షర్మిల అరెస్ట్ .. మరోసారి పాదయాత్రకు ఆటంకం

Saturday, January 18, 2025

వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలను మహబూబాబాద్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేయడంతో ఆమె పాదయాత్రకు మరోమారు ఆటంకం ఏర్పడింది. శనివారం మహబూబాబాద్ బహిరంగ సభలో మాట్లాడిన షర్మిల, అంతకు ముందు స్థానిక ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్‌  పరస్పరం తీవ్రస్థాయిలో వ్యక్తిగత దూషణలకు దిగడంతో నెలకొన్న ఉద్రిక్తల పరిస్థితుల దృష్ట్యా పోలీసులు ఈ చర్య తీసుకున్నారు.

పైగా, శంకర్ నాయక్‌ని పరుష పదజాలంతో దూషించారని టిఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆమెపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి.. అరెస్ట్ చేశారు.అయితే, ఆమెపై తొలుత పరుషపదజాలంతో మాట్లాడి రెచ్చగొట్టేవిధంగా వ్యవహరించిన శంకర్ నాయక్ పై మాత్రం పోలిసులు ఎటువంటి చర్య తీసుకొనక పోవడం గమనార్హం.

శనివారం మహబూబాబాద్ జిల్లా నెళ్లికుదురు మండల కేంద్రంలో మాట్లాడిన ఆమె ఎమ్మెల్యే శంకర్ నాయక్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దానితో ఆదివారం ఉదయం  వైఎస్ షర్మిల బస చేసిన ప్రాంతానికి ఎమ్మెల్యే అనుచరులు, బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ముందుజాగ్రత్తగా పోలీసులు కూడా భారీగా మోహరించారు.

మహబూబాబాద్‌లో వైఎస్ షర్మిల పాదయాత్ర నేపథ్యంలో ఆమెపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.  “కొజ్జాల్లా ఉన్న కొందరు ఆంధ్రా వలస వాదులు వస్తున్నారని అభ్యంతరకర కామెంట్స్ చేశారు. పర్యటనలు చేసుకుంటే చేసుకోండి కానీ.. మాట్లాడే భాష అదుపులో లేకుంటే మాత్రం.. కంకర రాళ్లకు మరోసారి పనిచెప్పాల్సి ఉంటుందని హెచ్చరించారు.  తమ  పార్టీ కార్యకర్తలకు కనుసైగా చేస్తే చాలు..  తరిమి తరిమి కొడతారు” అంటూ  బెదిరించారు.

శంకర్‌నాయక్ కామెంట్స్‌పై అంతే స్థాయిలో ఎదురుదాడికి దిగారు షర్మిల.  నెళ్లికుదురు మండల కేంద్రంలో ప్రజలనుద్దేశించి మాట్లాడిన ఆమె.. శంకర్‌నాయక్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ” శంకర్ నాయక్ సైగ చెయ్యి.. ఎవడోస్తాడో  చూస్తా..” అంటూ సవాల్ విసిరారు. మీ తాటాకు చప్పుళ్లకు భయపడమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

”శంకర్ నాయక్ బెదిరించే ధోరణిలో మాట్లాడుతున్నాడు. పాదయాత్రను అడ్డుకునేలా కార్యకర్తలను ఉసి గొల్పుతున్నారు.  శంకర్ నాయక్.. సైగ చెయ్ ఎవగడొస్తాడో చూస్త. మీ తాటాకు చప్పుళ్లకు భయపడేది కాదు ఈ వైఎస్సార్ బిడ్డ” అంటూ ఆమె హెచ్చరించారు.

“ప్రజల పక్షాన నిలబడి, కొట్లాడుతున్నందుకు భయపడాలా..?. మీరు చేసిన మోసాలు ఎత్తి చూపిస్తున్నందుకు భయపడాలా? మీరు నోరు తెరిస్తే చాలు అన్ని అబద్ధాలు మాట్లాడతారు. శంకర్ నాయక్ ఒక కబ్జా కోరు. జనాల దగ్గర భూములు గుంజుకోడమే ఆయనకు తెలుసు.”  అని ఘాటు వ్యాఖ్యలు చేశారు షర్మిల.

కాగా, ఇదివరలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటన భాగంగా…. నర్సంపేటలో కూడా షర్మిల పాదయాత్ర చేసిన సమయంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే పెద్దిరెడ్డిపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేయటంతో… పలువురు నేతలు, కార్యకర్తలు ఆమె కాన్వాయ్ వాహనాన్ని తగలబెట్టారు. ఈ క్రమంలో షర్మిలను కూడా అరెస్ట్ చేశారు పోలీసులు.

ఆ తర్వాత పాదయాత్రకు అనుమతి కూడా రద్దు చేశారు. అయితే కోర్టుకు వెళ్లి అనుమతి తీసుకున్న షర్మిల… ఈ మధ్యనే తిరిగి పాదయాత్రను పునఃప్రారంభించారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles