నారా లోకేష్ తన యువగళం పాదయాత్రలో ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తూ, వాస్తవమైన అభివృద్ధి తీసుకురావడానికి తెలుగుదేశం పార్టీ ఏం చేయగలదో వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో తిరుపతిలో జరిగిన కార్యక్రమంలో నారా లోకేష్ చేసిన ప్రకటన అత్యంత ఆసక్తికరంగా ఉంది. నిజానికి రాష్ట్ర ప్రజలు ప్రాంతాలతో సంబంధం లేకుండా ఆశించేది ఇలాంటి హామీనే! పాలకులుగా అధికార పీఠం మీదికి ఎవరు వచ్చినా సరే.. వారు రాష్ట్రానికి ఇలాంటి మేలు చేయాలని ప్రజలు అందరూ కోరుకుంటారు. అలాంటి చక్కటి హామీ తన పాదయాత్ర సందర్భంగా చేసినందుకు యువనేత నారా లోకేష్ శభాష్ అనాల్సిందే. అదే సమయంలో రాష్ట్ర సమతుల్య అభివృద్ధి అనేదానిని సర్వ నాశనం చేస్తూ, సంక్షేమం ముసుగులో సామాజిక జీవన ముఖచిత్రాన్ని పక్కదారి పట్టిస్తూ దుర్మార్గపు పాలన సాగిస్తున్న జగన్మోహన్ రెడ్డి ఈ తరహాలో సర్వజన ప్రయోజనకరమైన హామీని ఇవ్వగలరా అనే సందేహం ప్రజల్లో వ్యక్తం అవుతోంది.
ఇంతకు నారా లోకేష్ ఏం చెప్పారంటే.. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే, రాష్ట్రంలో ప్రతి జిల్లా కేంద్రాన్ని కూడా హైదరాబాదుకు దీటుగా అభివృద్ధి చేస్తాం అని ప్రకటించారు. హైదరాబాదు నగరం బ్రహ్మాండంగా అభివృద్ధి చెంది ఉన్న సంగతి తెలిసిందే. ఇవాళ్టికి కూడా దానితో సరిపోలగలిగేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ నగరము అభివృద్ధి చెందలేదు. హైదరాబాదు తలదన్నేలా, ప్రపంచమే తలెత్తి మన వైపు చూసేలా అమరావతి నగర నిర్మాణం జరగాలని చంద్రబాబు నాయుడు సంకల్పిస్తే.. ఆయన తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి కుట్రపూరితంగా ఆ ప్రయత్నానికి మోకాలడ్డారు. అమరావతిని ఒక విధ్వంస బాటలో పతనం వైపు తీసుకు వెళుతున్నారు.
ఇదిలా ఉండగా అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో, మూడు రాజధానులు అనే మాయ మాటలు చెబుతూ .. జగన్ సర్కారు కొత్త డ్రామాకు తెరలేపిన సంగతి తెలిసిందే. విశాఖ ఎగ్జిక్యూటివ్ కాపిటల్ అయినా, అమరావతి, కర్నూలు మిగిలిన రెండు రాజధానులు అయినా అది ప్రాంతాల సమాన అభివృద్ధి ఎలా అవుతుందో అర్థం కాని సంగతి. వైసీపీ నేతలు మాత్రం వికేంద్రీకరణను అర్థం చేసుకోవడం లేదు అంటూ.. దబాయింపు మాటలతో రోజులు నెట్టుకొస్తుంటారు. నిజానికి అభివృద్ధి అంటే ఒక ప్రాంతంలో ఒక నగరం కాదు.. రాష్ట్రంలో అన్ని ముఖ్య నగరాలు అభివృద్ధి చెందాలి. విశాఖ అమరావతి కర్నూలు మాత్రమే కాదు.. జిల్లా కేంద్రం స్థాయి పరిగణిస్తే గనుక ప్రతి ముఖ్య నగరము సమానంగా అభివృద్ధి చెందాలి. నారా లోకేష్ ఇచ్చిన హామీలు అలాంటి భరోసా రాష్ట్రానికి కనిపిస్తోంది. వైసీపీ నేతలు ఏ అభివృద్ధి విషయంలో ప్రజల నమ్మకం పొందడంలో విఫలమయ్యారో.. అదే విషయంలో నారా లోకేష్ భరోసా ఇస్తున్నారు. రాజధాని అని ప్రకటించినంత మాత్రాన, అక్కడ ఉన్న భవనాలను అడ్డగోలుగా వాడుకోవడం తప్ప.. కొత్తగా అభివృద్ధి చేయడానికి ఒక్క ఇటుక కూడా పెట్టని వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం నారా లోకేష్ హామీని గమనించాలి. రాష్ట్రంలో సమాన అభివృద్ధి అంటే ఇది అని తెలుసుకోవాలి. సంక్షేమం ముసుగులో మాయ చేసే జగన్మోహన్ రెడ్డి.. ఇలాంటి హామీ ప్రజలకు ఇవ్వగలరో లేదో చెక్ చేసుకోవాలి.
శెభాష్ లోకేష్.. ఈ హామీ జగన్ ఇవ్వగలడా?
Saturday, January 18, 2025