వైఎస్‌ సునీత రాజకీయ ప్రవేశం అంటూ పోస్టర్ల కలకలం

Friday, November 15, 2024

వైఎస్‌ సునీత రాజకీయ ప్రవేశం చేయబోతున్నారంటూ కడపజిల్లా ప్రొద్దుటూరులో పోస్టర్లు వెలవటం కలకలం రేపుతోంది. ప్రస్తుతం ఏపీలో రాజకీయాలన్నీ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు చుట్టూనే తిరుగుతున్న సమయంలో, ఆయన కుమార్తెపై ఇటువంటి పోస్టర్లు రావడం సంచలనం కలిగియున్నది.

ఇప్పటికే ఈ కేసులో వివేకానందరెడ్డి సోదరుడు భాస్కర్‌ రెడ్డి అరెస్ట్‌ కాగా, త్వరలోనే కడప ఎంపీ అవినాష్‌ రెడ్డిని అరెస్ట్‌ చేస్తారని ప్రచారం జరుగుతుంది. ఈ తరుణంలోనే ఇటువంటి పోస్టర్లు రావడం రాజకీయ దురుద్దేశ్యంతో చేసిన పనిగా పలువురు అనుమానిస్తున్నారు.

వై.యస్. సునీత రాజకీయ రంగ ప్రవేశం చేస్తుందంటూ గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి కి రాత్రి పట్టణంలో పోస్టర్లు అతికించారు. పోస్టర్ లలో వై.యస్.వివేకా, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు,  నారా లోకేష్, అచ్చెన్నాయుడు, బీటెక్ రవి, శ్రీనివాసులరెడ్డితో పాటూ వైఎస్ వివేకా ఫోటో కూడా ఉంది. 

అయితే, ఈ ఫోటోలు ఎవరు అతికించారనే విషయం తెలియడం లేదు. కొంతకాలంగా కొందరు వైఎస్సార్‌సీపీ వైఎస్ సునీతారెడ్డి టీడీపీ నేతలతో టచ్‌లో ఉన్నారంటూ ఆరోపణలు చేస్తున్నారు. ఆమె చంద్రబాబు నాయుడుతో కలిసి, సిబిఐని ప్రభావితం చేసి వైఎస్ అవినాష్ రెడ్డిని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారని కూడా ఆరోపిస్తున్నారు.

మరోవంక, ఆమె వచ్చే లోక్ సభ ఎన్నికలలో కడప నుండి టిడిపి అభ్యర్థిగా అపోటీచేయబోతున్నారని అంటూ కూడా ఒక వార్త వైరల్ అయింది.  ఆమె గతంలో పలు సందర్భాలలో తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని స్పష్టం చేశారు. తాను కేవలం తన తండ్రి హంతకులు ఎవ్వరో తేల్చి, శిక్ష పాడేటట్లు చేయడం కోసమే న్యాయపోరాటం చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

ఆమె సుప్రీంకోర్టు వరకు వెళ్లి పోరాటం చేయడం వల్లననే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంతగా వ్యతిరేకించినా ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పచెప్పడం జరిగింది. పైగా, ఏపీలో దర్యాప్తుకు ఆటంకాలు కలుగుతున్నాయని ఆమె ఆరోపించడం తోనే దర్యాప్తును తెలంగాణ హైకోర్టుకు మార్చారు.

తాజాగా, తెలంగాణ హైకోర్టు అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ తాత్కాలికంగా ఇవ్వడాన్ని ఆమె సవాల్ చేస్తూ, సుప్రీంకోర్టు వరకు వెళ్లి రద్దు చేయించారు. అందుచేత, ఆమె పట్ల జగన్ ప్రభుత్వం ఆగ్రహంతో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది.

ఇలా ఉండగా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు వైసీపీ నాయకులు ప్రొద్దుటూరును ఎంచుకున్నారని ఈ పోస్టర్లపై స్పందిస్తూ స్థానిక టీడీపీ ఇన్‌చార్జి ప్రవీణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. వివేకా హత్య కేసును డైవర్ట్ చేసేందుకే వైఎస్ సునీత రాజకీయ ప్రవేశమంటూ వైసీపీ శ్రేణులు పోస్టర్లు అంటించారని ఆయన విమర్శించారు.

సునీత పోస్టర్లు ఎవరు అంటించారో గుర్తించి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఆ పోస్టర్లో టీడీపీ నేతల ఫొటోలు వేశారని అంటూ వాటితో తమకు ఎలాంటి సంబంధం లేదని ప్రవీణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles