వైసీపీ నేతలు దూషణలకు చెక్కుచెదరని రజనీకాంత్

Friday, November 22, 2024

దిగవంత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు శతజయంతి ఉత్సవాలకు విజయవాడ వచ్చిన సూపర్ స్టార్ రజనీకాంత్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును `విజనరీ’ అంటూ పొగడ్తలతో ముంచెత్తడం పట్ల అధికార వైసిపి మంత్రులు, నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. పైగా, రజనీకాంత్ పై అనుచితంగా, వ్యక్తిగత విమర్శలకు, దుర్భాషలకు కూడా దిగుతున్నారు. సోషల్ మీడియాలో ఆయనను కించపరిచే విధంగా పోస్టులు పెడుతున్నారు.

వైసిపి నేతల అనుచిత ప్రవర్తన పట్ల హుందాగా వ్యవహరిస్తున్న రజనీకాంత్ మౌనంగా ఉంటున్నప్పటికీ, ఆయన అభిమానులు మాత్రం రగిలిపోతున్నారు. చివరకు ప్రముఖ సినీ నటి అయినా రోజా వంటివారు సహితం అనుచితంగా మాట్లాడుతూ ఉండడం పట్ల ఆగ్రవేశాలు వ్యక్తం చేస్తున్నారు.  

మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దు జిల్లాలైన తిరువళ్లూరు, వేలూరు, కాంచీపురం తదితర జిల్లాలకు చెందిన అభిమానులు వైసీపీ తీరు పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ‘చంద్రబాబును రజనీ పొడిగితే వీళ్లకెందుకంత బాధ’ అంటూ తీవ్రంగా స్పందిస్తున్నారు. సోషల్ మీడియాలో గట్టిగానే వారు కౌంటర్ ఇస్తున్నారు. అలాగే రజనీకాంత్ కు క్షమాపణ చెప్పాలనే డిమాండ్లు కూడా చేస్తున్నారు.

‘‘ఏమాత్రం లోకజ్ఞానంలేని వైసీపీ నేతలు తెలిసీ తెలియక మా తలైవర్‌ గురించి మాట్లాడడాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ తమిళ సినిమాల్లో నటించి, రజనీ వ్యక్తిత్వం గురించి తెలిసిన రోజా కూడా ఆయన పట్ల అనుచితంగా మాట్లాడడమేంటి? వచ్చే ఎన్నికల్లో ఆమెకు వ్యతిరేకంగా ప్రచారం చేసి తీరుతాం’’ అని తిరువళ్లూరు జిల్లాకు చెందిన రజనీ వీరాభిమానులు తెలిపారు. రోజా నియోజకవర్గం నగరిలో తమిళుల ఓట్లే అధికమన్న విషయం ఆమె మరిచిపోయినట్లుందని వారు నర్మగర్భంగా హెచ్చరిస్తున్నారు.

ఈ క్రమంలోనే చంద్రబాబు కూడా రజనీకాంత్ కు మంగళవారం ఫోన్ చేసి తాజా పరిస్ధితులపై మాట్లాడినట్లు తెలుస్తోంది. రజనీకాంత్‌పై వైసీపీ నేతల తీవ్ర విమర్శల పట్ల చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతల విమర్శలను పట్టించుకోవద్దని రజనీకాంత్‌ను చంద్రబాబు కోరారు. ‘‘ఎవరెన్ని విమర్శలు చేసినా స్పందించబోను. ఉన్న విషయాలే చెప్పాను.. నా అభిప్రాయం మారదు. సంయమనం పాటించాలని అభిమాన సంఘాలకు చెప్పాను’’ అని రజనీకాంత్, చంద్రబాబుతో ఘంటాపధంగా చెప్పినట్టు తెలుస్తున్నది.

కాగా, జగన్ ప్రభుత్వం పై రజనీకాంత్ చిన్న విమర్శ చేయకపోయినా ఆయనపై వైసీపీ నేతలు నీచపు వ్యాఖ్యలు చేస్తున్నారని చంద్రబాబు నాయుడు అంతకు ముందు మండిపడ్డారు. వైసీపీ నేతలు రజనీకాంత్‌పై విమర్శలు చేసినందున ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ ఒక ట్వీట్ చేశారు.

‘అన్నగారి శత జయంతి కార్యక్రమంలో పాల్గొని ఆయనతో తన అనుబంధాన్ని…అనుభవాలను పంచుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్ పై వైసీపీ మూకల అసభ్యకర విమర్శల దాడి అభ్యంతరకరం, దారుణం. సమాజంలో ఎంతో గౌరవం ఉండే రజనీ కాంత్ లాంటి లెజెండరీ పర్సనాలిటీపై కూడా వైసీపీ నేతలు చేస్తున్న నీచ వ్యాఖ్యలు అందరికీ బాధ కలిగిస్తున్నాయి’ అంటూ టిడిపి అధినేత ఆవేదన వ్యక్తం చేశారు.

వైసీపీ ప్రభుత్వ పోకడలపై ఆయన చిన్న విమర్శ చేయలేదు. ఎవరినీ చిన్న మాట అనలేదు. పలు అంశాలపై కేవలం తన అభిప్రాయాలు పంచుకున్నారని గుర్తు చేశారు.  అయినా తీవ్ర అహంకారంతో ఆయనపై చేస్తున్న ఆర్థం లేని విమర్శలను తెలుగు ప్రజలు ఎవరూ సహించరని హెచ్చరించారు.

శిఖరం లాంటి వ్యక్తిత్వం కలిగిన రజనీ క్యారెక్టర్ పై మీ పార్టీ నేతల విమర్శలు ఆకాశంపై ఉమ్మి వేయడమే అవుతుందని స్పష్టం చేశారు. నోటిదూల నేతలను జగన్ అదుపులో పెట్టుకోవాలి. జరిగిన దానికి క్షమాపణ చెప్పి తమ తప్పు సరిదిద్దుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

వైసీపీ ఇంత పనిగట్టుకుని ముప్పేట దాడికి దిగడానికి రజనీకాంత్ జగన్‌ను పల్లెత్తు మాట కూడా అనలేదు. వైసీపీ పాలన గురించి ఒక్క మాట రజనీ నోటి నుంచి వచ్చిందీ లేదు. చంద్రబాబు పాలనలో జరిగిన హైదరాబాద్ అభివృద్ధి గురించి ప్రస్తావించడమే రజనీ చేసిన పాపమైపోయింది.

రజనీకాంత్‌పై అకారణంగా వైసీపీ దూషణలకు దిగుతోందని ఏపీ ప్రజలకు ఈపాటికే అర్థమైపోయింది. పైగా.. ఆ వేదికపై రజనీ మాట్లాడిన సందర్భంలో అక్కడున్న నందమూరి అభిమానులను ఉద్దేశించి ఒక వ్యాఖ్య చేశారు. ‘మిమ్మల్ని చూస్తుంటే రాజకీయం మాట్లాడనిపిస్తోంది.. కానీ నా అనుభవం వద్దంటోంది’ అని రజనీ రాజకీయాల గురించి మాట్లాడనని స్పష్టం చేయడం గమనార్హం.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles