కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ప్రస్తుతం శవాసనం వేసి ఉన్న మాట వాస్తవం. ఆ పార్టీ తిరిగి బతికి బట్టగడితే చాలు.. పూర్వవైభవం సంగతి నెమ్మదిగా ఆలోచించుకోవచ్చు.. అనేది పార్టీలోని అనేకమంది అభిప్రాయంగా ఉంది. అయితే.. దేశంలో చాలా రాష్ట్రాల్లో దాదాపు కనుమరుగు అయిపోయిన ఈ పార్టీ ఢిల్లీ పీఠంపైకి రావాలని ఉబలాటపడుతూ ఉండడమే తమాషా. ఆ మాటకొస్తే అధికార పీఠం కావాలని ప్రతి ఒక్క పార్టీ కలలు కనవచ్చు. దానికి తగ్గట్టుగా కష్టపడాలి. ప్రజల నమ్మకాన్ని సంపాదించాలి. అదేం లేకుండా.. అన్ని పార్టీలను మానిప్యులేట్ చేయగలిగితే చాలు.. సంకీర్ణం వచ్చేస్తుంది అనే భ్రమల్లో బతుకుతున్నది కాంగ్రెస్. అక్కడితో ఆగడం లేదు.. సంకీర్ణ ప్రభుత్వమే వస్తే గనుక.. దానికి కాంగ్రెస్ పార్టీ మాత్రమే సారథ్యం వహించగలదని కూడా సెలవిస్తున్నది. తమను ప్రజలు చీకొడుతున్నా, తమకు సొంతంగా అధికారంలోకి వచ్చే బలం లేకపోయినా, సంకీర్ణంలో భాగంగా ఉండడం తప్ప వేరే గతి లేకపోయినా.. ఆ సంకీర్ణానికి తామే పెత్తనం చేయాలని కలగనడమే కాంగ్రెస్ లోని భావ దారిద్ర్యానికి చిహ్నంగా ఉంది. తాజాగా ఆ పార్టీ సారథి మల్లిఖార్జున ఖర్గే మాటల్లో ఆ విషయమే వెల్లడవుతోంది.
జాతీయ స్థాయిలో మోడీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలు ఒక్కటవుతున్న సంగతి అందరూ గమనిస్తూనే ఉన్నారు. మోడీని గద్దె దించితే చాలు.. పదవులు గట్రా ఏమీ అక్కర్లేదు అనే ఎజెండాతో నితీశ్ కుమార్ లాంటి వాళ్లూ పార్టీలను ఏకతాటిమీదకు తేవడానికి కష్టపడుతున్నారు. అదే సమయంలో.. మోడీని ఓడించి తానే అధికారంలోకి రావాలనే ఎఝెండాతో కేసీఆర్ లాంటి వాళ్లు చెలరేగిపోతున్నారు. ఇలాంటి నేపథ్యంలో ప్రతిపక్షాలు అన్నీ ఐక్యంగా ఉంటాయా అనేదే సందేహంగా ఉంది.
అయితే ఖర్గే మాట్లాడుతూ.. 2024 ఖచ్చితంగా సంకీర్ణ ప్రభుత్వమే వస్తుందని.. దానికి కాంగ్రెస్ పార్టీ మాత్రమే సారథ్యం వహిస్తుందని సెలవిస్తున్నారు. ఈ కోరిక చాలా చిత్రంగా ఉంది. బిజెపిని ఓడించడం వారికి చేతకాక, అందుకు బలమైన అనేక ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడుతూ.. వారి భుజాలను తొక్కుకుంటూ తాము అధికారం చెలాయించాలని చూడడమే కాంగ్రెస్ అసలు బుద్ధికి నిదర్శనంలా ఉంది. ‘సంకీర్ణ ప్రభుత్వం వస్తుంది.. సారథి ఎవరు, ప్రధాని ఎవరు అనేది అప్పుడు తేలుతుంది’ అని ఖర్గే చెప్పి ఉంటే చాలా మర్యాదగా ఉండేది. ఖర్గే ఇలాంటి అలవిమాలిన ఆశలను బయటపెడితే.. కుదిరే సంకీర్ణం కూడా బెడిసి కొట్టే ప్రమాదాలు ఎక్కువ. కాంగ్రెస్ పరిస్థితి పాపం.. ఆ భాజపాయేతర కూటమిలో కూడా లార్జెస్ట్ పార్టీగా అవతరించే అవకాశం ఉన్నట్టుగా లేదు. కానీ, వారి ఆశలు మాత్రం అంతకు మించి ఉన్నాయి.
ఆలూలేదు చూలూ లేదు అన్నట్టుగా.. సంకీర్ణ మైత్రి ఇంకా కుదరలేదు.. మోడీ ఓడిపోలేదు.. అప్పుడే సారథ్యం ప్రధాని పోస్టు తమకు కావాలని కాంగ్రెస్ అనడం చిత్రమే.
సంకీర్ణ సారథ్యంపై కాంగ్రెస్ కక్కుర్తి!
Tuesday, November 12, 2024