వైసీపీలో జగన్ పై నేతల తిరుగుబాటు ప్రారంభమైందా!

Sunday, December 22, 2024

ఎమ్మెల్యేలపై సర్వేల పేరుతో తనకు ప్రతికూల నివేదికలు వచ్చిన వారికి వచ్చే ఎన్నికలలో సీట్లు ఇచ్చేది లేదని మంత్రులతో సహా చాలామందిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హెచ్చరిస్తున్నారు. మొదట్లో ప్రస్తుతం ఉన్న 151 మంది ఎమ్మెల్యేలు మూడొంతుల మందికి పైగా (50కు మించి) ఎమ్యెల్యేలకు గెలిచే అవకాశాలు లేవని, వారికి సీట్లు ఇవ్వడం కుదరకపోవచ్చని సంకేతం ఇచ్చారు. 

అయితే ఆ సంఖ్య తాజాగా 35కు పడిపోయింది. ఇక ఎన్నికలు వచ్చేసరికి ఎంతమందికి కాదనగలరా చూడవలసిందే. తాను సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో అమలు పరుస్తున్నా, ఎమ్యెల్యేలు సరిగ్గా పనిచేయడం లేదని, అందుకే పార్టీ గ్రాఫ్ పడిపోయాడని జగన్ తరచూ చెబుతున్నారు. అయితే ప్రభుత్వం పనితీరే అధ్వాన్నంగా ఉండడంతో తమ గ్రాఫ్ పడిపోతుందని ఎమ్యెల్యేలు వాపోతున్నారు. 

మరోవంక, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు సభలకు భారీ సంఖ్యలో జనం వస్తుండడంతో ఇక వైఎస్ జగన్ పట్ల జనంలో నమ్మకం పోయిందని అధికార పార్టీ నేతలు నిర్ధారణకు వస్తూ ఒకొక్కరు తమ దారి చూసుకొనే ప్రయత్నాలలో ఉన్నట్లు కనిపిస్తున్నది. ఇప్పటివరకు నరసాపూర్ ఎంపీ రఘురామకృష్ణంరాజు మాత్రమే వైఎస్ జగన్ ప్రభుత్వంపై నిత్యం విమర్శలు చేస్తున్నారు. 

కానీ, తాజాగా పలువురు ఎమ్యెల్యేలు నిరసనగలం విప్పుతున్నారు. 32 ఏళ్ల పిన్న వయసులోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రిగా పనిచేసిన కడప జిల్లాకు చెందిన డీఎల్ రవీంద్రారెడ్డి తన స్నేహితుడి కుమారుడు జగన్ ఇంత అవినీతి పరుడు అవుతాడని అనుకోలేదని అంటూ బహిరంగంగా పశ్చాతాపం ప్రకటించడం చూసాము.

నెల్లూరు జిల్లాలో వైఎస్ రాజశేఖరరెడ్డికి గట్టి మద్దతుదారుడిగా ఉంటూ వచ్చిన ఎమ్యెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తమ నియోజకవర్గంలో మూడు వేల పైచిలుకు పెన్షన్ల తొలగించడం పట్ల నిరసన వ్యక్తం చేశారు. నిత్యం ప్రజల్లో ఉండే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పింఛన్లు తొలగించిన తర్వాత గడపగడపకు కార్యక్రమంలో భాగంగా ప్రజల మధ్యకు ఎలా వెళ్ళమంటారని నేరుగా ముఖ్యమంత్రి జగన్ నే నిలదీశారు. 

ఇక, రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో ఉన్న ఆనం రామనారాయణ రెడ్డి  ‘మనం’ ఏమి చేశామని ఓట్లు అడగమంటారని జగన్ ను ప్రశ్నిస్తున్నారు. రోడ్డులపై గుంతలు కూడా పూడ్చలేక పోతున్నామని వాపోయారు.

ప్రతినెలా పేదలకు చేస్తున్న `నగదు బదిలీ’తో ఓట్ల వర్షం కురుస్తుందని భావిస్తున్న జగన్ ఆశలపై చల్లటి నీరు చల్లారు.  రూ.200 ఉన్న పెన్షన్ రూ.2000 చేసిన చంద్రబాబునే ప్రజలు ఓడించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ  అటువంటిది రూ.2000 నుంచి రూ.3000 చేస్తామని చెప్పి.. ఇప్పుడు 250 నుంచి 500 రూపాయలు పెంచి పెన్షన్ ఇస్తామంటే ప్రజలు ఓట్లు వేస్తారా? అని జగన్ ప్రభుత్వంపై దుమ్మెత్తారు. 

మూడున్నరేళ్ళపాటు ఎన్ని అవమానాలు ఎదురైనా మరో గత్యంతరం లేక ఒదిగి  ఉన్న పలువురు సీనియర్ నేతలు ఇప్పుడు ఒకరొక్కరు తిరుగుబాటు బావుటా ఎగురవేయడం ప్రారంభిస్తున్నారు. జనం మధ్యకు వెళ్ళితే వారు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్నామని  బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి  జగన్ వాస్తవాలను పరిగణలోకి తీసుకోకుండా, తన అంతఃపురంలో వేస్తున్న లెక్కలతో ఊహా లోకంలో విహరిస్తున్నారని అంటూ నిలదీస్తున్నారు.

 వైసిపిలో  సొంత ఎమ్మెల్యేల తిరుగుబాటు ఇప్పుడే మొదలైందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు ఈ సందర్భంగా జగన్ ను హెచ్చరించారు. వీరి తిరుగుబాటును అహంకారానికి, ఆత్మాభిమానానికి మధ్య జరుగుతున్న సమరంగా ఆయన అభివర్ణించారు.ఇన్నిరోజులుగా ఓపిక పట్టినవారు, అవమానాలను సహించినవారంతా ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారని తెలిపారు. 

అయితే, పార్టీ ఎమ్మెల్యేల నుంచి తిరుగుబాటు ఎందుకు మొదలయ్యిందో అన్న దానిపై ముఖ్యమంత్రి జగన్ ఆత్మవలోకనం చేసుకొనే ప్రయత్నం చేస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. తనను ప్రశ్నించిన వారికి వచ్చే ఎన్నికలలో సీట్ లేదన్నట్లు వ్యవహరిస్తున్నారు. అయితే సీట్ ఇచ్చినా జగన్ పాలనలో గెలవడం కష్టమనే భయంతోనే ఒకొక్కరుగా తిరుగుబాటు అస్త్రం ప్రయోగిస్తున్నారని గ్రహించడం మంచిది. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles