బీఆర్ఎస్ పార్టీపై తిరుగుబావుటా ఎగురవేసిన ఉమ్మడి ఖమ్మం జిల్లా కీలక నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తాను చేరబోయే పార్టీ విషయంలో మాత్రం గుంభనంగా వ్యవహరిస్తున్నారు. తొలుత బీజేపీలో చేరబోతున్నామనే సంకేతాలు ఇచ్చారు. సంక్రాంత్రి కాగానే జనవరి 18న కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాను కలవబోతున్నరని, ఆ పార్టీలో చేరే విషయమై చర్చింపనున్నారని కధలు వచ్చాయి.
అయితే, ఈ కథనాలను ఇటు బిజెపి గాని, అటు ఆయన గాని ఖండించనే లేదు. పైగా, ఆయన తమ పార్టీలో చేరే అవకాశాలున్నట్లు కొందరు బిజెపి నాయకులు చెప్పుకొంటూ వచ్చారు. అయితే ఇప్పుడు ఆ ప్రస్తావనే తేవడం లేదు. దానితో బిఆర్ఎస్ నాయకులతోనే సర్దుబాటు చేసుకొంటున్నారా? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. వచ్చే ఎన్నికలలో తన సీట్ కు హామీ ఇస్తే, పార్టీలో కొనసాగడానికి సిద్ధంగా ఉన్నారనే వార్తలు కూడా వచ్చాయి.
అయితే, తాజాగా మధిర నియోజకవర్గంలో జరిపిన ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడిన తీరు గమనిస్తే ఆయన ఆ పార్టీలో కొనసాగే అవకాశం లేదని స్పష్టం అవుతున్నది. అంతేకాదు, బిఆర్ఎస్ నేతలు సహితం ఆయనను తమ పార్టీలో ఉంచుకోవాలని అనుకోవడం లేదు. ఆ పార్టీలో తనను తనను నమ్ముకున్న కార్యకర్తలను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేశారని, అధికారమదంతో కొందరు తనను ఎన్నో ఇబ్బందులకు గురిచేశారని అంటూ తీవ్రంగా ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ పెద్దల మాట విని.. లక్షల మందితో ఆ పార్టీలో చేరితే నమ్మకద్రోహం చేశారని మండిపడ్డారు.
ఎవరు అడ్డుకున్నా.. ఏ గూటి పక్షి ఆ గూటికే చేరుతుందని పేర్కొనడం ద్వారా ఈ సందర్భంగా తాను చేరబోయే పార్టీ గురించి స్పష్టమైన సంకేతం ఇచ్చారని స్పష్టం అవుతుంది. సరిగ్గా ఇవే మాటలను కొన్ని రోజుల క్రితం వైఎస్ షర్మిల కూడా అనడం గమనార్హం. అందుకనే ఆయన వైఎస్‌ఆర్‌టీపీ వైపు మొగ్గు చూపుతున్నారన్న ప్రచారం నడుస్తోంది.
గత వారం షర్మిల ఆయనతో ఫోన్లో మాట్లాడారు కూడా. ఆ తర్వాత వారిద్దరూ కలుసుకున్నట్టు చెబుతున్నారు. 2014లో లోక్ సభ ఎన్నికలలో మొదటిసారిగా పోటీచేసినప్పటి నుండి ఆయనకు షర్మిలతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఆ సమయంలో ఎన్నికల ప్రహకారంకోసం ఆమె ఖమ్మం ప్రాంతంలో పర్యటనలు కూడా జరిపారు.
సొంతంగా పార్టీ ప్రారంభించిన తర్వాత పాలేరు నుండి అసెంబ్లీకి పోటీ చేయాలని షర్మిల ప్రకటించడం పొంగులేటి అండచూసుకొనే అని అందరికి తెలిసిందే. ఏ పార్టీలో ఉన్నా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొన్ని సీట్లను సొంతంగా గెలిపించుకోగల సామర్ధ్యం ఆయన పెంచుకున్నట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
మొదట్లో వ్యాపార ప్రయోజనాలకోసం బీజేపీలో చేరాలని ఆసక్తి చూపినా ఆయన మద్దతుదారులు అందరూ నిరుత్సాహపరచిన్నట్లు తెలుస్తున్నది. ఖమ్మం జిల్లాలో అసలు ఉనికిలో లేని పార్టీలో చేరితో రాజకీయంగా బ్రష్టుపట్టిన్నట్లు కాగలదని హెచ్చరించారు. పైగా, తాము ఆయనతో పాటు బిజెపిలోకి రామని స్పష్టం చేశారు. దానితో ఆయన ఆ నిర్ణయం మార్చుకున్నట్లు తెలుస్తున్నది.
పైగా, తెలంగాణాలో బీజేపీలో చేరిన ఇతర పార్టీల సీనియర్ నాయకుల పట్ల ఇతర బిజెపి నాయకులు వ్యవహరిస్తున్న తీరుతెన్నులు చూస్తున్న పొంగులేటి ఆ పార్టీలో చేరాలనే ఆసక్తి సన్నగిల్లిన్నట్లు స్పష్టం అవుతుంది.