయ్ నాయకత్వంపై నలువైపులా నుండి తీవ్రమైన అసమ్మతి వ్యక్తం కావడం, ఆయన నేతృత్వంలో తెలంగాణాలో పార్టీ మనుగడ కష్టమనే సంకేతాలు జాతీయ నాయకత్వంకు కూడా వెళ్లడంతో అసహనంతో చేసిన ట్వీట్ గా బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి.

సంజయ్ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న వారందరిని, ముఖ్యంగా ప్రధానంగా సవాల్ చేస్తున్న మాజీ మంత్రి ఈటెల రాజేందర్ వంటి వారిని వరుసపెట్టి తన్నాలనే సంకేతం ఈ ట్వీట్ ద్వారా ఇచ్చినట్లుగా పలువురు విశ్లేషణ చేస్తున్నారు.

వాజపేయి హయాంలో బిజెపి ద్వారా రాజకీయ ప్రవేశం చేసి, ఎంపీగా ఎన్నికైన ఆయన కేంద్ర మంత్రి పదవి రాలేదనే ఆగ్రహం, ఆ తర్వాత ఎంపీగా ఓటమి చెందడం, కేంద్రంలో యుపిఎ ప్రభుత్వం ఏర్పడటంతో కాంగ్రెస్ లో చేరారు. అయితే అక్కడ కూడా ఎవ్వరూ లెక్క చేయక పోవడంతో బిఆర్ఎస్ లో చేరి, 2009లో ఎంపీగా  ఎన్నికయ్యారు. అయితే 2014లో తిరిగి ఎంపీ సీట్ ఇవ్వకపోవడంతో బీజేపీలో చేరారు.

తనకున్న పలుకుబడితో కేంద్రంలో మోదీ ప్రభుత్వంలో కీలక పదవి లభిస్తుందని ఎదురుచూసిన ఆయనకు నిరాశే ఎదురైంది. అయితే బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్ష పదవి చేపట్టినప్పటి నుండి జితేందర్ ఎడ్డికి ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. ఒక విధంగా రాష్ట్ర బీజేపీలో సంజయ్ తర్వాత ఆయనే నాయకుడిగా భవిస్తూ వచ్చారు. దుబ్బాక, హుజురాబాద్ ఉపఎన్నికలకు ఆయనే పార్టీ ఇన్ ఛార్జ్ గా ఉన్నారు.

అయితే, ఈటల బిజెపిలోకి రావడంతో తనకు ప్రాధాన్యం తగ్గిందని, తన గురించి ఎవ్వరూ పట్టించుకోవడం లేదని సన్నిహితుల వద్ద చెప్పుకున్నారని వార్తలు వచ్చాయి. ఇటీవలే ఈటెలకు ముఖ్యమైన పదవి పార్టీలో ఇవ్వాలని కేంద్ర నాయకత్వం ఆలోచిస్తున్నట్లు వార్తలు రాగానే  జితేందర్‌రెడ్డి ఇంట్లో డీకే అరుణ, విజయశాంతి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి వంటి నేతలు సమావేశమై ఈటల వ్యవహార శైలిపైనే తీవ్ర విమర్శలు చేశారు.

తాజా ట్వీట్‌పై జితేందర్‌రెడ్డి వివరణ ఇస్తూ ‘బండి సంజయ్‌ నాయకత్వాన్ని ప్రశ్నించేవాళ్లకు ఎలాంటి ట్రీట్మెంట్‌ ఇవ్వాలో’ చెప్పానంటూ మరో ట్వీట్‌ చేశారు. ఇది కూడా ఈటల రాజేందర్‌ వర్గాన్నే టార్గెట్‌ చేసినట్టు విశ్లేషకులు చెప్తున్నారు. ఈ ట్వీట్ ఇచ్చిన తర్వాత గురువారం సాయంత్రం నాగర్ కర్నూలులో జరిగిన “నవ సంకల్ప సభ”లో బండి సంజయ్ తో కలిసి జితేందర్ రెడ్డి పాల్గొనడం గమనార్హం. ఈ విధంగా ట్వీట్ ఇచ్చినందుకు కనీసం మందలించిన దాఖలాలు కూడా లేవు.

అయితే, పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి కె కృష్ణసాగర్ రావు మాత్రం సీనియర్ నాయకులే ఈ విధమైన ప్రకటనలు ఇవ్వడాన్ని ఆక్షేపిస్తూ శుక్రవారం ఘాటైన ప్రకటన విడుదల చేశారు. ఇలాంటి ప్రకటనలు, వ్యాఖ్యలు చేస్తున్న వాళ్లు తాము అసలు ఏ పార్టీలో ఉన్నామో మర్చిపోయినట్టున్నారని ఘాటుగా విమర్శించారు.

ఇది బీజేపీ అని, బిఆర్ఎస్ లేదా కాంగ్రెస్ పార్టీ కాదని అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీనీ, పార్టీ నాయకత్వాన్నీ బహిరంగంగా విమర్శించే సంస్కృతి, వ్యవసథా బీజేపీలో లేదని, ఉండబోదని ఆయన స్పష్టం చేశారు.

ప్రస్తుతం ఇలాంటి వ్యాఖ్యలు, ప్రకటనలు చేస్తున్న వాళ్లంతా దాదాపు ఏదో ఒక రాష్ట్ర, జాతీయ స్థాయి కమిటీల్లో ఉన్నవాళ్ళే అని ఆయన గుర్తు చేశారు. వారికి తమ గొంతు వినిపించడానికి పార్టీ తగిన అవకాశం, వేదిక ఇచ్చింది కూడా అని తెలిపారు. పార్టీ ఎజెండా కంటే వ్యక్తిగత ఎజెండాలు ఎప్పటికీ ఎక్కువ కాదని కృష్ణసాగర్ రావు స్పష్టం చేశారు. పార్టీలో ఒక ‘లక్ష్మణ రేఖ’ ఉందని మర్చిపోకూడదని ఆయన హెచ్చరించారు. 

ఇక  జితేందర్ రెడ్డి చేసిన ట్వీట్ పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. “జితేందర్ రెడ్డి గారు… బీజేపీ అంతర్గత ‘తన్నులాట’ను అద్భుతమైన పోలికతో ప్రజలకు వివరించారు. ఆ పార్టీలో చేరిన వారి పరిస్థితి గురించి ఇంత కంటే గొప్పగా ఎవరూ చెప్పలేరు!” అంటూ ఎద్దేవా చేస్తూ ట్వీట్ చేశారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles