శవం మీద పేలాలు ఏరుకోవడం అంటే ఇదే..

Friday, December 19, 2025

శవాల మీద పేలాలు ఏరుకుని తినే బాపతు అని పెద్దవాళ్లు సామెతల్ని జోడించి మరీ కొందరిని దూషిస్తుంటారు. డబ్బు విషయంలో అనుచితమైన ఆర్జనకోసం అడ్డగోలుగా నీచంగా వ్యవహరించే వారి గురించి వాడే మాట అది. ప్రస్తుతం సత్తెనపల్లి ఎమ్మెల్యే, మంత్రి అంబటి రాంబాబు విషయంలో ఈ సామెత అచ్చంగా అతికినట్లు సరిపోతుందేమో అనిపిస్తోంది. ఎందుకంటే ఆయన అచ్చంగా అదే తీరుగా.. చచ్చినవాడికి పరిహారంగా అందిన సొమ్ములోంచి వాటా కాజేయాలని అనుకుంటుండడమే అందుకు కారణం. 

సత్తెనపల్లి నియోజకవర్గానికి చెందిన పర్లయ్య, గంగమ్మ దంపతుల కొడుకు తురక అనిల్ ప్రమాదవశాత్తూ మరణించగా అతడికి ప్రభుత్వం తరఫున అయిదు లక్షల రూపాయల పరిహారం మంజూరైంది. ఈ విషయమై మునిసిపల్ చైర్మన్ ఫోను చేసి.. తనకు రెండున్నర లక్షలు ఇచ్చేసి చెక్కు తీసుకు వెళ్లాల్సిందిగా చెప్పినట్టు వారు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో న్యాయం చేయాలని, తమ బిడ్డ చనిపోయినందున వచ్చిన పరిహారం చెక్కును తమకు ఇప్పించాలని మంత్రి అంబటి రాంబాబును సంప్రదిస్తే ఎదురైన చేదు అనుభవాన్ని కూడా వారు వివరించారు. రెండున్నర లక్షలుఇవ్వాల్సిందే.. అతను తీసుకోకపోయినా నేను తీసుకుంటాను.. అని అంబటి బెదిరించినట్లుగా వారు ఆరోపించారు. 

ఈ విషయంలో ఇప్పుడు రాష్ట్రమంతా భగ్గుమంటోంది. అంబటి రాంబాబు మంత్రి హోదాలో ఉంటూ మరీ ఇంత లేకిగా వ్యవహరిస్తారా? అని ప్రజలు నివ్వెరపోతున్నారు. ఆయన తీరును అసహ్యించుకుంటున్నారు. శవరాజకీయాలు చేయడం నాయకులకు అలవాటే అని.. అలాంటిది శవాన్ని వాడుకుని.. సంపాదించాలనుకోవడం ఇంకా నీచం అని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ విషయంలో మంత్రి అంబటికి ఆ పదవిలో ఉండే అర్హతే లేదని, ఆయన తన పదవికి రాజీనామా చేయాలని కోరుతూ జనసేన పార్టీ.. సత్తెనపల్లిలో పెద్ద ర్యాలీ నిర్వహించింది. తక్షణం తురక అనిల్ తల్లిదండ్రులకు ప్రభుత్వ పరిహారం చెక్కును అందజేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. జనసేన ఈ విషయాన్ని ప్రజాఉద్యమంగా మార్చడంతో.. అంబటి పరువు పోతోంది. 

ప్రస్తుత ప్రభుత్వ హయాంలో పేదప్రజలకు ఏ పెన్షన్లు వచ్చినా సరే.. దానిని ఇంటికి తీసుకెళ్లి లబ్ధిదారులకు అందించే వాలంటీర్లు అందులో వాటాలు తీసుకోవడం చాలా సహజమైన విషయంగా మారిపోయింది. గతంలో ప్రభుత్వం నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో డబ్బు డిపాజిట్ చేసేది. ఈ పద్ధతి మార్చి.. ఇళ్లకే తీసుకెళ్లి ఇచ్చే ఏర్పాటును వాలంటీర్ల ద్వారా చేశారు. ఆ వాలంటీర్లేమో ప్రతి పెన్షనులోను తమ హక్కులాగా కొంత వాటా తీసుకుంటున్నారు. మరి ఇలా.. చచ్చిపోయిన వాడికి ఇచ్చే పరిహారంలో సాక్షాత్తూ మంత్రి యాభైశాతం వాటా లక్షల్లో డిమాండ్ చేస్తూ ఉంటే.. వేలల్లో వచ్చే పెన్షన్లనుంచి వాలంటీర్లు తమ రేంజి వాటాలకు కక్కుర్తి పడడం సహజమే కదా అని జనం అనుకుంటున్నారు.

No tags for this post.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles