లోక్ సత్తా పేరుతో అవినీతి వ్యతిరేక పోరాట యోధుడిగా, ఎన్నికల సంస్కరణల కోసం ఉద్యమకారుడిగా పేరు గడించిన మాజీ ఐఏఎస్ అధికారి డా. ఎన్ జయప్రకాశ్ నారాయణ ఇప్పుడు ఏదో ఒక చట్ట సభలో ఉండనిదే తనను జనం గుర్తుంచుకోరనే పరిస్థితిలో చిక్కుకున్నట్లు తెలుస్తున్నది. అందుకనే 2024 ఎన్నికలలో లోక్ సభ లో ప్రవేశించేందుకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మద్దతుకోసం ప్రయత్నం చేస్తున్నట్లు పలువురు భావిస్తున్నారు.
అనుకున్నట్లు జరిగితే విజయవాడ లేదా గుంటూరుల నుండి వైసీపీ మద్దతు ఇచ్చే లోక్ సత్తా అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారనే ప్రచారం జరుగుతుంది. పట్టుబడితే వైసిపిలో చేరేందుకు కూడా సుముఖంగా ఉండే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. విజయవాడలో జరిగిన ఆప్కాబ్ వజ్రోత్సవ వేడుకల్లో క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్న జేపీ ఒక్కసారిగా జగన్‌తో కలిసి పాల్గొనడంతో రాజకీయంగా కలకలం రేగింది. జేపీ వేదికపైకి వచ్చే సమయంలో జగన్ లేచి నిలబడటం, జగనే షేక్ హ్యాండ్ ఇవ్వడం, పక్క పక్కనే కూర్చోవడం, నవ్వుకుంటూ గుసగుసలాడుకోవడం ఇవన్నీ జరిగాక ఇక అటు సోషల్ మీడియాలో, ఇటు మీడియాలో ఒక్కటే వార్తలు, ఫోటోలు వైరల్ ఆ మారాయి.
పైగా, కొన్నిరోజులుగా జగన్ ప్రభుత్వాన్ని జయప్రకాష్ ప్రశంసిస్తూ ఉండటం, అకస్మాత్తుగా ఇలా వేదికను పంచుకోవడం ఇవన్నీ రాజకీయంగా వైసీపీకి దగ్గర చేస్తున్నాయని స్పష్టం చేస్తున్నాయి. ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థ, వలంటీర్ వ్యవస్థ గురించి విమర్శలు చెలరేగుతున్న సమయంలో జెపి మద్దతు పలికారు. అన్ని రాజకీయ పక్షాలు తూర్పురబట్టిన ప్రతిపక్షాల ర్యాలీలను కట్టడి చేసే నం 1 జిఓకు మద్దతు పలికారు. అప్పుడప్పుడు వైఎస్ జగన్ పాలన పట్ల సానుకూల వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రజలను చైతన్యం కావించడం కోసం ఐఏఎస్ సర్వీసుకు రాజీనామా చేసిన ఆయన పట్ల తొలుత ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో జనంలో మంచి అభిప్రాయం ఉండెడిది.
అయితే ఎప్పుడైతే స్వచ్ఛంద ఉద్యమంగా ప్రారంభించిన లోక్ సత్తాను ఓ రాజకీయ పార్టీగా మార్చి, తానే ఎన్నికల రాజకీయాలలో ప్రవేశించారో అప్పటి నుండి తాను అప్పటి వరకు ప్రజలు చెప్పిన నీతులు భిన్నంగా వ్యవహరిస్తూ క్రమంగా జనం దృష్టిలో పలుచనపడటం ప్రారంభించారు. లోక్ సత్తా ప్రారంభంలో ఆయనకు బాసటగా నిలిచినా జస్టిస్ అంబటి లక్ష్మణ్ రావు, మాజీ ప్రధాని కార్యదర్శి వేణుగోపాల్ వంటి వారు క్రమంగా ఆయనకు దూరమయ్యారు.
రాజకీయంగా తన మనుగడకోసం వివిధ పార్టీలతో, నాయకులతో రాజీధోరణి అవలంభిస్తూ మీడియా హైప్ ద్వారానే రాజకీయాలు నడిపే ప్రయత్నం చేశారు. జనం మధ్యకు వెళ్లి పోరాడేందుకు పెద్దగా ఉత్సాహం చూపలేదు. 2009లో అటు కాంగ్రెస్, మరోవైపు టీడీపీ అక్కడ బలమైన కమ్మ సామాజిక వర్గం నుండి అభ్యర్థిని పెట్టకుండా జాగ్రత్తపడి కూకట్ పల్లి నుండి అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
కానీ తిరిగి 2014లో అక్కడి నుండి పోటీచేసే సాహసం చేయలేదు. ఇంతలో రాష్ట్ర విభజన జరగడం, నరేంద్ర మోదీ ప్రధానమంత్రి పదవికి బలమైన అభ్యర్థిగా జనం ముందుకు రావడంతో హైదరాబాద్ లో ఎన్నికల ప్రచారంకు వచ్చిన ఆయనకు స్వాగతం పలికారు.
బీజేపీతో పొత్తు పెట్టుకొని, ఒంగోలు, గుంటూరు, విజయవాడలలో ఏదో ఒక సీట్ నుండి లోక్ సభకు పోటీచేస్తే టీడీపీ మద్దతు ఇస్తే గెలుపొందుతామని అంచనా వేసుకున్నారు. కానీ బీజేపీ, టీడీపీ అందుకు ఆసక్తి చూపకపోవడంతో మల్కాజ్ గిరి నుండి లోక్ సత్తా అభ్యర్థిగా పోటీ చేసి, ఓటమి చెంది తిరిగి ఎన్నికల రాజకీయాల వైపు చూడనే లేదు. యూపీఏ హయాంలో సోనియా గాంధీ అధ్యక్షతన `రాజ్యాంగేతర అధికార కేంద్రం’గా ఏర్పడిన జాతీయ సలహా మండలి సభ్యుడిగా ఆమెతో కలిసి పనిచేశారు. అదే విధంగా 2014 తర్వాత నరేంద్ర మోదీ ఆహ్వానించి కేంద్రంలో ఏదో ఒక కీలకమైన హోదా ఇస్తారని ఎదురు చూస్తూ, మోదీ విధానాలు అన్నింటికి మద్దతు ఇస్తూ వస్తున్నారు.