`వై నాట్ ఓపీఎస్’ పేరుతో సెప్టెంబర్ 1న `ఛలో విజయవాడ’

Thursday, December 26, 2024

ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రభుత్వ ఉద్యోగులతో ఘర్షణ వైఖరి విడనాడి, వారిని దారిలోకి తెచ్చుకునేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి వచ్చే టట్లు కనిపించడం లేదు. వారి డిమాండ్ల ఆమోదంపై ఒక వంక ఆర్ధిక పరిష్టితులు అనువుగా లేవు. మరోవంక ఏదో విధంగా రాజీ ధోరణి అనుసరించడానికి ఉద్యోగులు సుముఖంగా లేదు
దానితో మరోసారి ఉద్యమబాట పట్టేందుకు ప్రభుత్వ ఉద్యోగులు సిద్దపడుతున్నారు.

ముఖ్యంగా ఎన్నికల సమయంలో అధికారంలోకి వస్తే సిపిఎస్ రద్దు చేస్తామని ఇచ్చిన హామీ ప్రభుత్వంకు కంటకప్రాయంగా మారుతుంది. ఆ హామీ ఇప్పటికీ నెరవేరలేదు. ప్రభుత్వం దీని స్ధానంలో తిరిగి ఓపీఎస్ (ఓల్డ్ పెన్షన్ స్కీమ్)కు బదులుగా జీపీఎస్ (గ్యారంటీ పెన్షన్ స్కీమ్)ను తీసుకొచ్చింది.  గ్యారంటీ పెన్షన్ స్కీం పేరుతో తెచ్చిన పథకం వల్ల ఉద్యోగులకు రిటైర్మెంట్ తర్వాత కనీస పెన్షన్ అందే అవకాశం ఉంది. దీంతో ప్రభుత్వం సీపీఎస్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించి జీపీఎస్ ను ఒప్పుకోవాలని ఉద్యోగులను కోరింది.

అయితే వారు మాత్రం తమకు జీపీఎస్ వద్దని, సీపీఎస్ వద్దని, కేవలం ఓపీఎస్ మాత్రమే ఇవ్వాలని పట్టుబడుతున్నారు. అంతేకాకుండా, జీపీఎస్ అమలు కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకునేందుకు మరోసారి `ఛలో విజయవాడ’ పేరుతో భారీ నిరసన చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు సీపీఎస్ ఉద్యోగ సంఘాలు ఏకతాటిపైకి వచ్చి `వై నాట్ ఓపీఎస్’ పేరుతో `ఛలో విజయవాడ’కు పిలుపునిచ్చాయి. సెప్టెంబర్ 1న ఈ కార్యక్రమం నిర్వహించబోతున్నట్లు సీపీఎస్ సంఘాలు వెల్లడించాయి.

మరోవంక, ఈసారి సీపీఎస్ ఉద్యోగులు నిర్వహించే ఛలో విజయవాడ నిరసనకు ఏపీ ఎన్జీవోలు కూడా మద్దతు ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు. ఆదివారం జరిగిన సీపీఎస్ ఉద్యోగుల `ఛలో విజయవాడ’ ప్రకటనకు పశ్చిమ కృష్ణా జిల్లా ఎన్జీవోల అధ్యక్షుడు విద్యాసాగర్ మద్దతు ప్రకటించారు.  దీంతో ఈసారి `ఛలో విజయవాడ ‘ కార్యక్రమం పేరుతో ప్రభుత్వ ఉద్యోగులు వైఎస్ జగన్ ప్రభుత్వంపై పోరు జరిపేందుకు సమాయత్తం అవుతున్నారు. 

పలు ఉపాధ్యాయ సంఘాలతో పాటు ఎన్జీవోలు కూడా మద్దతు ప్రకటించే అవకాశం ఉండటంతో ఎన్నికలకు ముందు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి ఓపీఎస్ ను సాధించుకునేందుకు సీపీఎస్ ఉద్యోగులు ప్రయత్నిస్తున్నారు.  గతంలో `ఛలో విజయవాడ’ పేరుతో ఉద్యోగులు నిర్వహించిన కార్యక్రమం ఓసారి విజయవంతమైంది. దాని తర్వాతే పలు ఉద్యోగ సంఘాలు, ఉద్యోగ నేతలు టార్గెట్ అయ్యారు. వీరిలో టీచర్ల సంఘాల నేతలతో పాటు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత కేఆర్ సూర్యనారాయణ కూడా ఉన్నారు. 

అలాగే అప్పట్లో పెట్టిన కేసుల్ని సైతం ప్రభుత్వం ఇప్పటి వరకు వెనక్కి తీసుకోలేదు. ఈ నేపథ్యంలో ఉద్యోగులు `ఛలో విజయవాడ’కు పిలుపునివ్వడంతో ఎన్నికల ముందు వీరి నిరసనలు ప్రభుత్వం మీద ఏ విధంగా ప్రభావం చూపబోతున్నాన్నది ఆసక్తి రేపుతోంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles