మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తులో నాలుగేళ్లుగా ప్రస్తావనకు రాని అనేక అంశాలను ఒకసారి వెలుగులోకి వస్తుండటం, ఆరోపణలు అన్ని కుటుంభం సభ్యులపై కేంద్రీకృతం అవుతూ ఉండడంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శిబిరం ఖంగారుకు గురవుతున్నట్లు తెలుస్తున్నది.
2019 ఎన్నికల ముందు జరిగిన ఈ హత్యలో అప్పటి అధికార పక్షం టిడిపి నేతలను దోషులుగా చూపే ప్రయత్నం చేసి, ఎన్నికల్లో కొంత మేరకు లబ్ది పొందిన వైసీపీ నేతలకు ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా ప్రతికూలంగా మారుతున్నాయి.
మరో ఏడాదిలో ఎన్నికలు జరుగనున్న సమయంలో సీఎం జగన్ కు సన్నిహితంగా ఉండే బాబాయి వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్ట్ కావడం, ప్రస్తుతం సిబిఐ విచారణను ఎదుర్కొంటున్న ఆయన కుమారుడు, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సహితం అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలియడంతో జగన్ బృందం ఉక్కిరి బిక్కిరి అవుతోంది.
పైగా, తమ కుటుంభం సభ్యులను లక్ష్యంగా చేసుకొని జగన్ సోదరి, వివేకానందరెడ్డి కుమార్తె డా. సునీత రెడ్డి ఢిల్లీ వరకు వెళ్లి పోరాటం చేస్తూ, పట్టువదలని విక్రమార్కుని మాదిరిగా సుప్రీంకోర్టు ప్రత్యక్షంగా ఈ కేసు పురోగతిని పర్యవేక్షించే విధంగా చూడడంతో మరింత ఆందోళనకు గురవుతున్నారు.
ఈనెల 30లోగా కేసు దర్యాప్తు పూర్తి నివేదికను సీబీఐ సుప్రీం కోర్టుకు సమర్పించాల్సి ఉంది. ఇప్పటి వరకు హత్యా ఏవిధంగా జరిగినదని దానిపై దృష్టి సారిస్తున్న సిబిఐ హత్య వెనుకగల కుట్ర కోణాన్ని సహితం బహిర్గతం చేయాల్సి ఉంది.
ఈ సందర్భంగా హత్య చేసేందుకు రూ 40 కోట్లు చెల్లించే విధంగా డీల్ కుదుర్చుకున్నట్లు ఇప్పటికే నిర్ధారించిన కేంద్ర దర్యాప్తు సంస్థ, ఇప్పుడు అంత పెద్ద మొత్తం ఎవ్వరు సమకూర్చడానికి సిద్ధపడ్డారని అంశంపై తేల్చవలసి ఉంది.
డీల్‌లో భాగంగా కోటి రూపాయలు సునీల్ యాదవ్‌కు అందించగా ఆ డబ్బంతా ఎక్కడి నుంచి తెచ్చారో కూడా తేల్చాల్సి ఉంది. ఈ కోణంలోనే గత మూడురోజుల విచారణలో అవినాష్ రెడ్డి, భాస్కరరెడ్డి, ఉదయ్‌కుమార్ రెడ్డిలపై సీబిఐ ప్రశ్నలు సంధిస్తున్నట్లు తెలుస్తున్నది.
అంటే అంత డబ్బు పెట్టాల్సిన అవసరం ఎవరికి ఉంటుందనేది తేలితే వారే ప్రధాన కుట్రదారులుగా తేలిపోతుంది. అందుకే మనీ లాండరింగ్ కోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేపట్టేందుకు రంగంలోకి దిగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇంత పెద్ద మొత్తంలో సుపారీ ఇచ్చి మరీ వైఎస్ వివేకాను చంపించాల్సిన అవసరం ఏమిటనేది ఇప్పుడు కీలకంగా మారిపోయింది.
ఈ కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి తనకు రూ. కోటి అందాయని చెప్పాడు. సునీల్ యాదవ్‌కు కోటి ఇచ్చినట్లు సీబి ఐ విచారణలో వెల్లడైంది. ఈ నేపథ్యంలో ఆడ బ్బు లావాదేవీలే కేసు వెనుక ఉన్న ప్రధాన కారణంగా భావిస్తున్న సీబిఐ అనుమానంతో రంగంలోకి దిగిన ఈడీ ఇప్పటికే కేసుకు సంబంధించి పూర్వాపరాలు అధ్యయనం చేసినట్లు తెలుస్తోంది.
ప్రారంభం నుంచీ కేసు అధ్యయనం చేసిన ఈడీ అధికారులు ఇక నేరుగా ఈ 40 కోట్ల సమీకరణ మూలాలు తేల్చేందుకు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపధ్యంలోనే ఈడీ ప్రవేశంతో 40 కోట్ల అంశం తేల్చడంతోపాటు కొద్దిరోజుల్లో మరికొంతమంది కీలకమైన వ్యక్తులకు నోటీసులు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది.