షర్మిలక్క విలీనం జగన్ కు దబిడి దిబిడే!

Sunday, January 19, 2025

వైయస్ రాజశేఖర్ రెడ్డి తనయ వైఎస్ షర్మిల తెలంగాణ రాజకీయాల్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు విలీన ఎత్తుగడనే ఆశ్రయిస్తున్నారు. ఇన్నాళ్లూ ఒంటరిగా తన రెక్కల కష్టం మీదనే పార్టీని నడుపుతూ వచ్చిన వైఎస్ షర్మిల కేసీఆర్ వ్యతిరేక స్వరం వినిపించడంలో తనదైన ముద్ర చూపించారు. రాష్ట్రంలో ఇప్పటికే సుదీర్ఘమైన పాదయాత్రను చేస్తూ.. ఆమె కేసీఆర్ వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకువెళ్లడం సక్సెస్ అయ్యారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా అన్ని స్థానాలలోనూ ఎన్నికలలో పోటీ చేయగలిగేంత సంస్థాగత నిర్మాణం ఆమెకు లేకుండా పోయింది. తాను ఎన్నికలలో పోటీ చేసినా,  అసెంబ్లీలో ప్రవేశించడం కూడా బహుశా ఆమెకు దుస్సాధ్యంగా కనిపించి ఉండవచ్చు. మొత్తానికి వైయస్ కుటుంబానికి శ్రేయోభిలాషులు అయిన కాంగ్రెస్ పెద్దల చొరవ, పూనికతో వైయస్సార్ తెలంగాణ పార్టీ… కాంగ్రెసులో విలీనం కావడానికి రంగం సిద్ధం అయినట్లుగా కనిపిస్తుంది.

కర్నాటక ఉపముఖ్యమంత్రి డికె శివకుమార్ తో షర్మిల రెండుసార్లు భేటీ కావడం, రాహుల్ బర్త్ డే నాడు శుభాకాంక్షలు ట్వీట్ చేయడం దగ్గరినుంచే విలీనం గురించిన మాటలు వినిపిస్తున్నాయి. తాజాగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెళ్లి డికె శివకుమార్ ను కలిసినప్పుడు కూడా ఆయన షర్మిల కాంగ్రెసులో విలీనం చేసుకోవాలని సూచించినట్లుగా వార్తలు వచ్చాయి. షర్మిల పార్టీలోకి వస్తే రావొచ్చు గానీ.. ఆమెను ఏపీ రాజకీయాల్లోకి పంపాలని అనుకున్న రేవంత్ రెడ్డి వర్గం కోరిక నెరవేరకపోవచ్చు. ఆమె ప్రధానంగా తెలంగాణ రాజకీయాల్లోనే ఉండదలచుకున్నట్టుగా సమాచారం.

వైయస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తారా లేదా పొత్తు పెట్టుకుంటారా అనేదిశగా కొన్ని రోజులుగా సందిగ్ధత నడిచింది.  తెలంగాణ రాజకీయ వర్గాలలో వినిపిస్తున్న విశ్వసనీయ సమాచారాన్ని బట్టి.. ఆమె విలీనానికి మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఆమె కోరిన ఖమ్మం జిల్లా పాలేరు ఎమ్మెల్యే సీటుతో పాటు.. వైయస్ కూతురుగా గౌరవప్రదమైన ప్రాధాన్యం ఆమెకు కాంగ్రెస్ పార్టీలో ఉంటుందని హామీ దక్కినట్లుగా తెలుస్తోంది.

అయితే తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయని విషయంలోనే ఉభయ తెలుగు రాష్ట్రాలలో సంచలన చర్చ నడుస్తోంది. జగన్మోహన్ రెడ్డితో విభేదించి తెలంగాణ రాజకీయాలలో అడుగుపెట్టి సొంత పార్టీ స్థాపించిన షర్మిల.. కాంగ్రెసులో చేరడం వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో కూడా తీవ్రంగా తన ముద్ర చూపిస్తారనే ప్రచారం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి మీదకు కాంగ్రెస్ పార్టీ ఆమెను బ్రహ్మాస్త్రం లాగా ఎక్కు పెట్టడం తథ్యం. షర్మిల ఏపీ రాజకీయాలలో కాంగ్రెస్ తరపున నిలబడితే చాలు తమ పార్టీ బలోపేతం అవుతుందని వారికి నమ్మకం. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ జగన్ మీద అసంతృప్తితో ఉన్నవాళ్లు, అలాగని తెలుగుదేశం జనసేన పార్టీలలో చేరడానికి అవకాశం లేని వాళ్ళు అనేకమంది తిరిగి కాంగ్రెస్ గూటికి వస్తారనే చర్చ నడుస్తోంది. షర్మిల కనీసం పొత్తులు పెట్టుకున్నా ఏపీ రాజకీయాల వైపు వెళ్లకుండా ఉంటారేమో గానీ.. పార్టీని విలీనం చేసిన తర్వాత హై కమాండ్ అభీష్టాన్ని మన్నించి ఆమె ఏపీ రాజకీయాల్లో అడుగు పెట్టక తప్పదని విశ్లేషణలు నడుస్తున్నాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles