షర్మిల రాజకీయాలు దారితప్పుతున్నాయా?

Sunday, December 22, 2024

వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి ముద్దుల తనయురాలిగా, తెలంగాణలో వైఎస్సార్‌ రాజకీయ వారసత్వాన్ని కొనసాగించే లక్ష్యంతో సొంత పార్టీ పెట్టుకుని పోరాడుతున్న వైఎస్ షర్మిల రాజకీయాలు దారితప్పుతున్నట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. కాంగ్రెస్ హయాంలో అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీబీఐ కేసులలో జైలుకు వెళ్లినప్పుడు ప్రజలలోకి చొచ్చుకు పోవడం ద్వారా వైసిపి అస్థిత్వాన్ని కాపాడి, రాజకీయంగా బలమైన నేతగా గుర్తింపు పొందారు.

అయితే, ఆ తర్వాత ఆమె ఉనికి పార్టీలో సమాంతర నాయకత్వంకు దారితీస్తుందనే భయంతో జగన్ ఆమెను దూరంగా పెడుతూ వచ్చారు. 2014లో కడప లేదా ఒంగోలు నుండి లోక్ సభకు పోటీచేయాలి అనుకొంటే పడనీయకుండా, తల్లి విజయమ్మను విశాఖపట్నంలో పోటీ చేయించగా, ఆమె ఓటమి చెందారు. 2019లో అధికారంలోకి వచ్చినా ఆమెకు ఎటువంటి పాత్ర లేకుండా చేశారు.

దానితో అన్నకు దూరంగా, అన్నకు ఇష్టం లేకపోయినా తల్లితో కలిసి హైదరాబాద్ లో మకాం వేస్తూ, తెలంగాణ రాజకీయాలలో ఉనికి చాటుకొనే ప్రయత్నం చేస్తూ, పాదయాత్ర చేపట్టారు. అన్నతో తెరచాటు స్నేహం గల తెలంగాణ సీఎం కేసీఆర్ నే ఢీకొనే ప్రయత్నం చేస్తున్నారు.  అయినా, రాజకీయంగా చెప్పుకోదగిన బలం సమకూర్చుకోలేక పోతున్నారు.

ఇటువంటి పరిస్థితులలో, సోమవారం షర్మిల వ్యవహార శైలి, పోలీసులతో ఘర్షణ పడిన తీరు, ఆ తర్వాతి పరిణామాలతో రాజకీయంగా రావాల్సిన మైలేజీ కంటే ఎక్కువ అప్రతిష్టను ఆమె మూటగట్టుకోవాల్సి వచ్చింది. ఆమెకు తోడుగా ఇప్పటివరకు హుందాగా అందరి నుండి గౌరవం పొందుతున్న విజయమ్మ వైఖరి సహితం వివాదాస్పదమైంది.

తెలంగాణలో విస్తృతంగా పాదయాత్ర చేసినా ఇప్పటివరకు ఒక్కసారి కూడా ప్రత్యక్ష ఎన్నికలలో పాల్గొనక పోవడంతో ఆమె ప్రభావం స్పష్టం కావడం లేదు. వచ్చే ఎన్నికలలో స్వయంగా పోటీకి తలబడుతానని ప్రకటించడంతో తొలిసారి ఆమె అదృష్టాన్ని పరీక్షించుకోవాల్సి ఉంటుంది.  ఈ క్రమంలో షర్మిల వ్యవహరిస్తున్న తీరు మిగిలిన పార్టీలను సైతం విస్తుగొలిపేలా ఉంటోంది.

తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న షర్మిల పలు సందర్భాల్లో అదుపు తప్పినట్లు వ్యవహరిస్తున్నారు. గతంలో ప్రగతి భవన్ ముట్టడిస్తానంటూ పంజాగుట్ట చౌరస్తాలో హడావుడి చేశారు. దీంతో పోలీసులు ఆమె కారులో ఉంచి ఎస్‌ఆర్‌ నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించాల్సి వచ్చింది.

అంతకు ముందు పాదయాత్ర జరుగుతుండగా తన వాహనంపై టిఆర్ఎస్ శ్రేణులు దాడి చేశాయని ఆందోళనకు దిగారు. స్థానిక ఎమ్మెల్యేపై విమర్శలు గుప్పించడంతో వివాదం చెలరేగింది. ఇటీవల ప్రభుత్వంపై పోరాటానికి కలిసి రావాలంటూ కోరడానికి సిపిఎం కార్యాలయానికి వెళ్లి వారిపై విమర్శలు గుప్పించారు.

రాజశేఖర్‌ రెడ్డి కుమార్తె అనే ఏకైక అర్హతతో ఏమి చేసిన చెల్లుతుందనే భావన ఆమెలో కనిపిస్తుందనే విమర్శ చెలరేగుతుంది. తాను చెప్పేది మాత్రమే చెల్లుబాటు కావాలనుకునే నైజంతో షర్మిల వెంట పెద్దగా చెప్పుకోదగిన నాయకులు ఎవరు మిగల్లేదు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles