అనూహ్యంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సోమేశ్ కుమార్ స్థానంలో కొత్తవారిని ఎంపిక చేయాల్సి రావడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ శాంతకుమారిని ఎంపిక చేశారు. తెలంగాణకు చెందిన, కీలక పదవులలో ఆయన ప్రభుత్వంలో పనిచేస్తున్న సమర్థులైన అధికారులు ఉన్నప్పటికీ అంతగా ప్రాధాన్యతలేని పోస్ట్ లలో పనిచేస్తూ వచ్చిన ఆమెను ఎంపిక చేయడం ఎవ్వరికీ అంతుబట్టలేదు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవిని చేపట్టిన ఆమెకు మెగాస్టార్ చిరంజీవి అభినందనలు తెలపడం, పైగా ఆమెను ఎంపిక చేసిన సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలపడం చాలామందికి విస్మయం కలిగించింది. ఒక ప్రభుత్వ అధికారి నియామకంలో ఇటువంటి ప్రకటనలు రావడం చాలా అరుదు.
అదే సమయంలో ఈ మధ్యనే బిఆర్ఎస్ లో చేరి, రాష్ట్ర అధ్యక్ష పదవితో పాటు కీలక స్థానం పొందిన ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన కొందరు నాయకులు సహితం ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేకంగా ఆమెను కలిసి, అభినందనలు తెలిపి, ఆ ఫోటోలు కూడా దిగారు. ఆమెను ఎంపిక చేసినందుకు కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు.
చిరంజీవి నుండి, ఏపీ బిజెపి నాయకుల వరకు ఆమెకు అభినందనలు తెలపడానికి కారణం ఆమె `కాపు’ సామాజిక వర్గానికి చెందిన వారు కావడమే. పైగా, ఆమె స్వస్థలం ఏపీ. ఒక విధంగా కీలక ప్రభుత్వ పదవి చేపట్టిన ఉన్నతాధికారిని బహిరంగంగా తమ సామాజిక వర్గంకు చెందిన వ్యక్తిగా అభినందించడం గతంలో ఎన్నడూ జరగనే లేదు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవుల్లో ఉన్న అధికారిని ప్రజాప్రతినిధులు కలిస్తే కలవవచ్చు. కానీ పక్కరాష్ట్రంకు చెందిన రాజకీయ నాయకులు కలవడం, వారితో ఆమె ఫోటోలు దిగడం చూసి అధికార వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ఏపీలో టీడీపీతో చేతులు కలుపుతున్న జనసేనను విచ్ఛిన్నం చేయడం కోసం వైఎస్ జగన్ కు సహాయం చేయడం కోసమే కేసీఆర్ అక్కడి కాపు నాయకులను బిఆర్ఎస్ ద్వారా ప్రోత్సహిస్తున్నారని ఇప్పటికే కధనాలు వెలువడ్డాయి.
ఇప్పుడు ఏపీకి చెందిన ఓ కాపు అధికారిని తెలంగాణలో ప్రధాన కార్యదర్శిగా నియమించడం ద్వారా పరోక్షంగా ఏపీలోని కాపు సామాజికవర్గంను పవన్ కళ్యాణ్ కు దూరం చేయాలనే ఎత్తుగడ కనిపిస్తున్నదని పలువురు భావిస్తున్నారు. అందుకనే ఆమె అన్ని అధికార పరిధులను అతిక్రమించి ఏపీ బిఆర్ఎస్ నాయకులతో ఫోటోలు దిగారని విమర్శలు తలెత్తుతున్నాయి.