షర్మిలను కూడా సిబిఐ విచారణకు పిలుస్తుందా?

Thursday, September 19, 2024

వైయస్సార్ తెలంగాణ పార్టీ వ్యవస్థాపకరాలు తెలంగాణలో వైయస్సార్ వారసురాలిగా అధికారం దక్కించుకుంటానని ప్రతిజ్ఞతో పాదయాత్ర చేస్తున్న షర్మిలను సిబిఐ విచారణకు పిలుస్తుందా?  ఆమె ద్వారా కొన్ని సాక్ష్యాలను నమోదు చేస్తుందా?  వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎవరి పాత్ర ఎంత అనేది నిర్ధారించేందుకు  ఆమె విచారణ కూడా అవసరమా?  వైఎస్ అవినాష్ రెడ్డి సూత్రధారిగా ఈ హత్య జరిగిందని ఆరోపణలు నిగ్గు తేలాలంటే షర్మిల చెప్పే వివరాలు కూడా అత్యంత కీలకంగా ఉన్నాయా?  అనే  చర్చ ఇప్పుడు ప్రజల్లో జరుగుతోంది.  సిబిఐ అధికారులు తెలంగాణ హైకోర్టుకు దాఖలు చేసిన కౌంటర్లో షర్మిల పేరు కూడా ప్రస్తావించడమే ఇందుకు కారణం. 

కౌంటర్లో వైయస్ వివేకానంద రెడ్డి హత్యకు దారి తీసిన అనేక కారణాలను సిబిఐ ప్రస్తావించింది.  సెటిల్మెంట్లలో వాటాలు తేలక పోవడం కూడా వాటిలో ఒకటి.  హత్య చేసిన వ్యక్తులు  హత్యకు ముందు,  ఆ తర్వాత కూడా అవినాష్ రెడ్డి ఇంట్లోనే ఉన్నట్లుగా సిబిఐ ఆధారాలు సేకరించారు, కౌంటర్లో తెలియజేశారు.  హత్య గురించి అవినాష్ రెడ్డికి ముందే తెలుసునని సిబిఐ అంటోంది. 

సిబిఐ తమ కౌంటర్లో పేర్కొన్న వివరాలలో.. రాజకీయ కారణాలు కూడా ఉన్నాయి. ఇవి అందరికీ తెలిసినవే అయినప్పటికీ సి.బి.ఐ కౌంటర్లో హైకోర్టుకు నివేదించిన దృష్ట్యా వీటి ప్రాధాన్యం పెరిగింది.  కడప ఎంపీ సీటును వైయస్ షర్మిల లేదా విజయమ్మ లలో ఒకరికి కేటాయించాలని,  అవినాష్ రెడ్డిని జమ్మలమడుగు ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని వివేకానంద రెడ్డి ప్రతిపాదించారట.  అయితే అవినాష్ రెడ్డికి మాత్రం కడప ఎంపీ సీటు మీదనే ఆలోచన ఉంది.  చిన్నాన్న చేసిన ప్రతిపాదనకు వైఎస్ షర్మిల కూడా అంగీకరించారని  సిబిఐ చెబుతోంది.  ఈ విషయం బహిరంగమై ప్రజల్లోకి వచ్చిన తర్వాత,  వివేకానంద రెడ్డి పై అవినాష్ కక్ష కట్టారని చెబుతోంది.

 ఇప్పుడు ఈ విషయాన్ని నిర్ధారించడానికి షర్మిల సాక్ష్యం కూడా అవసరం అయ్యే అవకాశం ఉంది. చిన్నాన్న వివేకానంద రెడ్డి కడప ఎంపీ సీటుపై జగన్ వద్ద చేసిన ప్రతిపాదన నిజమేనా,  కడప ఎంపీగా పోటీ చేయడానికి షర్మిల అంగీకరించిన మాట వాస్తవమేనా?  అనే సంగతులు కూడా తేలాలి.  అది నిజమైతే ఆ ప్రతిపాదన ఎందుకు కార్యరూపం దాల్చలేదో..  స్పష్టంగా చెప్పగలిగేది షర్మిల మాత్రమే. 

 కేసుకు సంబంధించిన అన్ని వివరాలను సమగ్రంగా సేకరించడానికి వివిధ వర్గాల నుంచి వ్యక్తులను పిలిచి విచారిస్తున్న సిబిఐ,  రాజకీయ కారణాలను  నిగ్గు తేల్చడానికి షర్మిలను కూడా పిలిచి సాక్ష్యం తీసుకుంటుందా? ? అదే జరిగితే షర్మిల చెప్పబోయే వివరాలు చాలా పెద్ద సంచలనంగా మారే అవకాశం ఉంటుంది.  అన్నతో విభేదించి,  ఏపీ రాజకీయాలను పూర్తిగా విస్మరించి,  తెలంగాణలో తన రెక్కల కష్టంతో రాజకీయ ప్రస్థానం సాగించాలనుకుంటున్న షర్మిల..  సిబిఐ విచారణకు రావడం అంటూ జరిగితే ఏం చెబుతారు అనేది ఆసక్తికరంగా మారుతోంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles