వైజాగ్ స్టీల్ కై బీడ్ వెనుక కేసీఆర్ సొంత ప్రయోజనం!

Thursday, December 19, 2024

తెలంగాణ కు చెందిన అత్యంత ప్రతిష్టాత్మక నిజాం సుగర్స్ ను కొత్త రాష్ట్రం ఏర్పడగానే పునరుద్ధరిస్తామంటూ ఉద్యమ సమయంలో ఎన్నో వాగ్ధానాలు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చాక దాని ఊసెత్తడం లేదు. ఉద్యమం సమయంలో చేసిన వాగ్ధానాల గురించే కాకుండా, ఎన్నికల ప్రణాళికలలో ఇచ్చిన హామీలను గురించి కూడా పట్టించుకోవడం లేదు.

ఇప్పుడు అకస్మాత్తుగా నరేంద్ర మోదీ ప్రభుత్వం విశాఖ స్టీల్ ను ప్రైవేట్ పరం చేయకుండా అడ్డుకోవడం కోసం అంటూ తెలంగాణ ప్రభుత్వమే కొనుగోలుకు ఆసక్తి వ్యక్తం చేస్తూ బీడ్ దాఖలు చేయాలని కేసీఆర్ నిర్ణయించడం కలకలం రేపుతోంది.
 కేవలం జాతీయ రాజకీయాలలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ రంగసంస్థలను ప్రైవేట్ పరం చేసే ప్రయత్నాలను అడ్డుకొవడం ద్వారా రాజకీయంగా మైలేజ్ పొందాలనే ఆలోచన కాకుండా, తమ కుటుంభంకు ఆర్థికపరమైన ప్రయోజనాలకోసం కేసీఆర్ ఎత్తుగడ వేస్తున్నారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.

గతంలో ఎన్నడూ ఏపీకి సంబంధించిన సమస్యల గురించి ప్రస్తావించని మంత్రి కేటీఆర్ సరిగ్గా పక్షం రోజుల క్రితం విశాఖ స్టీల్ ను ప్రైవేట్ పరం చేయవద్దంటూ ప్రధాని నరేంద్ర మోదీకి బహిరంగ లేఖ వ్రాసారు. ఈ విషయమై ఏపీలో ప్రధాన రాజకీయ పక్షాలైన వైసిపి, టిడిపి మొక్కుబడిగా ప్రైవేట్ పరం చేయవద్దని ఓ లేఖ, ఓ ప్రకటన చేయడం మినహా పట్టించుకోవడం లేదు.

నిరుద్యోగ భృతి, రుణమాఫీ వంటి ఎన్నికల హామీల అమలుకు నిధులు లేక సతమవుతున్న కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగులకు మొదటి తేదీన జీతాలు ఇవ్వడానికి సహితం ఎంతో కష్టపడుతున్నారు. ఇక దళిత బంధు వంటి ఎన్నికలను ఉద్దేశించి అమలు చేస్తున్న పథకాలకు సహితం నిధుల కొరత ఎదురవుతుంది. అటువంటిది విశాఖ స్టీల్ కొనుగోలుకు నిధులు ప్రభుత్వ పరంగా సమకూర్చుకోవడం సాధ్యమయ్యే విషయం కానేకాదు.

అందుకనే, ప్రైవేట్ భాగస్వాములు ఉండక తప్పది. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కేసీఆర్ ల మధ్య అంతర్గతంగా సన్నిహిత సంబంధాలు ఉండటం బహిరంగ రహస్యమే. వారిద్దరూ కలసి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజకీయంగా నిలదొక్కుకోకుండా ఎప్పటికప్పుడు ఎత్తుగడలు వేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ కు బీడ్ వేసే విషయంలో సహితం వారిద్దరూ కూడబలుక్కొని వ్యవహరించే అవకాశం ఉంది.

బీడ్ లో స్టీల్ ప్లాంట్ చేతికి వచ్చినా దానిని నిర్వహించే సామర్థ్యం తెలంగాణ ప్రభుత్వం వద్ద ఉందని చెప్పలేము. అందుకు నైపుణ్యం కలిగిన ప్రైవేట్ వ్యక్తుల భాగస్వామ్యం తప్పనిసరి అవుతుంది. ప్రభుత్వం బీడ్ దక్కించుకున్నప్పటికీ పరోక్షంగా ప్రైవేట్ వ్యక్తుల చేతులకు ప్లాంట్ చేరక తప్పదు. స్టీల్ ప్లాంట్ కు అపారమైన ల్యాండ్ బ్యాంకు ఉంది. ఇప్పుడు దీనిని సొంతం చేసుకోవాలని చూస్తున్న వారందరి కన్ను ఆ ల్యాండ్ బ్యాంకు పైననే ఉంది.

ఫ్యాక్టరీని నడిపినా, నడపక పోయినా ఆ భూములను అమ్ముకొని మస్తుగా సంపాదించవచ్చని ఆలోచనలు చెలరేగుతున్నాయి. ఆ ఎత్తుగడలో భాగంగానే స్టీల్ ప్లాంట్ కు బీడ్ వేయాలనే ఆలోచన కేసీఆర్, జగన్ కలసి చేస్తున్నట్లు భావించవలసి ఉంటుంది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం సహితం కేసీఆర్, జగన్ ల పట్ల సానుకూలంగా వ్యవహరించే అవకాశం లేకపోలేదు.

తెలంగాణ ప్రభుత్వంకు సింహభాగం వాటా ఉన్న సింగరేణి కాలరీస్, రాష్త్ర ప్రభుత్వ సంస్థ అయిన మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వంటి వాటి ద్వారా బీడ్ వేయించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు చెప్తున్నారు. అయితే, ప్రభుత్వ సంస్థలు మాత్రమే బీడ్ వేస్తాయా? ప్రైవేట్ సంస్థలతో కూడా కలిసి వేస్తాయా? చూడవలసి ఉంది. ముందు ప్రభుత్వ సంస్థలు బీడ్ దక్కించుకొని, ఆ తర్వాత ప్రైవేటు సంస్థలను చేర్చుకొని అవకాశాలు లేకపోలేదు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles