షర్మిల ప్రయాణం కాంగ్రెస్ తోనే … రాహుల్ ట్వీట్ తో స్పష్టం 

Sunday, December 22, 2024

వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన రాజకీయ ప్రయాణం గురించి తండ్రి జన్మదినమైన జులై 8న ఓ కీలక ప్రకటన చేస్తారని అందరూ ఎదురు చూశారు. తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడమా, లేదా కాంగ్రెస్ తో కలిసి ప్రయాణం చేయడమా అనే విషయమై నెలకొన్న సందిగ్థతకు తెర వేస్తారని భావించారు.

తండ్రికి నివాళులు అర్పిస్తూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ట్వీట్ కు కృతజ్ఞతలు తెలుపుతూ ఆమె ఇచ్చిన ట్వీట్ ద్వారా తాను కాంగ్రెస్ తో కలిసి రాజకీయ ప్రయాణం సాగింపనున్నట్లు స్పష్టమైన సంకేతం ఇచ్చారు. అదే సమయంలో మధ్యలో ఆగిపోయిన తన పాదయాత్రను తిరిగి ప్రారంభిస్తున్నట్టు ప్రకటించడం ద్వారా తెలంగాణ రాజకీయాలకు పరిమితం కానున్నట్లు స్పష్టం చేసినట్లయింది.

అయితే తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తారా? లేదా ఆ తన పార్టీని కొనసాగిస్తూనే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటారా? అనే విషయంలో మాత్రం ఆమె ఇంకా స్పష్టత ఇవ్వలేదు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ  ఆయనకు నివాళులు అర్పిస్తూ “కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా ఆయనకు నా నివాళులు. ఆంధ్రప్రదేశ్ ప్రజల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన దార్శనికత కలిగిన నాయకుడు. వైఎస్ఆర్ చిరస్మరణీయ నేత” అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.

అందుకు వైఎస్ షర్మిల ట్విటర్ వేదికగా ధన్యవాదాలు తెలుపుతూ  “దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఆయన జ్ఞాపకాలను స్మరించుకుంటూ మీ ఆప్యాయతతో కూడిన మాటలకు ధన్యవాదాలు. మీ నాయకత్వంలో ఈ దేశానికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని నమ్మి తెలుగు ప్రజల సేవలో మరణించిన నిబద్ధత కలిగిన కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ వైఎస్ఆర్. ఆయన సంక్షేమం నమూనా నేటికీ దేశవ్యాప్తంగా ప్రాధాన్యమైన పాలనా నమూనాగా ఉంది. డాక్టర్ వైఎస్ఆర్ మీ గుండెల్లో చిరస్థాయిగా నిలిచినందుకు ధన్యవాదాలు సర్” అని ట్వీట్ చేశారు.

ఈ సందర్భంగా “మీ నాయకత్వంలో ఈ దేశానికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని నమ్మి తెలుగు ప్రజల సేవలో మరణించిన నిబద్ధత కలిగిన కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ వైఎస్ఆర్” అని పేర్కొనడం ద్వారా రాహుల్ ను ప్రధానిగా చూడటం తన తండ్రి గారి ఆశయం అన్న విషయాన్ని ఆమె గుర్తు చేసినట్లయింది. అంటే, తాను కాంగ్రెస్ తో కలిసి రాజకీయం చేయబోతున్నట్లు స్పష్టమైన సంకేతం ఇచ్చారు.

కడప జిల్లాలోని ఇడుపుల పాయలో గల వైఎస్సార్ ఘాట్‌‌ను సందర్శించి, తల్లి విజయమ్మ, కుమార్తె అంజలి రెడ్డి, కుమారుడు రాజారెడ్డిలతో కలిసి తండ్రికి నివాళి అర్పించారు. అనంతరం ఆమె అక్కడి నుంచి నేరుగా ఖమ్మం జిల్లా పాలేరుకు చేరుకున్నారు. వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. 

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో షర్మిల ఈ నియోజకవర్గం నుంచే పోటీ చేయనున్న విషయం తెలిసిందే. విగ్రహావిష్కరణ అనంతరం ప్రసంగిస్తూ తన పాదయాత్రను పునరుద్ధరించబోతోన్నట్లు తెలిపారు. ఈ నెలలోనే మళ్లీ పాదయాత్ర ప్రారంభిస్తానని, పాలేరులో 4,000 కిలోమీటర్లతో దీన్ని పూర్తి చేస్తానని ఆమె వెల్లడించారు. పాలేరు ప్రజలకు వైఎస్ఆర్ సంక్షేమ పాలన అందిస్తానని, ఈ నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని షర్మిల తెలిపారు. ఇప్పటికే ఆమె 3,800 కిమీ పాదయాత్రను పూర్తి చేశారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles