షర్మిల ఏపీ రాజకీయాలకు నో … వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి పట్టు!

Friday, November 22, 2024

దిగవంతి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల రెండేళ్ల క్రితం పెట్టిన వైఎస్సార్ టిపిని విలీనం చేసుకొనేందుకు కాంగ్రెస్ అగ్రనాయకత్వం సుముఖంగా ఉన్నప్పటికీ, షర్మిలకు కాంగ్రెస్ లో ఇచ్చే ప్రాధాన్యత విషయంలో తేల్చుకోలేక పోతున్నారు. అందుకనే ఆమె పార్టీ విలీనం మరి కొంత జాప్యం జరిగే అవకాశం ఉంది.

 సుమారు పదేళ్ల క్రితం చిరంజీవి నాయకత్వంలోని ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసుకున్న తర్వాత దక్షిణాదిన మరో రాజకీయ పార్టీని విలీనం చేసుకొనేందుకు కాంగ్రెస్ ఇప్పుడు ఆసక్తి చూపుతుంది. అయితే అప్పుడు చిరంజీవి ఎన్నికలలో 18 శాతం ఓట్లతో 18 సీట్లు గెల్చుకొని, తన సత్తా నిరూపించుకొని కాంగ్రెస్ లో విలీనమయ్యారు.

అయితే, ఇప్పుడు ఎన్నికలపరంగా షర్మిల సత్తా ఎవ్వరికీ తెలియదు. పైగా, ఆమె ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ లో పనిచేయాలని కాంగ్రెస్ అగ్రనేతలు కోరుకొంటున్నారు. అందుకు ఆమె ఇష్టపడితే పిసిసి నాయకత్వంతో పాటు,  రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు.  ప్రస్తుతం కాంగ్రెస్ ఉనికి లేని ఏపీలో ఆమె సారధ్యంలో బలం పుంజుకోవచ్చని అంచనా వేస్తున్నారు.

అయితే, అక్కడ ఆమె అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండడంతో, అన్నతో నేరుగా రాజకీయంగా షర్మిల తలపడేందుకు వారిద్దరి తల్లి వైఎస్ విజయలక్ష్మి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తున్నది. అందుకనే తాను తెలంగాణకు మాత్రమే పరిమితమవుతానని షర్మిల స్పష్టం చేశారు.  అయితే, తెలంగాణ కాంగ్రెస్ లో ఆమెకు ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వాలనే విషయమే పార్టీ నేతలు తేల్చుకోలేక పోతున్నారు.

షర్మిలను పార్టీలో చేర్చుకొని విషయమై నేరుగా ప్రియాంక గాంధీ పర్యవేక్షిస్తున్నారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్, కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ ల ద్వారా ఆమె షర్మిలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ సందర్భంగా షర్మిల డిమాండ్లను ఎదుర్కోవడమే కాంగ్రెస్ కు సమస్యగా ఉంది.

ఆమె కోరుతున్నట్లు పాలేరు సీట్ ఆమెకు ఇవ్వడానికి ఇబ్బంది లేకపోయినప్పటికీ మొత్తం 35 సీట్లలో అభ్యర్థుల నిర్ణయం తనకు వదిలి వేయాలని ఆమె స్పష్టం చేస్తున్నారు. పైగా, టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించాలని, ఎన్నికల సమయంలో స్టార్ కాంపైనర్ గా చేయాలని కూడా ఆమె కోరుతున్నారు.

అయితే, తెలంగాణ కాంగ్రెస్ నేతలలో ఆమెకు ప్రాధాన్యత ఇవ్వడం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రేవంత్ రెడ్డి వంటి వారు ఆమెకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే ఆంధ్రావొళ్ళు పెత్తనం చేస్తున్నారని కేసీఆర్ ప్రచారం చేసేందుకు అవకాశం కల్పించినట్లవుతుందని హెచ్చరిస్తున్నారు.  సొంతంగా ఒక సీట్ కూడా గెలిపించుకునే సత్తాలేని ఆమెకు ఏకంగా మూడోవంతు సీట్లు అప్పచెప్పడం ఆత్మత్యాసాదృశ్యం కాగలదని కూడా పలువురు భావిస్తున్నారు.

రెండేళ్ల క్రితం సొంతంగా పార్టీ పెట్టుకొని, 3,800 కిమీ పాదయాత్ర జరిపిన షర్మిల ప్రస్తుతం రాజకీయంగా మీడియా ప్రకటనలకే పరిమితం అవుతున్నారు. కాంగ్రెస్ తో విలీనం విషయం ఓ కొలిక్కి వస్తే చూద్దాం అనే ధోరణిలో వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ తో విలీనంకు సంబంధించి అన్ని సంప్రదింపులు ఆమె పక్షాన ఆమె భర్త బ్రదర్ అనిల్ చూసుకొంటున్నారని తెలుస్తున్నది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles