గత సంవత్సర కాలంగా వైసిపిలో దాదాపుగా ఎటువంటి ప్రాధాన్యత లేకుండా, అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్న ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు వి విజయసాయిరెడ్డి తిరిగి పార్టీ వ్యవహారాలలో కీలకంగా వ్యవహరించడం ప్రారంభించారు. ముందుగా ఉత్తరాంధ్ర ఇన్ ఛార్జ్ బాధ్యతలను తొలగించడంతో తాడేపల్లి కేంద్రంగా పార్టీ కార్యక్రమాలను నడిపించే ప్రయత్నాలు చేశారు.
అయితే, ఏమి జరిగిందో గాని దాదాపు ఢిల్లీకే పరిమితమవుతూ వచ్చారు. చివరకు సోషల్ మీడియాలో నిత్యం టిడిపి అధినేతలపై విరుచుకు పడటాన్ని కూడా విరమించుకున్నారు. అదే సమయంలో రాష్త్ర ప్రభుత్వ సలహాదారుని హోదాలో సజ్జల రామకృష్ణారెడ్డి దాదాపు `డిఫెక్ట’ ముఖ్యమంత్రి మాదిరిగా అన్ని వ్యవహారాలను తానై నడిపిస్తూ వస్తున్నారు.
విజయసాయిరెడ్డి చూస్తుంటే సోషల్ మీడియా వ్యవహారాలను సహితం సజ్జల కుమారుడికి అప్పచెప్పారు. అయితే, పార్టీలో, ప్రభుత్వంలో తీవ్రమైన సమస్యలు ఏర్పడిన సమయంలో తాడేపల్లిలో బాధ్యతలు నిర్వహిస్తున్న ఇతరులు వాటిని సరిగ్గా నిర్వహించలేక పోతున్నారని, సమస్యలను మరింత జటిలం చేస్తున్నారనే అభిప్రాయం సీఎం వైఎస్ జగన్ లో ఏర్పడినట్లు తెలుస్తున్నది.
నెల్లూరు జిల్లాలో పార్టీ దాదాపు తుడిచిపెట్టుకు పోయే పరిస్థితులకు చేరుకోవడం, సీనియర్ నాయకులతోనే తిరుగుబాటు ధోరణులు వ్యక్తం అవుతూ ఉండటం, పలు చోట్ల అసంతృతులు బజారున పడటం వంటి విషయాలలో వాటిని చాకచక్యంగా పరిష్కరించే వారు కనబడటం లేదు. మరో ఏడాది లోగా ఎన్నికలు వస్తున్నందున విజయసాయిరెడ్డి సేవలు అవసరమనే భావనతో ఆయనకు క్రమంగా పార్టీలో కీలక బాధ్యతలు అప్పచెప్పుతున్నట్లు కనిపిస్తున్నది.
తాజాగా పార్టీ అనుబంధ విభాగాలతో నిర్వహించిన సమీక్షతో వైసీపీలో ట్రబుల్ షూటర్‌గా గుర్తింపు పొందిన సాయిరెడ్డికి పూర్వ వైభవం వచ్చేసిందని ఆయన మద్దతుదారులు భావిస్తున్నారు. అనుబంధ విభాగాలలో ఖాళీగా ఉన్న పధవులను త్వరితగతిన భర్తీ చేయడంతో పాటు రాష్త్ర ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలలోకి తీసుకు వెళ్లేందుకు అవి క్రియాశీలకంగా పనిచేసేందుకు కార్యాచరణ కూడా రూపొందించారని చెబుతున్నారు.
గత ఏడాది ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎదురైన ఎదురు దెబ్బలతో విజయసాయిరెడ్డి అవసరాన్ని సీఎం జగన్ గుర్తించినట్లుతెలుస్తున్నది. సాయిరెడ్డి స్థానంలో ఇతరులకు బాధ్యతలు అప్పగించినా పెద్దగా ప్రయోజనం లేకపోవడంతో దగ్గరకు పిలిచి తిరిగి పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించినట్లు చేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, 2019 ఎన్నికల సన్నాహాలలో జగన్ కు కుడిభుజంగా వ్యవహరించడం గమనార్హం.
ముఖ్యంగా వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సిబిఐ దూకుడు వ్యవహారం సీఎం జగన్ ను కలవరానికి గురిచేసింది. జగన్ ఎదుర్కొంటున్న అన్ని సీబీఐ, ఈడీ కేసులలో రెండో నిందితుడిగా ఉన్న విజయసాయిరెడ్డి సామర్ధ్యాలు బాగా తెలిసిన వ్యక్తి కావడంతో ఎన్నికల సంవత్సరంలో తిరిగి పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించే విధంగా చూస్తున్నట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.