వైసీపీని ఉత్తరాంధ్ర నాయకులే ముంచేస్తారు!

Monday, December 23, 2024

రాష్ట్రంలో మూడు రాజధానులు, ప్రత్యేకించి విశాఖలో రాజధాని అనేది ఇప్పట్లో సాధ్యమయ్యే వ్యవహారం కానే కాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు చాలా బాగా తెలుసు. అయితే.. మూడుప్రాంతాల సమాన అభివృద్ధికి తాము సంకల్పిస్తే విపక్షాలు ద్రోహం చేస్తున్నాయంటూ వారు పదేపదే గోల చేస్తుంటారు. విపక్షాలను నిందించడానికి మాత్రం.. ఈ మూడురాజధానుల అభివృద్ధి బూటకాన్ని వాడుకుంటే బాగుంటుంది. కానీ, వైసీపీ ఉత్తరాంధ్ర నాయకులు చేస్తున్న ఓవరాక్షన్ వల్ల ఆ పార్టీకి చేటు జరుగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అవసరం ఉన్నా లేకపోయినా.. ‘రాజధానితోనే ఉత్తరాంధ్ర అభివృద్ధి’ అంటూ ఆ ప్రాంత నాయకులు పదేపదే చెప్పే మాటల వల్ల వారికి ఇతర ప్రాంతాల్లో చేటు తప్పదని వ్యాఖ్యానిస్తున్నారు. 

చంద్రబాబునాయుడు.. ఉత్తరాంధ్రలో తన ఇటీవలి ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ సభలో మాట్లాడుతూ.. మూడు రాజధానులు అంటూ జగన్ సర్కారు చెబుతున్న మాటలను మూడుముక్కలాటగా అభివర్ణించారు. విశాఖలో తాను సంకల్పించిన అనేకానేక అభివృద్ధి ప్రాజెక్టులను, ఐటీ హబ్ గా మార్చే ప్రయత్నాలను జగన్ సర్కారు ఏర్పడిన తర్వాత.. ఏ రకంగా ధ్వంసం చేసిందో, విశాఖ ప్రగతికి విఘాతం కలిగించిందో ఆయన కళ్లకు కట్టినట్టు వివరించారు. అమరావతి రాజధాని అనేది ఒక ప్రాంత అభివృద్ధికి సంబంధించిన ప్రయత్నం కాదని, రాష్ట్ర గౌరవానికి సంబంధించినదని.. అభివృద్ధి అనేది రాజధానితో నిమిత్తం లేకుండా అన్ని ప్రాంతాల్లోనూ సమానంగా జరుగుతూనే ఉంటుందని వివరించారు. ఉత్తరాంధ్ర వికాసానికి ప్రత్యేకంగా తెలుగుదేశం ఎంత కష్టపడి పనిచేసిందో కూడా తెలియజెప్పారు. 

చంద్రబాబునాయుడు మాటలు వైసీపీ నాయకుల్లో కంగారు పుట్టించినట్టున్నాయి. ఒకవైపు ఆయన అమరావతి రాజధానికి జై కొడుతూ, మూడు రాజధానుల్ని మూడు ముక్కలాట అంటున్నా సరే.. ఉత్తరాంధ్రలో ఆయన సభలకు జనం వెల్లువగా వస్తుండడం చూసి వైసీపీ నేతలకు కంగారు పుట్టినట్టుంది. అందుకే వారు మళ్లీ ‘విశాఖ రాజధాని’ పాట  పాడుతున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా వైసీపీ సమావేశంలో బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ఒక్కరోజు కూడా ఆలస్యం చేయకుండా..విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించాలని ముఖ్యమంత్రిని కోరుతున్నట్టు వెల్లడించారు. ఆ మాటకొస్తే కేవలం బొత్స మాత్రమే కాదు.. ఆ ప్రాంత నేతలు ధర్మాన లాంటివాళ్లు కూడా ఇలాంటి డిమాండ్లే వినిపించి, ప్రస్తుతం సైలెంట్ అయ్యారు. విశాఖను రాజధాని చేయాలనే కోరిక బొత్స కంటె జగన్ కే ఎక్కువగా ఉన్నదనే సంగతి అందరికీ తెలుసు. కోర్టు తీర్పులు, న్యాయపరమైన చిక్కుల నేపథ్యంలోనే అడుగు ముందుకు వేయలేకుండా ఆయన నిరీక్షిస్తున్నారు. 

అయితే.. విశాఖను రాజధాని చేస్తే ఈ ప్రాంతానికి ఉపాధి, ఉద్యోగావకాశాలు వస్తాయి అంటూ బొత్స లాంటి నేతలు బూటకపు మాటలు చెబుతుండడం మిగిలిన ప్రాంతాల ప్రజలను ఆలోచనలో పడేస్తోంది. పరిపాలన రాజధానిగా ఉంటే తప్ప ఇవేవీ జరగవా? అనే అభిప్రాయం వారికి కలుగుతోంది. న్యాయ, శాసన రాజధాని అనేవి కేవలం కంటితుడుపు మాటలే అనే అభిప్రాయమూ కలుగుతోంది. ఆ కోణంలోంచి చూసినప్పుడు.. రాజధానితోనే విశాఖ అభివృద్ధి అనే నయవంచన మాటలు.. ఇతర ప్రాంతాల ప్రజల్లో పార్టీని బాగా డేమేజీ చేస్తున్నాయి. విశాఖ రాజధానిని జగన్ సాధించగలరో లేదో గానీ.. ఈలోగా.. వైసీపీ నాయకుల అత్యుత్సాహం వలన.. ఇతర ప్రాంతాల్లో పార్టీకి చేటు మాత్రం గ్యారంటీ అని పలువురు విశ్లేషిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles