ఆదాయంకు మించిన ఆస్తుల కేసులలో అవినీతి ఆరోపణలపై కేసు నమోదు చేసి, నేటి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని సిబిఐ జాయింట్ డైరెక్టర్ హోదాలో అరెస్ట్ చేయడం ద్వారా `అవినీతి వైతిరేక పోరాట యోధుడు’ అనే ఇమేజ్ ను తెలుగు ప్రజలలో సంపాదించిన లక్ష్మీనారాయణ నేడు రాజకీయ అవకాశాలకోసం అదే జగన్ మోహన్ రెడ్డితో చేతులు కలిపేందుకు తాపత్రయ పడుతున్నట్లు కనిపిస్తున్నది.
వచ్చే ఎన్నికలలో విశాఖపట్నం నుండి తిరిగి లోక్ సభ ఎన్నికలలో పోటీచేస్తానని ప్రకటిస్తున్న ఆయన ఏ పార్టీ దగ్గరకు తీసుకొంటే ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తానని, ఏపార్టీ ముందుకు రానిపక్షంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తానని స్పష్టం చేస్తున్నారు. అయితే, గ్రామీణ అభివృద్ధి, వ్యవసాయం రంగాలకు సంబంధించి తనకు కొన్ని ఆలోచనలు ఉన్నాయని, వాటికి ఇప్పుకొంటే… అంటూ జనంలో సీట్ కోసం చేరుతున్నానని కాకుండా అనుకోవడంకోసం ఓ షరతు చెబుతున్నారు అనుకోండి.
బిజెపి దగ్గరకు తీసుకొని, సీట్ ఇస్తుందనే ఆశతోనే ఐపీఎస్ కు రాజీనామా చేసి వచ్చారు. అయితే ఆ పార్టీ దగ్గరకు రానీయక పోవడంతో టిడిపి సీట్ కోసం ప్రయత్నం చేశారు. అటువైపు నుండి కూడా సానుకూల స్పందన లభించక పోవడంతో చివరి నిముషంలో జనసేనలో చేరి, ఆ పార్టీ అభ్యర్థిగా పోటీచేశారు. అయితే తాను ఓటమి చెందటమే కాకుండా ఎన్నికలలో జనసేన చెప్పుకోదగిన ప్రభావం చూపించలేకపోవడంతో ఎన్నికలు కాగానే ఆ పార్టీకి దూరంగా జరిగారు.
అప్పటి నుండి తిరిగి టిడిపి, బీజేపీలలో ప్రవేశం కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. పలువురు నాయకులతో మంతనాలు జరుపుతూనే ఉన్నారు. అమిత్ షా, చంద్రబాబు నాయుడు వంటి వారిని కూడా కలిశారు. కానీ ఎవ్వరినుండి సానుకూలత వ్యక్తం చేయకపోవడంతో ఇప్పుడు వైసిపి వైపు చూస్తున్నట్లు స్పష్టం అవుతున్నది. ఆ పార్టీ నుండి కూడా సానుకూల స్పందన లభించకపోతే చివరకు బిఆర్ఎస్ బ్యానర్ కైనా సిద్దమే అనే సంకేతం ఇస్తున్నారు.
వైసిపి, బిఆర్ఎస్ – రెండు పార్టీల నాయకులు తనను తమ తమ పార్టీలలో చేరమని అడుగుతున్నట్లు ఆయన బహిరంగంగా చెప్పడం గమనార్హం. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన నిరంకుశ చట్టం జిఓ నం 1కి మద్దతు తెలపడం ద్వారా ఓ మాజీ పోలీస్ అధికారిగా నిరంకుశ అధికారాలపట్ల గల ఆసక్తిని వ్యక్తం చేయడంతో పాటు సీఎం జగన్ ను ప్రసన్నం చేసుకొనే ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడి అవుతుంది.
వైఎస్సార్‌సీపీ నుంచి 2019లో కూడా రమ్మన్నారని అంటూ ఇప్పుడు ప్రకటించడం గమనార్హం. మొన్నటివరకు కేంద్రంలో మోదీ పాలనను పొగుడుతూ రావడమే కాకుండా ఆర్ఎస్ఎస్, అనుబంధ సంస్థలకు చెందిన పలు కార్యక్రమాలకు హాజరవుతూ వచ్చిన ఆయన మొదటిసారిగా కేంద్ర ప్రభుత్వం పట్ల అసహనాన్ని వ్యక్తం చేసే వాఖ్యలు చేస్తున్నారు.
2019 ఎన్నికల్లో విశాఖపట్నం నుండి పోటీచేసినప్పుడు జనసేన అభ్యర్థిగా వచ్చిన 2,88,754 ఓట్లను తనను చూసి వేసిన ఓట్లుగా లక్ష్మీనారాయణ ఇంకా భావిస్తున్నారు. ప్రస్తుతం స్వతంత్ర అభ్యర్హ్దిగా పోటీచేసిన అంతకన్నా ఎక్కువ ఓట్లు వస్తాయనే అపోహలతో ఉన్నట్లు కనిపిస్తుంది. గత ఎన్నికలలో పోటీచేయడం ద్వారా టిడిపి అభ్యర్థి ఓటమికి ప్రధానంగా సహకరించి, పరోక్షంగా వైసిపి అభ్యర్థి గెలుపుకు దోహదపడ్డారు.
ఇప్పుటు ఆయన మాటలను చూస్తుంటే 2019 ముందు నుండే ఆయన వైసీపీ నాయకత్వం ప్రణాళికలో భాగంగా నడుచుకొంటున్నట్లు భావించవలసి వస్తుంది. గతంలో వైఎస్ జగన్ పై సిబిబి కేసులు నమోదు చేసి, అరెస్ట్ చేయడం – అంతా ఢిల్లీలో సోనియా గాంధీ ఆదేశాలతో జరిగినట్లు అందరికి తెలుసు. అంధులో లక్ష్మీనారాయణ కేవలం పోస్ట్ మాన్ పాత్ర మాత్రమే వహించారు. చివరకు ఎఫ్ఐఆర్ లను సహితం ఢిల్లీలో తయారు చేసి పంపారు.
అందుకనే ఎప్పుడు వైసీపీ నేతలు జేడీ లక్ష్మీనారాయణను లక్ష్యంగా చేసుకొని ఎటువంటి విమర్శలు చేసిన దాఖలాలు లేవు. పైగా, ఆ పార్టీ నేతలతో మంచి సంబంధాలనే నెరుపుతున్నట్లు ఇప్పుడు స్పష్టం అవుతుంది.