శివకుమార్ ఇన్ ఛార్జ్ అయితే రేవంత్ కు చెక్!

Sunday, December 22, 2024

కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంబరాలలో ఉన్న కాంగ్రెస్ పార్టీ `మా నెక్ట్ టార్గెట్ తెలంగాణ’ అని స్పష్టం చేస్తున్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలోనే ఈ విషయం చెప్పారు. కర్ణాటక జోష్ తో తెలంగాణాలో అధికారంలోకి రావాలని ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇప్పటి వరకు చెరోదారి అన్నట్లున్న కాంగ్రెస్ సీనియర్లు సహితం అధికారం వస్తుందేమో, అడ్డుకోవడం ఎందుకనుకొంటు కొంతమేరకు అణిగి ఉంటున్నారు. ఒక విధంగా గత నాలుగేళ్లలో ఏనాడూ కనిపించని ప్రశాంతత తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పుడు కనిపిస్తున్నది.

అయితే, ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఎదిరించడం అంతతేలిక కాదని కాంగ్రెస్ అగ్రనాయకత్వంకు తెలుసు. కేసీఆర్ కు ధీటైన నాయకుడు కాంగ్రెస్ లో లేరు. కర్ణాటకలో ఉన్నట్లు డీకే శివకుమార్ వంటి మాస్ నాయకుడు, డీకే శివకుమార్ వంటి పుష్కలంగా వనరులు గల నేత తెలంగాణాలో లేరు.

అందుకనే తెలంగాణకు శివకుమార్ ను ఎన్నికల ఇన్ ఛార్జ్ గా పంపే ఆలోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. శివకుమార్ సహితం కర్ణాటక ఎన్నికల ఫలితాలు రాగానే తెలంగాణ వైపు దృష్టి సారించారు. వైఎస్సార్ టిపి అధినేత వైఎస్ షర్మిల వచ్చి ఆయనతో వరుసగా భేటీలు జరపడం, ఆమెను కాంగ్రెస్ చేరమని ఆహ్వానించడం జరిగింది.

అదే విధంగా తెలంగాణాలో కాంగ్రెస్ లో చేరాలి అనుకొంటున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు వంటి వారు సహితం బెంగళూరు వెళ్లి శివకుమార్ ను కలిసి కాంగ్రెస్ పార్టీలో తమ డిమాండ్లపై హామీలు పొందే ప్రయత్నం చేస్తున్నారు. మరోవంక, తెలంగాణలోని చాలామంది సీనియర్ కాంగ్రెస్ నాయకులకు శివకుమార్ తో మంచి సంబంధాలు ఉండడంతో వారు సహితం ఉత్సాహం చూపుతున్నారు. శివకుమార్ ను కలిసి వస్తున్నారు.

ఈ పరిణామాలు అన్ని చూస్తే, టిపిసిసి అధ్యక్షుడిగా ఇప్పటివరకు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల విషయమై పార్టీ అధిష్టానం వద్ద తిరుగులేని పలుకుబడి ఏర్పర్చుకున్న రేవంత్ రెడ్డి ప్రాబల్యంకు చెక్ పెట్టె విధంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకనే శివకుమార్ ను ఇన్ ఛార్జ్ గా నియమించడం తెలంగాణ పార్టీ సీనియర్లకు ఆనందం కలిగిస్తున్నది.

వైఎస్ షర్మిలను కాంగ్రెస్ పార్టీలో చేరమనో లేదా కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోమనో శివకుమార్ సాహిస్తున్న ప్రయత్నాలు సహితం రేవంత్ రెడ్డికి ఏమాత్రం మింగుడు పడటం లేదని చెబుతున్నారు. తాజాగా, `ఏపీ నుండి వచ్చి ఇక్కడేమి రాజకీయాలు చేస్తున్నావు’ అంటూ శాంతిలపై మండిపడ్డారు. ఆమె రాజకీయ ఎత్తుగడల పట్ల మొదటి నుండి అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

పైగా, షర్మిల కోసం కొన్ని సీట్లు వదిలే ప్రతిపాదన సహితం కాంగ్రెస్ పార్టీలో చాలామందికి మింగుడు పడటం లేదు. ముఖ్యంగా ఆమె పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన పాలేరు వంటి ముఖ్యమైన సీటును వదులుకోవడానికి సుముఖత చూపడం లేదు. క్షేత్రస్థాయిలో ఆమెకు చెప్పుకోదగిన బలం లేదని కొట్టిపారేస్తున్నారు.

అదేవిధంగా వచ్చే ఎన్నికలలో ఇప్పటివరకు అభ్యర్థుల ఎంపికలో రేవంత్ రెడ్డి కీలక పాత్ర వహించే అవకాశం ఉన్నట్లు ఇప్పటివరకు కాంగ్రెస్ వర్గాలలో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పలు నియోజకవర్గాలలో ఆయన పలువురికి హామీలు ఇచ్చి ఉన్నారు. ఇప్పుడు శివకుమార్ రంగంలోకి వస్తే అభ్యర్థుల ఎంపిక ఆయనకు వదిలివేసి అవకాశం ఉంటుంది.

పైగా, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు శివకుమార్ సన్నిహితుడు కావడంతో ఆయన మాటను కాదనే అవకాశాలు ఉండరు. ఇప్పటివరకు వారిద్దరూ రేవంత్ రెడ్డికి మద్దతు ఇస్తూ వస్తున్నా శివకుమార్ రంగంలోకి రావడం రేవంత్ కు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది.

టిపిసిసి అధ్యక్షునిగా రేవంత్ కు మొదటి నుండి శివ కుమార్ మద్దతు ఇస్తూనే ఉన్నారు. అయితే, తెలంగాణ వ్యవహారాలలో శివకుమార్ జోక్యం చేసుకోవడంతో రేవంత్ ప్రాబల్యంను కట్టడి చేసేందుకు దారితీసే అవకాశం ఉంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles