వైసిపి ఎమ్యెల్యేలకు పరాభవం … సొంత పార్టీవారే నిరసనలు!

Wednesday, January 22, 2025

గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో  పాల్గొనేందుకు గ్రామాలకు వెడుతున్న వైసిపి ఎమ్యెల్యేలకు పరాభవం ఎదురవుతుంది. చెప్పిన పనులు చేయలదే అంటూ సొంతపార్టీ వారే నిలదీస్తున్నారు.

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలంలోని మత్స్యకార గ్రామం పూడిమడకలో యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబురాజును సొంత పార్టీకే చెందిన కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. గ్రామంలో మౌలిక వసతులు కల్పించాలని.. ఏపీఐఐసీ పైపులైన్‌ ప్యాకేజీ వచ్చేలా చేయాలని డిమాండ్‌ చేశారు. మత్స్యకార యువతకు ఉపాధి కల్పిస్తామని ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ నెరవేర్చాలని నిలదీశారు. గోబ్యాక్‌ అంటూ నినాదాలు చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి.

పెనుకొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి శంకరనారాయణకు శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం ఈదలబలాపురం పరిధిలోని రేణుక నగర్‌లో  ఘోర పరాభవం జరిగింది. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి వస్తున్న శంకర్ నారాయణను ఈదుల బలాపురం గ్రామస్తులు సొంతపార్టీకి చెందినవారే అడ్డుకున్నారు. శంకరనారాయణ ప్రయాణిస్తున్న వాహనంపై చెప్పులతో దాడి చేశారు. గ్రామస్తుల నిరసన నేపథ్యంలో వాహనాన్ని వెనక్కి తిప్పుకుని శంకరనారాయణ వెళ్లిపోయారు.

రేణుక నగర్‌లో ఐదు నెలలపాటు రేషన్ బియ్యం ఇవ్వకుండా చేశారని, రోడ్లు, డ్రైనేజీలు నిర్మించకుండా అభివృద్ధికి అడ్డంకిగా మారారని ఆరోపించారు. శంకరనారాయణ తమ గ్రామంలోకి రాకుండా ప్రజలు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు అడ్డుకున్నా గ్రామస్థులు పట్టు విడవలేదు. ఈ క్రమంలో శంకర్ నారాయణ వాహనంపై కొందరు చెప్పులు విసిరారు.

శంకరనారాయణను సొంత పార్టీకే చెందిన నాగభూషణ రెడ్డి ఆధ్వర్యంలోనే గ్రామస్థులు అడ్డుకోవడం గమనార్హం. ఈదలబలాపురం గ్రామంలో అభివృద్ధిని ఎమ్మెల్యే అడ్డుకుంటున్నారని నాగభూషణ్ రెడ్డి ఆరోపించారు. ఐదు నెలలుగా గ్రామంలో రేషన్ సరుకులు ఇవ్వలేదని చెప్పారు. గ్రామస్థులను అవమానిస్తున్నారని మండిపడ్డారు. వైఎస్‌ఆర్‌సిపి మీద అభిమానంతో ఆయన్ను వదిలిపెట్టామని, లేకుంటే శంకరనారాయణను బట్టలూడదీసి కొట్టేవాళ్లమని హెచ్చరించారు.

మరోవంక, సొంత పార్టీ కార్యకర్తలు అడ్డుకోవడంతో యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబురాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. అడ్డుకున్నవారిపైకి దూసుకెళ్లేందుకు ఎమ్మెల్యే ప్రయత్నించారు. ఈ క్రమంలో పీఏ నవీన్‌వర్మ కన్నబాబురాజు చేయి పట్టుకుని వెనక్కి లాగారు. వెంటనే ఎమ్మెల్యే పీఏ చెంపపై కొట్టారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితి సద్దుమణిగేలా చేశారు. ఆ నిరసనల మధ్యే కార్యక్రమం కొనసాగింది. తన దగ్గర పనిచేసే పీఏపై ఎమ్మెల్యే చేయి చేసుకోవడం చర్చనీయాంశమైంది.

అంతేకాదు కన్నబాబురాజు ఇటీవల కూడా ఓ విద్యార్థిపైకి దూసుకెళ్లారు. మునగపాక మండలం నాగులాపల్లి గ్రామంలో పర్యటించిన సమయంలో శంకర్ అనే వ్యక్తి ఇంటి దగ్గరకు వెళ్లారు. తాను ఐటీఐ పూర్తిచేశానని విద్యాదీవెన రాలేదని శంకర్ కుమారుడు ఎమ్మెల్యేకు చెప్పాడు. నువ్వు చదువుతున్న కాలేజీకి చెల్లించినట్లు ఎమ్మెల్యే చెప్పారు.

ఆ యువకుడు కూడా కాలేజీకి డబ్బులు మంజూరు చేసినప్పుడు తనకు చెప్పడం ఎందుకని ఎమ్మెల్యేను ప్రశ్నించారు. వెంటనే ఎమ్మెల్యే కన్నబాబు తీవ్రంగా స్పందించారు.. ఎదురు ప్రశ్నవేస్తావా.. వెళ్లిపో అంటూ విద్యార్థిపై మండిపడ్డారు. విద్యార్థి కూడా ఓట్ల కోసం మళ్లీ వస్తారుగా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో ఎమ్మెల్యే ఆగ్రహించి.. పళ్లు పీకేస్తా అంటూ విద్యార్థిపైకి దూసుకెళ్లారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles